తట్టుకోలేని తలపోటు
ABN , Publish Date - Jun 24 , 2025 | 05:44 AM
సున్నితమైన మెదడులో ఎంత చిన్న సమస్య తలెత్తినా దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. అలాంటి సమస్యే.. ‘ఎన్యూరిజం’. రక్తనాళాల్లో సమస్యల మూలంగా మెదడులో రక్తస్రావం జరిగే ప్రాణాంతక పరిస్థితి...
ఎన్యూరిజం
ప్రముఖ హిందీ నటుడు సల్మాన్ ఖాన్, తనకున్న బ్రెయిన్ ఎన్యూరిజం ఆరోగ్య సమస్య గురించీ, పెళ్లికి అడ్డుపడుతున్న ఆ సమస్యతో తాను పోరాడుతున్న వైనం గురించీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించాడు. ఇంతకూ బ్రెయిన్ ఎన్యూరిజం అంటే ఏంటి? దాన్ని తీవ్రమైన సమస్యగానే పరిగణించాలా? వైద్యులేమంటున్నారు? తెలుసుకుందాం!
సున్నితమైన మెదడులో ఎంత చిన్న సమస్య తలెత్తినా దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. అలాంటి సమస్యే.. ‘ఎన్యూరిజం’. రక్తనాళాల్లో సమస్యల మూలంగా మెదడులో రక్తస్రావం జరిగే ప్రాణాంతక పరిస్థితి ఇది. అలాగని ఈ సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ భయపడిపోవలసిన అవసరం లేదు. మెదడులోని రక్తనాళం గోడలు బలహీనపడడం వల్ల రక్తనాళం ఉబ్బిపోవడం, ఒక్కసారిగా చిట్లి రక్తస్రావం జరగడం లాంటి రెండు పరిస్థితులు కొందర్లో తలెత్తుతూ ఉంటాయి. ఈ జన్యుపరమైన సమస్య పుట్టుకతోనే ఉండవచ్చు. కనెక్టివ్ టిష్యూ డిజార్డర్, రక్తనాళాలను బలహీనపరిచే ‘వ్యాస్క్యులైటిస్’ సమస్యలు ఉన్నవారికి కూడా ఈ ముప్పు ఉండవచ్చు. రక్తపోటు అదుపు తప్పడం, తలకు దెబ్బలు తగలడం వల్ల కూడా కొందర్లో ఈ సమస్య తలెత్తవచ్చు. కొందర్లో ఈ సమస్య ఉన్నప్పటికీ, అది ఎప్పటికీ బయల్పడకపోవచ్చు. మరి కొందర్లో అడపా దపడా లక్షణాల రూపంలో బయల్పడి, పరీక్షల్లో నిర్థారణ అవుతూ ఉండొచ్చు. ఇంకొందర్లో ఎటువంటి లక్షణాలూ కనిపించకుండా, అకస్మాత్తుగా రక్తనాళం చిట్లి పరిస్థితి తీవ్రంగా పరిణమించవచ్చు. ఇలా ఎన్యూరిజం వేర్వేరు పరిస్థితుల్లో వేర్వేరు రూపాల్లో బయల్పడుతూ ఉంటుంది.

ఈ లక్షణాలు కీలకం
మెదడులో రక్తనాళం ఎక్కడ చిట్లింది? ఏ మేరకు చిట్లింది? సదరు వ్యక్తికి రక్తపోటు ఉందా? అనే అంశాల మీదే ఎన్యూరిజం నష్టం, పరిణామాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెదడులోని రక్తనాళం వాపు, పక్క ప్రదేశాల మీద ఒత్తిడిని పెంచుతూ ఉంటుంది. దాంతో సంబంధిత అవయవాల్లో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఎన్యూరిజం ప్రధానంగా తలనొప్పితోనే బయల్పడుతూ ఉంటుంది. సాధారణంగా తట్టుకోలేనంత తలనొప్పిని మైగ్రెయిన్ తలనొప్పిగా పరిగణిస్తూ ఉంటాం. ఎండకు బహిర్గతమైనప్పుడు, నిద్ర తగ్గినప్పుడు తలెత్తే మైగ్రెయిన్ తలనొప్పులు టీనేజీ వయసు నుంచి మొదలవుతాయి. కానీ ఎన్యూరిజం తలనొప్పి పూర్తిగా భిన్నమైనది. మునుపు కనిపించని కొత్త లక్షణాలతో పాటు..
