Share News

Mohita Gulati: అభిరుచే... ఆమె పాటయింది

ABN , Publish Date - May 19 , 2025 | 04:34 AM

బాల్యంలో అభిరుచి అయిన సంగీతాన్ని మళ్లీ అందుకుని, యాభై నాలుగేళ్ల వయసులో తన తొలి పాప్‌ పాటను విడుదల చేసిన మోహిత గులాటి, వయసు సాధనకు అడ్డు కాదని నిరూపించారు. ఉద్యోగ జీవితం ముగిశాక కూడా కలలను వెంటాడి నిజం చేసుకోవచ్చని ఆమె ప్రేరణగా నిలుస్తున్నారు.

Mohita Gulati: అభిరుచే... ఆమె పాటయింది

మనసు పలికే మౌన గీతాలను అక్షరాలుగా పేర్చడం... వాటికి కమ్మని రాగాలు అద్దడం... మోహిత గులాటి చిన్ననాటి అభిరుచి. కానీ చదువు... ఉద్యోగం... పెళ్లి... పిల్లలు... జీవితమనే పరుగులో ఆమె అభిరుచి తెర మరుగైపోయింది. క్షణం తీరిక లేకుండా దేశదేశాలు తిరిగే మోహితను... మళ్లీ ఆ పాత రోజులకు తీసుకువెళ్లింది నాన్న జ్ఞాపకం. ఆ స్ఫూర్తితోనే యాభై నాలుగేళ్ల వయసులో ఆమె తొలి పాప్‌ గీతాన్ని విడుదల చేశారు. వయసు కేవలం శరీరానికే కానీ... సాధించాలనే సంకల్పానికి కాదని నిరూపించారు.

‘‘పాప్‌ సంగీతం... అదీ కెరీర్‌లో మొట్టమొదటి పాట అనగానే బహుశా ఓ ఇరవై ఏళ్ల యువతి మీ కళ్ల ముందు కనిపించవచ్చు. నిజమే... సంగీతాభిరుచి గల నాకూ అదే భావన కలుగుతుంది. ఈ ఆలోచనతోనే చాలామంది తమ కలలను మధ్యలోనే వదిలేస్తున్నారు. ‘వయసు మీద పడింది. ఇంకేం చేయలేం’ అనే స్థితికి వచ్చేస్తున్నారు. కానీ సాధించాలన్న తపన, పట్టుదల ఉంటే వయసు, పరిస్థితులు అడ్డంకి కాదనేది నా అభిప్రాయం. నేనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. చిన్నప్పటి నుంచీ నాకు సంగీతంపై మక్కువ. పాటలు తెగ వినేదాన్ని. గిటార్‌ నేర్చుకోవాలని కూడా ప్రయత్నించాను. నాలోని భావాలు, భావోద్వేగాలన్నిటినీ కలబోసి కవితలు రాసేదాన్ని. మా నాన్న ఆర్మీలో పని చేసేవారు. తరచూ మా నివాస ప్రాంతాలు మారుతూ ఉండేవి. ఇంతలోనే కాలేజీ వయసు వచ్చింది. దీంతో నా అభిరుచులేవీ కొనసాగించలేకపోయాను.

Untitled-1.jpg

డిగ్రీ తరువాత...

ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఇంగ్లీష్‌ పూర్తి చేశాను. అది అవ్వగానే 1992లో ఢిల్లీలోని తాజ్‌ హోటల్‌ గ్రూప్‌ మార్కెటింగ్‌ విభాగంలో ఉద్యోగం వచ్చింది. దాదాపు మూడున్నరేళ్లు అక్కడ పని చేశాను. ఫుడ్‌ ప్రమోషన్స్‌తో పాటు వివిధ కార్యక్రమాలు, ఫ్యాషన్‌ షోస్‌ నిర్వహించాను. వైన్‌ టేస్టింగ్‌లో అనుభవం గడించాను. ఇవన్నీ నా కెరీర్‌కు బలమైన పునాది వేశాయి. తరువాత కొలంబస్‌ కంపెనీలో బిజినెస్‌ డెవలప్‌ మేనేజర్‌గా, వండర్‌లస్ట్‌ కార్పొరోట్స్‌లో డైరెక్టర్‌గా, బ్రాడ్‌ విజన్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా, అల్కాటెల్‌ లూసెంట్‌ ఇండియా మార్కెటింగ్‌ హెడ్‌గా చేశాను. అక్కడి నుంచి పీఎంజీ ఏషియా పసిఫిక్‌ సంస్థ నుంచి పిలుపు రావడంతో సింగపూర్‌ వెళ్లాను. రెండేళ్ల అనంతరం అక్కడి మరో కంపెనీలో క్లయింట్‌ ఎంగేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కొంత కాలం పని చేశాను. ప్రస్తుతం సింగపూర్‌లోనే క్లయింట్‌ సర్వీసింగ్‌, మార్కెటింగ్‌ ఏజెన్సీ ఒకటి నడిపిస్తున్నాను.


క్షణం తీరిక లేదు...

