Krishna Janmashtami: దివ్య లీల
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:52 AM
ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకొనే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పవిత్రమైన రోజు మన జీవితాల్లో ఆధ్యాత్మిక...
రేపు శ్రీకృష్ణాష్టమి
ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకొనే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పవిత్రమైన రోజు మన జీవితాల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపుతుంది. శ్రీకృష్ణుని దివ్య ఆవిర్భావ లీలను తెలియజేస్తుంది. మనకు, భగవంతుడికి ఉన్న సనాతనమైన బంధాన్ని గుర్తు చేస్తుంది.
శ్రీకృష్ణుడు సకల సృష్టికీ మూల పురుషుడు. ఆయన రూపం, నామం, లీలలు, గుణగణాలు... అన్నీ ఆకర్షణీయమైనవే. శ్రావణ మాసంలోని బహుళ పక్ష అష్టమి రోజున ఆయన అవతరించాడు కాబట్టి... ఆ తిథి ‘శ్రీకృష్ణ జన్మాష్టమి’గా ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుని జననం సాధారణ శిశువుల మాదిరిగా సంభవించినది కాదు. ఎందుకంటే ఆయన పుట్టుక లేనివాడు. దేవాదిదేవుడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి తన స్వీయ సంకల్పంతోనే అవతరిస్తాడు గానీ.. భౌతిక ప్రకృతి నియమాలకు బద్ధుడై కాదు. శ్రీకృష్ణుడు ఈ లోకంలో... మానవుల మధ్య జన్మించడం ఆయన దివ్య లీలల్లో ఒకటి. మథురలోని కంసుడి కారాగారంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు... శంఖ, చక్ర, గదా, పద్మాలతో... చతుర్భుజ విష్ణుమూర్తిగా దర్శనమిచ్చాడు. ఆ తరువాత తల్లి దేవకి ప్రార్థించడంతో... సామాన్య బాలుడిగా రూపాంతరం చెందాడు. కేవలం ఏడేళ్ళ వయసులో... తన చిటికెన వేలు మీద గోవర్ధన పర్వతాన్ని నిలబెట్టడం ఆయన అసాధారణ శక్తిని నిరూపిస్తుంది. సజ్జనులను రక్షించి, దుర్జనులను శిక్షించి, ధర్మాన్ని పునఃస్థాపించడానికి తాను యుగయుగానా అవతరిస్తానని ఆయన స్వయంగా ప్రకటించాడు.
శ్రీకృష్ణాష్టమినాడు ఏం చేయాలి?
శ్రీకృష్ణాష్టమినాడు ఆ శ్రీకృష్ణుని కృపను పొందడానికి భక్తులు కొన్ని ఆచారాలను పాటిస్తారు. వాటిలో ముఖ్యమైనవి: స్వామి ఆవిర్భవించిన సమయమైన అర్ధరాత్రి పన్నెండు గంటల వరకూ ఉపవాసం ఉండడం. ఆరోగ్యం సహకరించనివారు పండ్లు, పాలు, ఇతర ప్రసాదాలను తీసుకోవచ్చు. హరేకృష్ణ మంత్రాన్ని జపించడం ముఖ్యమైన విధిగా భావించాలి. కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి. భగవద్గీత, శ్రీమద్భాగవతం లాంటి గ్రంథాల నుంచి శ్రీకృష్ణుని లీలలను, ఉపదేశాలను పఠించడం పుణ్యప్రదం. శ్రీకృష్ణుని ఆలయాలకు వెళ్ళి, ఆయన సుందర రూపాన్ని దర్శించాలి. ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో శ్రీకృష్ణుని విగ్రహానికి లేదా చిత్రపటానికి హారతి ఇవ్వాలి, తులసీదేవిని పూజించాలి.
ప్రభుపాదుల కృషితో విశ్వవ్యాప్తం
వివిధ కారణాల రీత్యా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆలయాలకు వెళ్ళలేని భక్తులు కూడా శ్రీకృష్ణుడి అపారమైన కృపను పొందవచ్చు. శ్రీ చైతన్య మహాప్రభువు బోధించినట్టు... కపటంతో, కలహాలతో నిండిన కలియుగంలో హరినామ సంకీర్తనమే ఏకైక ముక్తి మార్గం. ‘హరేకృష్ణ’ మంత్ర జపం కలి కల్మషాలను నాశనం చేస్తుంది. హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులు శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రపంచమంతటా వ్యాప్తి చేయడంలో అపారమైన కృషి చేశారు. 1965లో... 70 ఏళ్ళ వయసులో... కేవలం నలభై రూపాయలు, కొన్ని శ్రీమద్భాగవత గ్రంథాలతో ఆయన అమెరికా బయలుదేరారు. భగవద్గీతా సారాన్ని, ‘హరేకృష్ణ’ నామాన్ని పశ్చిమ దేశాల్లో ప్రచారం చేశారు. ఆరు ఖండాల్లో 108 కృష్ణ దేవాలయాలను స్థాపించారు. ప్రపంచంలోని ప్రసిద్ధ నగరాల్లో జగన్నాథ రథ యాత్రలను నిర్వహించి, ఆలయాన్నే ప్రజల దగ్గరకు తీసుకువచ్చారు. శ్రీకృష్ణ చైతన్యంపై 70కి పైగా గ్రంథాలను రచించారు. ఆయన స్ఫూర్తితో... హైదరాబాద్‌లోని ‘హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్’లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. రాధాగోవిందులు, స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న ఈ ఆలయంలో... సప్త నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలతోను, పంచామృతంతోను అభిషేకం, ఊంజల్ సేవ, సంకీర్తనాలాపన, జపం, అన్నదానం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటిలో భక్తులు ఉచితంగా పాల్గొనవచ్చు. అలాగే హైదరాబాద్‌లోని నార్సింగిలో నిర్మితమవుతున్న హరేకృష్ణ హెరిటేజ్ టవర్, సంగారెడ్డి జిల్లా కందిలోని హరేకృష్ణ కల్చరల్ సెంటర్‌లలో కూడా ఈ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్,
హైదరాబాద్, 9396956984
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