Brinda Miller: కుంచెతో చైతన్యం
ABN , Publish Date - Dec 04 , 2025 | 02:29 AM
కళాకారుల ఊహల్లో పుట్టి... వారి చేతుల్లో ప్రాణం పోసుకున్న చిత్రరాజాలు గ్యాలరీలకే పరిమితమా! కాదంటారు ప్రముఖ కళాకారిణి బృందా మిల్లర్. అందుకే ఆ అద్భుతాలను ప్రజల...
అభిరుచి
కళాకారుల ఊహల్లో పుట్టి... వారి చేతుల్లో ప్రాణం పోసుకున్న చిత్రరాజాలు గ్యాలరీలకే పరిమితమా! కాదంటారు ప్రముఖ కళాకారిణి బృందా మిల్లర్. అందుకే ఆ అద్భుతాలను ప్రజల మధ్యకు తీసుకువచ్చారు. కాదేదీ కాన్వాస్‌కు అనర్హం అంటూ... వీధి గోడలు, ఆసుపత్రులు, పార్కులు, విమానాశ్రయాలకు ఆహ్లాదకర చిత్రాలతో వన్నెలద్దారు. వారసత్వ సంపదను పరిరక్షించే బాధ్యతను చేపట్టారు. ఔత్సాహికులను, కళాభిమానులను ఒకచోట చేర్చి... భావి కళాకారులుగా తీర్చిదిద్దుతున్న బృంద జర్నీ ఇది.
‘‘నా మనసు చిత్రకళ వైపు ఎప్పుడు ఎలా మళ్లిందో నాకు తెలియదు. చిన్నప్పుడే అది నన్ను ఆకర్షించింది. నాకు ప్రేరణనిచ్చింది. కళాకారిణిగా ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చింది. ఇన్ని దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు... సవాళ్లు... సమస్యలు. కానీ అన్నిటినీ తట్టుకొని నిలబడే ఆత్మస్థైర్యాన్ని, ఉన్నతమైన స్థానాన్ని ఈ కళ నాకు ఇచ్చింది. నా బాల్యం, విద్యాభ్యాసం, నా జీవన గమనమంతా ముంబయి మహానగరంతోనే ముడిపడి సాగుతోంది. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే నాలోని కళాకారిణికి దృఢమైన పునాది పడింది. తరువాత ‘క్వీన్స్ మేరీ స్కూల్’లో చేరాను. అక్కడ మనలోని సృజనకు పదును పెట్టి, కళల్లో ప్రోత్సహించేవారు. నాలో ఉత్సాహం రెట్టింపయింది. చిత్రలేఖనం కొనసాగించగలననే ఆత్మవిశ్వాసం కలిగింది. ఈ రంగంలోనే స్థిరపడాలన్న కోరికను బలపరిచింది.
మరింత నైపుణ్యం కోసం...
మొదట్లో చిన్న చిన్న డ్రాయింగ్స్, పెయింటింగ్స్ వేసిన నేను క్రమంగా పట్టు సాధించాను. అంతటితోనే సరిపెట్టుకోవాలని అనుకోలేదు. నాలోని నైపుణ్యానికి మరింత పదును పెట్టాలన్న ఉద్దేశంతో ముంబయిలోని ‘సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్’కు వెళ్లాను. టెక్స్‌టైల్ డిజైనింగ్‌లో స్పెషలైజేషన్ చేశాను. ఆ కోర్సు డిజైనింగ్ అంశాలపై అవగాహన కలిగించడమే కాకుండా, నాలోని ఆలోచనలను అద్భుతమైన కళాఖండాలుగా ఆవిష్కరించగలిగే సామర్థ్యాన్ని ఇచ్చింది. అనంతరం, అంటే 1989లో ఆమెరికాలోని న్యూయార్క్ వెళ్లాను. అక్కడి ‘స్కూల్ ఆఫ్ పార్సన్స్’లో డ్రాయింగ్, పెయింటింగ్‌లో మెళకువలు నేర్చుకున్నాను. ఈ ప్రయాణంలో ప్రతి అడుగూ కళ పట్ల నాకున్న మక్కువను, ఆసక్తిని రెట్టింపు చేసింది. సృజనాత్మక వ్యక్తీకరణకు అంకితమైన నా జీవితానికి సరైన దిశను నిర్దేశించింది.
ఉద్యోగంలో చేరినా...