చదువు అయిపోయింది మొదలు నా ప్రయాణం ప్రవాహంలా సాగిపోతోంది. పెళ్లి తరువాత బాధ్యతలు పెరిగాయి. ఆయన ఒక బహుళ జాతి కంపెనీలో కీలక హోదాలో ఉన్నారు. మాకు ఇద్దరు పిల్లలు. చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, వాళ్ల పెంపకం, వాళ్ల చదువులు... వీటికితోడు వృత్తి నేపథ్యంలో తరచూ విదేశాలకు వెళ్లి రావడం... నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది. నా గురించి నేను ఆలోచించే తీరిక ఉండేది కాదు. కొన్నేళ్ల తరువాత పై చదువుల కోసం మా అబ్బాయిలు వేరే ప్రాంతాలకు వెళ్లారు. అప్పటికిగానీ నాకంటూ కొంత సమయం దొరకలేదు.

ఆలోచన మార్చిన రోజు...

ఒక రోజు మా అన్నయ్య ఇంటికి వచ్చాడు. రిబ్బన్‌తో కట్టివున్న ఫోల్డర్‌ను నా చేతులో పెట్టాడు. అది మా నాన్న... నా కోసం దాచిపెట్టింది. నాకు ఇవ్వమని తను చనిపోయేముందు అన్నయ్యకు చెప్పారట. తెరిచి చూస్తే... అందులో నా సర్టిఫికెట్లు, పేపర్‌ కటింగ్స్‌ ఉన్నాయి. అవి నేను బడి రోజుల్లో సంగీతం, కవితల పోటీల్లో సాధించిన విజయాలకు గుర్తులు. ఒక్కసారిగా అవి నన్ను నా బాల్యంలోకి తీసుకువెళ్లాయి. అప్పుడు నాన్న చెప్పిన మాటలు మదిలో మెదిలాయి. ఆయనకు నా ప్రతిభపై అపారమైన నమ్మకం. ‘కవితలు రాయడం ఎప్పటికీ ఆపవద్దు’ అనేవారు. ఆ జ్ఞాపకం నన్ను కదిలించింది. ఆ క్షణం నా జీవితాన్ని మలుపు తిప్పింది.


అలా నా పాట పుట్టింది...

ముప్ఫై ఏళ్ల సుదీర్ఘమైన కార్పొరేటు కెరీర్‌. అందులో విజయవంతమయ్యాను. కానీ ఎక్కడో నాలోని సృజనాత్మకత మాయమైపోయింది. ఈ అసంతృప్తి నాకు నిద్ర పట్టనివ్వలేదు. అంతర్లీనంగా ప్రవహిస్తున్న నాలోని సంగీతాభిలాషకు ఒక రూపం ఇవ్వాలనుకున్నాను. వెంటనే కార్యక్షేత్రంలోకి దిగాను. ఆన్‌లైన్‌లో సంగీత శిక్షణ తీసుకున్నాను. కార్లు, విమానాల్లో ప్రయాణించే సమయంలో సాధన చేశాను. నా అనుభవాలను రంగరించి ఒక పాట రాశాను. నా సంగీత గురువు మిన్షుల్‌ జైన్‌ ఈ గీతానికి బాణీ కట్టారు. నిర్మాత, మిక్సింగ్‌ ఇంజనీర్‌ పతీక్‌ మనియార్‌ సహకారంతో గత నెలలో నా మొట్టమొదటి పాప్‌ సింగిల్‌... ‘దట్‌ ఒన్‌ ఎమోషన్‌’ విడుదలైంది. ఐదు పదులు దాటాక పాటల ప్రపంచంలో కొత్తగా కెరీర్‌ ప్రారంభించేవారు చాలా అరుదు. ఈ వయసులో ఇదేమిటనేవారూ ఉన్నారు. అవేవీ నేను పట్టించుకోను. ఇన్నేళ్ల తరువాత నా అభిరుచికి పట్టం కట్టినందుకు, నాన్న నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది.’’

అదే పాటకు ప్రాణం...

ప్రముఖ మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్‌లతో పాటు యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో కూడా నా పాటను విడుదల చేశాను. మంచి ఆదరణ లభిస్తోంది. కొందరైతే నా ప్రయత్నాన్ని మనసారా అభినందించారు. లేటు వయసులో ఏమీ సాధించలేమనేవారికి నా ప్రయాణం స్ఫూర్తి నింపుతుందని అంటుంటే మనసు ఉప్పొంగుతుంది. నా ‘దట్‌ ఒన్‌ ఎమోషన్‌’ పాట... తాత్కాలిక సంబంధాలు కొనసాగుతున్న ఈ ప్రపంచంలో నిజమైన, నిజాయితీ గల ప్రేమానుబంధాల కోసం అన్వేషిస్తుంది. భావోద్వేగాలు, అనుబంధాలే ఈ పాటకు ప్రాణం. ఈ విజయం స్ఫూర్తితో మరో సింగిల్‌తో పాటు ఒక ఆల్బమ్‌ కూడా తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. విభిన్నమైన సంగీతంతో మళ్లీ త్వరలోనే మీ ముందుకు వస్తాను.


ఇవీ చదవండి:

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 05:15 AM