Delicious Velakkaya Recipes: వెలక్కాయతో వెరైటీ రుచులు
ABN , Publish Date - Sep 13 , 2025 | 02:14 AM
వెలక్కాయలో పుల్లటి గుజ్జు ఉంటుంది. దానితో రకరకాల వంటకాలు చేస్తూ ఉంటాం. అదే వెలక్కాయ పండితే గుజ్జుకు కొద్దిగా తియ్యదనం వస్తుంది. ఈ గుజ్జులో బెల్లం లేదా చక్కెర కలుపుకొని పిల్లలు ఇష్టంగా తింటూ....
వంటిల్లు
వెలక్కాయలో పుల్లటి గుజ్జు ఉంటుంది. దానితో రకరకాల వంటకాలు చేస్తూ ఉంటాం. అదే వెలక్కాయ పండితే గుజ్జుకు కొద్దిగా తియ్యదనం వస్తుంది. ఈ గుజ్జులో బెల్లం లేదా చక్కెర కలుపుకొని పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు. సీజనల్‌గా దొరికే పుల్లటి వెలక్కాయలతో చేసే వెరైటీ రుచులు మీకోసం...
వెలక్కాయ పులిహోర
కావాల్సిన పదార్థాలు
ఫ బియ్యం- ఒక కప్పు, వెలక్కాయ- ఒకటి, నూనె- రెండు చెంచాలు, ఆవాలు- అర చెంచా, జీలకర్ర- అర చెంచా, పచ్చి శనగపప్పు- ఒక చెంచా, మినప్పప్పు- ఒక చెంచా, పల్లీలు- కొన్ని, జీడిపప్పు- కొన్ని, ఎండు మిర్చి- రెండు, ఇంగువ- చిటికెడు, పసుపు- పావు చెంచా, కరివేపాకు- కొద్దిగా, పచ్చిమిర్చి- మూడు, ఉప్పు- అర చెంచా
తయారీ విధానం
బియ్యాన్ని కడిగి నీళ్లు పోసి పావుగంటసేపు నానబెట్టాలి. తరువాత పొడి పొడిగా ఉండేలా అన్నం వండుకోవాలి.
వెలక్కాయను పగులగొట్టి లోపలి గుజ్జును పళ్లెంలోకి తీయాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి అర కప్పు నీళ్లు పోసి మరిగించాలి. అందులో వెలక్కాయ గుజ్జు వేసి బాగా కలిపి నాలుగు నిమిషాలు ఉడికించి దించాలి.
స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఎండు మిర్చి, పల్లీలు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, జీడిపప్పు వేసి దోరగా వేపాలి. తరవాత ఉడికించిన వెలక్కాయ గుజ్జు, ఉప్పు వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఈ తాలింపు మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. అంతే... కమ్మని వెలక్కాయ పులిహోర రెడీ..!
కాల్చిన వెలక్కాయతో పచ్చడి
కావాల్సిన పదార్థాలు
వెలక్కాయలు- రెండు, పచ్చిమిర్చి- పది, జీలకర్ర- ఒక చెంచా, ఉప్పు- తగినంత, బెల్లం- చిన్న ముక్క, కొత్తిమీర- కొద్దిగా
తయారీ విధానం
వెలక్కాయలను కొద్దిగా పగులగొట్టాలి. వాటి మీద చిన్న బీటలు వస్తే చాలు. స్టవ్ వెలిగించి, గ్రిల్ పెట్టి దాని మీద వెలక్కాయలను ఉంచి, అన్ని వైపులకూ తిప్పుతూ నల్లగా కాల్చాలి. ఆపైన స్టవ్ మీద నుంచి తీసి చల్లార్చాలి. వాటి లోపల ఉండే గుజ్జును చెంచా సహాయంతో ఒక పళ్లెంలోకి తీయాలి. కొత్తిమీరను కాడలు తుంచి నీళ్లతో శుభ్రంగా కడగాలి. మిక్సీలో జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, బెల్లం, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. వెలక్కాయ గుజ్జును కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. తరువాత గిన్నెలోకి తీసి ఉప్పు సరిచూడాలి. ఇలా తయారుచేసుకున్న పచ్చడిని వేడి అన్నంలో కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది.
వెలక్కాయ క్యాండీ
కావాల్సిన పదార్థాలు
పండిన వెలక్కాయ- ఒకటి, బెల్లం- ఒక కప్పు, నిమ్మరసం- రెండు చెంచాలు, నల్ల ఉప్పు- అర చెంచా, కారం- అర చెంచా, జీలకర్ర పొడి- అర చెంచా, పంచదార పొడి- అర కప్పు, నెయ్యి- పావు చెంచా
తయారీ విధానం
పండిన వెలక్కాయ నుంచి గుజ్జు తీయాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. అందులో వెలక్కాయ గుజ్జు వేసి బాగా కలుపుతూ అయిదు నిమిషాలు ఉడికించి దించాలి. ఈ గుజ్జును స్ట్రయినర్‌లో వేసి చిక్కని రసాన్ని వడబోయాలి. ఈ రసాన్ని బ్లెండర్‌తో బాగా కలపాలి. లేదంటే మిక్సీలో వేసి రెండు నిమిషాలు గ్రైండ్ చేసినా సరిపోతుంది.
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో వెలక్కాయ రసం, బెల్లం వేసి బాగా కలపాలి. బెల్లం పూర్తిగా కరిగాక అందులో నిమ్మరసం, నల్ల ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం... గిన్నెకు అంటుకోకుండా దగ్గరకు వచ్చేదాకా ఉడికించాలి. తరువాత నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసి సమంగా పరచాలి. చల్లారిన తరవాత ముక్కలుగా కోయాలి. ఈ ముక్కల మీద చక్కెర పొడి చల్లి బాగా కలపాలి. పుల్లగా, తియ్యగా ఉండే ఈ క్యాండీలు ఆర్నెల్లపాటు నిల్వ ఉంటాయి.
వెలక్కాయలో ఉండే సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె జబ్బులను నివారిస్తాయి. వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం, అల్సర్ లాంటి సమస్యలకు వెలక్కాయ ఔషధంలా పనిచేస్తుంది.
వెలక్కాయతో చేసిన వంటకాలు తినడం వల్ల పొట్టలో పేరుకున్న గ్యాస్ తొలగిపోతుంది. అలసట, నీరసం, మూత్రపిండాల సమస్యలు మాయమవుతాయి. కాలేయం పూర్తిగా శుభ్రపడుతుంది. జీర్ణక్రియ వేగవంతమవుతుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News