నా చదువు అయిపోగానే ‘కటావూ మిల్స్’లో టెక్స్‌టైల్ డిజైనర్‌గా ఉద్యోగం వచ్చింది. మంచి ఉద్యోగం. కోరుకున్న జీతం. కానీ కొన్నాళ్లకు నాలో ఏదో అసంతృప్తి మొదలైంది. నాలోని సృజనను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేక పోతున్నాననే భావన కలిగింది. కూర్చొని ఆలోచిస్తే అర్థమైంది ఏమిటంటే... పెయింటింగ్ నాకు కేవలం ఒక అభిరుచి మాత్రమే కాదని. దాంతోనే నా జీవితం ముడిపడి ఉందని, అటువైపు రమ్మని నన్ను పిలుస్తోందని. ఆ తరువాత ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి నాదైన ప్రపంచంలోకి అడుగుపెట్టాను.
ఆరంభమే అదిరింది...
ఉద్యోగం వదిలేశాక పూర్తి స్థాయిలో పెయింటింగ్స్‌కు సమయాన్ని కేటాయించాను. ధైర్యం చేసి బరోడాలో నా నేను గీసిన చిత్రాలతో సోలో ఎగ్జిబిషన్ పెట్టాను. అదే నా మొదటి ఎగ్జిబిషన్. అడుగు ముందుకైతే వేశాను కానీ లోపల సందేహం... అవి ‘నచ్చుతాయా’ అని. అయితే నా అంచనాలకు మించి ప్రదర్శన విజయవంతమైంది. అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ స్పందన చూశాక నేను తీసుకున్న నిర్ణయం సరైనదేననే నమ్మకం కలిగింది. కళాకారిణిగా నా అసలైన ప్రయాణం ఆ రోజే ప్రారంభమైంది.
మరో మలుపు...
బరోడాలో ఎగ్జిబిషన్ తరువాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంచలంచెలుగా ఎదిగాను. దేశవిదేశాల్లో ప్రదర్శనలు, ప్రశంసలు, సత్కారాలు... నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. అయితే నా నలభయ్యవ ఏట నా వ్యక్తిగత జీవితం, అలాగే వృత్తిగత జీవితం అనుకోని మలుపు తిరిగాయి. ‘కాలా ఘోడా ఆర్ట్ ఫెస్టివల్’ సంస్థతో కలిసి పని చేయడం ప్రారంభించాను. సంస్థ నిర్వహించే ప్రతి ఉత్సవంలో చురుగ్గా పాల్గొన్నాను. ఈ క్రమంలోనే మదిలో సరికొత్త ఆలోచనలు ఉద్భవించాయి. చిత్రకళను మరో స్థాయికి తీసుకువెళ్లే అవకాశం లభించింది. అదే సమయంలో నాలోని సృజనకు అతిపెద్ద వేదిక లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాను. కళకు విస్తృత ప్రాచుర్యం కల్పించి, ప్రజల్లో చైతన్యం తేవాలని భావించాను. తదనుగుణంగా పలు కార్యక్రమాలు నిర్వహించాను. ముంబయిలోని రహదారులు, పలు ఆసుపత్రుల గోడలపై అర్థవంతమైన చిత్రాలు వేయించాను. శిథిలమైపోతున్న వారసత్వ కట్టడాలను పరిరక్షించేందుకు కళను ఒక సాధనంగా ఎంచుకున్నాను. 2006లో సంస్థ గౌరవ డైరెక్టర్‌గా ఉన్న నేను 2020 నాటికల్లా చైర్‌పర్సన్ స్థాయికి ఎదిగాను.
పురస్కాలు ఎన్నో...
‘కాలా ఘోడా ఆర్ట్ ఫెస్టివల్’తో అనుబంధం నన్నే కాదు... మరెందరో కళాకారులను తీర్చిదిద్దడానికి సహకరించింది. తరచూ వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసి ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నాను. వారిలోని సృజనను వెలికి తీసి, నైపుణ్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయాణం పూర్తిగా కళకే అంకితమైపోయింది. మదిలో నిండిన భావాలను కాన్వాస్‌పై పెడుతున్నప్పుడు ఉండే ఆనందం, ఆత్మసంతృప్తి నాకు మరెందులోనూ దొరకవు.’’
ఇవి కూడా చదవండి
హక్కుల తీర్మానం గురించి అడిగితే.. రేణుకా చౌదరి రియాక్షన్ ఇదే
ఐదెన్ మార్‌క్రమ్ సూపర్ సెంచరీ.. రెండో వన్డేలో సఫారీల అద్భుత పోరాటం..