అకస్మాత్తుగా భరించలేనంత తలనొప్పి తలెత్తడం
ఆ నొప్పి జీవితంలో అప్పటివరకూ అనుభవించి ఉండకపోవడం
ఎన్యూరిజం వాపు ఒత్తిడి వల్ల ఒక కన్ను మూసుకుపోవడం
ముఖంలో చమట తగ్గినట్టు అనిపించడం
అప్రమత్తతే ఆయుధం
కొందర్లో తలనొప్పితో ఎన్యూరిజం బయల్పడినప్పటికీ వైద్యులను సంప్రతించి, స్కాన్‌తో సమస్యను నిర్థారించుకోకుండా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఫలితంగా రక్తనాళం చిట్లడంతో అకస్మాత్తుగా మెదడులో తీవ్ర రక్తస్రావమై, చక్కదిద్దడానికి వీల్లేనంత నష్టం జరిగిపోవచ్చు. ఇలా కాకుండా ముందస్తుగానే అప్రమత్తమై స్కాన్‌తో పరిస్థితిని అంచనా వేయగలిగితే, రక్తనాళం తీవ్రంగా చిట్లిన సందర్భంలో రక్తస్రావాన్ని అదుపు చేసే చికిత్సను వైద్యులు వెంటనే అదించగలగడంతో పాటు, ఎన్యూరిజం నుంచి మళ్లీ మళ్లీ రక్తస్రావం జరగకుండా ఉండడానికి కూడా చికిత్సను అందించగలుగుతారు. కాబట్టి తట్టుకోలేని తలనొప్పి తలెత్తినప్పుడు, శరీరంలో ఎన్యూరిజం లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను ఆశ్రయించాలి.
తక్షణ స్పందన ఇలా...
కొందర్లో ఎన్యూరిజం ఇతరత్రా కారణాల కోసం చేయించుకున్న ఎమ్మారైలో బయల్పడుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో, ఎన్యూరిజం తీవ్రతను బట్టి అలాగే వదిలేయాలా, లేదా అన్నది వైద్యులు నిర్థారిస్తారు. కొందర్లో రక్తస్రావం ముప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని అంశాల ఆధారంగా ఎన్యూరిజంను సరిదిద్దే చికిత్సలను వైద్యులు ఎంచుకుంటూ ఉంటారు. ఈ సమస్య ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలు ఎక్కువ కాబట్టి అకస్మాత్తుగా భరించలేని తలనొప్పితో కుప్పకూలిపోయినప్పుడు, సదరు వ్యక్తిని వీలైనంత త్వరగా దగ్గర్లోని ఆస్పత్రికి తరలించాలి. స్పృహ కోల్పోయిన వ్యక్తికి నీరు తాగించకూడదు. ఇలా చేయడం వల్ల నీరు ఊపిరితిత్తుల్లోకి చేరుకుని, న్యుమోనియాకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి...
స్పృహ కోల్పోయిన వ్యక్తిని పక్కకు తిప్పి పడుకోబెట్టాలి
దగ్గర్లోని మెడికల్ సెంటర్‌కు తీసుకువెళ్లి రక్తపోటును నియంత్రించే ప్రయత్నం చేయాలి
తలలోని వాపును తగ్గించే మందులు అన్ని క్లినిక్స్‌లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ మందులు ఇప్పించాలి
మూర్ఛ రాకుండా ఇంజెక్షన్లు ఇప్పించాలి
ముక్కులో ట్యూబ్ వేయించాలి
సాధ్యమైనంత త్వరగా అన్ని వసతులూ ఉన్న ఆస్పత్రికి తరలించాలి 6 గంటల్లోపే...
