Kids Health: తలలో పేలు తగ్గాలంటే..!
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:17 AM
బడికి వెళ్లే పిల్లలకు తరచూ తలలో పేలు చేరుతుంటాయి. వీటివల్ల పిల్లల్లో రక్తహీనత, శిరోజాలు రాలిపోవడం, ఎదుగుదల ఆగిపోవడం వంటి సమస్యలు వస్తాయి. తలలో పేలు పడ్డాయని తెలిసిన వెంటనే వాటిని తొలగించేందుకు నిపుణులు చెబుతున్న చిట్కాలివి...

తలలో పేల సమస్య పోవాలంటే శిరోజాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కుంకుడు కాయ లేదంటే శీకాయ పొడితో ప్రతిరోజూ తలస్నానం చేయాలి. దీనివల్ల వెంట్రుకలకు పట్టి ఉన్న ఈపు(పేల గుడ్లు) రాలిపోతుంది. వారం రోజుల్లో పేలు కూడా తగ్గుతాయి. ఒక గ్లాసు నీళ్లలో రెండు చెంచాల త్రిఫల చూర్ణం కలిపి ఆ నీటిని మాడుకు పట్టిస్తే పేలు రాలిపోతాయి.
ఒక గిన్నెలో అయిదు చెంచాల కొబ్బరి నూనె వేసి కొద్దిగా వేడి చేయాలి. అందులో మూడు కర్పూరం బిళ్లలను వేళ్లతో చిదిమి పొడిలా చేసి కలపాలి. రాత్రి పడుకునేముందు ఈ నూనెని మాడుకి, వెంట్రుకలకు పట్టించాలి. శిరోజాలను ముడిపెట్టి తలకు పలుచని వస్త్రాన్ని చుట్టాలి. ఉదయాన్నే మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే పేలన్నీ పోతాయి.
ఒక కప్పు పెరుగులో రెండు చెంచాల నిమ్మరసం పిండి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పది నిమిషాల తరవాత తలస్నానం చేస్తే తలలో పేల సమస్య తీరిపోతుంది.
గుప్పెడు వేపాకులు, కొన్ని తులసి ఆకులు తీసుకుని ముద్దలా నూరి అందులో చిటికెడు పసుపు, రెండు చెంచాల కొబ్బరి నూనె కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. పావు గంట తరవాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది
ఒక గిన్నెలో మూడు చెంచాల కొబ్బరి నూనె, ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని తలంతా రాయాలి. పది నిమిషాల తరవాత దువ్వెనతో కుదుళ్ల నుంచి వెంట్రుకల చివరి వరకు సున్నితంగా దువ్వితే పేలన్నీ రాలిపోతాయి.
మూడు చెంచాల వేపనూనెని గిన్నెలో వేసి కొద్దిగా వేడిచేయాలి. ఈ నూనెని మాడు మీద, వెంట్రుకలకు పట్టించాలి. అరగంట తరవాత దువ్వెనతో వేగంగా దువ్వితే పేలన్నీ బయటికి వచ్చేస్తాయి.
కుటుంబ సభ్యులందరూ ఒకే దువ్వెన వాడడం వల్ల పేలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. తలలో పేలు పడ్డాయని తెలిసిన వెంటనే పిల్లలకు వేరే దువ్వెన, దిండు ఏర్పాటు చేయాలి. వాటిని కూడా నిత్యం శుభ్రం చేస్తూ ఉంటే సమస్య పెరగకుండా ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా
Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..
Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
Read More National News and Latest Telugu News