ఎన్యూరిజం ముప్పు.. వ్యక్తుల వయసు, తీవ్రత, ఆరోగ్య సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఎన్యూరిజంకు గురైన వెంటనే ప్రథమ చికిత్స ఇప్పించగలిగితే సమస్య ప్రాణాంతకంగా పరిణమించకుండా ఉంటుంది. అలాగే ప్రథమ చికిత్స అనంతరం ఆరు గంటల్లోగా అన్ని వసతులూ ఉన్న పెద్ద ఆస్పత్రికి తరలించాలి. 12 గంటలు లేదా ఒక రోజంతా గడిచేవరకూ ఆలస్యం చేస్తే, ఇతరత్రా సమస్యలు పెరిగి, చికిత్స ఇచ్చినా ప్రాణాలు నిలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యకు గురైన వెంటనే దగ్గర్లోని పెద్ద ఆస్పత్రికి తరలించడం మంచిది. మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు, దాన్ని ఆపే పని న్యూరాజిస్టులకు మాత్రమే సాధ్యపడుతుంది. అలాగే ఎన్యూరిజం చికిత్సలో భాగంగా కాయిల్స్‌ను అమర్చే పనిని రేడియాలజిస్టులు మాత్రమే చేయగలుగుతారు. కాయిల్స్ అమర్చే పరిస్థితి లేక సర్జరీ చేయవలసిన సందర్భాల్లో న్యూరో సర్జన్లు ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. రోగికి సంబంధిత భద్రత బాధ్యతను క్రిటికల్ కేర్ యూనిట్ తీసుకుంటుంది. ఇలా భిన్నమైన చికిత్సలన్నీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలోనే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎన్యూరిజంకు గురైన వ్యక్తులను సాధ్యమైనంత త్వరగా ఇలాంటి ఆస్పత్రికి తరలించడమే ఉత్తమం.
చికిత్స ఇదే!
రెండు మూడు ప్రదేశాల్లో ఎన్యూరిజం తలెత్తవచ్చు. కాబట్టి ఆయా ప్రదేశాలను కచ్చితంగా నిర్థారించుకున్న తర్వాత , స్కాన్ చేసి, రెండు రకాల చికిత్సల్లో ఏ చికిత్స సరైనదో వైద్యులు నిర్ణయిస్తారు. చిన్నపాటి ఎన్యూరిజంకు స్టిరాయిడ్స్‌తో చికిత్స చేయవచ్చు. ఒకవేళ ప్రమాదాల వల్ల ఎన్యూరిజం తలెత్తినప్పుడు, ‘కాయిలింగ్’ ప్రక్రియను అనుసరించవలసి ఉంటుంది.
తలను తెరిచి చేసే ఓపెన్ సర్జరీలో, ఎన్యూరిజం తలెత్తిన ప్రదేశానికి చేరుకుని సమస్యను సరిదిద్దే చికిత్సను కూడా వైద్యులు ఎంచుకుంటారు. ఇంకొన్ని సందర్భాల్లో మెదడుకు యాంజియోగ్రామ్ చేసి, దాని ద్వారా కాయిల్స్ అమరుస్తారు. గత దశాబ్ద కాలంగా కాయిలింగ్ ప్రకియనే వైద్యులు అనుసరిస్తున్నారు. అయితే కొన్ని రకాల ఎన్యూరిజంలకు ఈ ప్రక్రియ సాధ్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో సర్జరీ అవసరమవుతుంది. చికిత్స పూర్తయిన తర్వాత, చెక్‌పలో భాగంగా మళ్లీ యాంజియోగ్రామ్ చేసి, పరిస్థితిని అంచనా వేయవలసి ఉంటుంది. అలాగే చికిత్స తర్వాత ఎన్యూరిజం తిరగబెట్టే అవకాశాలను అదుపులో ఉంచుకోవాలి. అందుకోసం మందులతో రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. తలకు దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. తలనొప్పి, శరీరంలో ఒక వైపు బలహీనత లాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను కలుస్తూ ఉండాలి.
ఎన్యూరిజం కేవలం మెదడులోని రక్తనాళాలకే పరిమితం కాదు. గుండె నుంచి శరీరంలోకి కొనసాగే అతి పెద్ద రక్తనాళం అయోర్టాలో కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. అలాగే గుండె, మూత్రపిండాలు లాంటి ప్రధాన అవయవాలకు రక్తాన్ని చేరవేసే ఇతర రక్తనాళాల్లో కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. వీటికి కూడా జన్యుపరమైన కారణాలుంటాయి. అధిక రక్తపోటు, ప్రమాదాల వల్ల కూడా ఇతరత్రా రక్తనాళాల్లో ఎన్యూరిజం తలెత్తుతూ ఉంటుంది. అలాగే ఎన్యూరిజం ఉన్న ప్రదేశాన్ని బట్టి సంబంధిత లక్షణాలు భిన్నంగా ఉంటాయి.
డాక్టర్ పవన్ కుమార్ రుద్రభట్ల
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్,
అండ్ ఎపిలెప్సీ స్పెషలిస్ట్,
మెడికవర్ హాస్పిటల్స్, విశాఖపట్నం.
ఇవి కూడా చదవండి..
అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్
సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి
For National News And Telugu News