మత సామరస్యానికి ప్రతీక
ABN , Publish Date - Jul 06 , 2025 | 04:42 AM
మత సామరస్యానికి ప్రతీక సింహపురి (నెల్లూరు) గడ్డపై ఉన్న బారాషహీద్ దర్గా మతసామరస్యానికి ప్రతీక. దాన్ని కుల, మత, వర్గాలకు అతీతంగా ఎవరైనా దర్శించుకోవచ్చు. అక్కడ జరిగే రొట్టెల పండుగ ప్రపంచ...

ప్రత్యేకం
మత సామరస్యానికి ప్రతీక సింహపురి (నెల్లూరు) గడ్డపై ఉన్న బారాషహీద్ దర్గా మతసామరస్యానికి ప్రతీక. దాన్ని కుల, మత, వర్గాలకు అతీతంగా ఎవరైనా దర్శించుకోవచ్చు. అక్కడ జరిగే రొట్టెల పండుగ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఏటా అయిదు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్త జనం తరలివస్తారు. నేడు ప్రారంభమవుతున్న ఈ వేడుకలకు ఘనమైన చరిత్రే ఉంది.
ఆర్కాడు నవాబు కాలం నుంచి.
సుమారు 400 సంవత్సరాల క్రితం సౌదీ, మక్కా షరీఫ్ నుంచి 300 మంది మత ప్రచారకులు భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కర్ణాటకలో హైదర్ అలీ పాలన, నెల్లూరులో నవాబు పాలన ఉండేవి. ఆ ప్రచారకుల్లో 12 మంది నెల్లూరు జిల్లాలో పర్యటిస్తూ... కొడవలూరు మండలం గండవరం చేరుకున్నారు. అప్పుడు వారికి, బ్రిటిష్ సైనికులకు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఆ ప్రచారకులు ప్రాణత్యాగం చేశారు. వారి తలలు గండవరం వద్ద పడిపోగా... వారి మొండేలతో గుర్రాలు నెల్లూరు చేరాయి. ఆ మొండేలను స్థానికులు స్వర్ణాల చెరువు వద్ద సమాఽధి చేశారు.
కొన్నేళ్ళ తరువాత... ఆ చెరువులో రజక దంపతులు దుస్తులు ఉతికి, అక్కడ ఉన్న చెట్టు కింద విశ్రమించారు. ఆ రజకుడి భార్యకు ఒక దైవ స్వరూపుడు కలలోకి వచ్చి.. బారా షహీద్‌ల సమాధుల వద్ద ఉన్న మట్టిని లేపనం చేసుకున్నవారు అనారోగ్యం నుంచి కోలుకుంటారని చెప్పాడు. ఆమె తన కల గురించి భర్తకు చెప్పింది. ఈ విషయాన్ని దగ్గరలో ఉన్న రాజభటులకు ఆ దంపతులు నివేదించారు. వారిని ఆర్కాటు నవాబు దగ్గరకు భటులు తీసుకువెళ్ళారు. అప్పట్లో నవాబు కుమార్తె అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె స్వస్థత కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో... ఆ దంపతులు చెప్పిన మాటలను నవాబు విశ్వసించాడు. వాటిని పాటించాడు. ఒక రోజు గడవకముందే కుమార్తె ఆరోగ్యం బాగుపడటం చూసి నవాబుకు ఆశ్చర్యం కలిగింది. అతను బారాషహీద్ సమాధుల వద్దకు చేరుకొని పూజలు చేశాడు. సమాధుల దగ్గర ఉన్న మట్టితో లేపనం చేసుకోవడం వల్ల నవాబు కుమార్తె ఆరోగ్యం బాగుపడిందని ప్రజలకూ తెలియడంతో అందరూ ఆ దర్గాలో పూజలు ఆరంభించారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం మొహర్రం నెలలో ఆ సమాధులకు పూజలు జరుగుతున్నాయి.
హిందువులు పెట్టిన పేరే..
ఆర్కాట్ నవాబు 1757లో ఆ ప్రదేశంలో పండుగను ప్రారంభించినట్టు చరిత్ర చెబుతోంది. పూజలు చేసేందుకు వచ్చిన వారు తమ వెంట తెచ్చుకున్న రొట్టెలను తిని, మిగిలి వాటిని అక్కడే ఉన్నవారికి పంచేవారు. అలా స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు తినడం, పక్కవారికి ఇవ్వడం రొట్టెల పండుగలో ఆనవాయితీ అయింది.. నవాబు పాలనలో... ఆయన ప్రతినిధిగా ఖాజీ ఆధ్వర్యంలో పండుగ జరిగేది. ముస్లింలు ఈ పండుగను ‘మొహర్రం జియారత్’ అని పిలుచుకునేవారు. అయితే, చెరువు వద్ద రొట్టెలు మార్చుకొనే ఆనవాయితీ కారణంగా దీన్ని ‘రొట్టెల పండుగ’ అనే పేరు స్థిరపడిపోయింది. ఈ పేరు హిందువులు పెట్టిన పేరేననీ, అది తమకు గర్వంగా ఉందని దర్గా సంరక్షకులు చెబుతున్నారు. అలా మొదలైన రొట్టెల పండుగ ఖ్యాతి నెల్లూరు జిల్లా సరిహద్దులు దాటి విదేశాలకు పాకింది.
గోళ్ల రామకృష్ణ
ఫొటోలు: ఎస్‌డీ జకీర్
కోరికలెన్నో... రొట్టెలు ఎన్నెన్నో
రొట్టెల పండుగలో... కొత్త కోరికలు కోరుకొనేవారు, కోరికలు తీరినవారు... ఇలా ఎందరో ‘వరాల రొట్టెల’ను అందుకుంటారు. ప్రసాదాలుగా భావించే ఈ రొట్టెల్లో... కాలక్రమేణా రకరకాల రొట్టెలు పుట్టుకొచ్చాయి. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, సంతానం, భాగ్యం, ఇల్లు... ఇలా వివిధ కోరికలు తీరాలనుకొనే వారి కోసం ఎన్నెన్నో రొట్టెలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ రొట్టెల ప్రసాదం ద్వారా కోర్కె తీరిన భక్తులు మరుసటి ఏడాది విధిగా ఈ పండుగకు వచ్చి... తమ చేతుల మీదుగా మరొకరికి రొట్టెను పంచడం, కోర్కెలు సఫలం కావడం కోసం ఆ రొట్టెను మహాప్రసాదంగా స్వీకరించడం ఈ పండుగ విశేషం. రొట్టెల పండుగకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను నెల్లూరు నగరవాసులు అతిథులుగా భావించి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి.
రాష్ట్రంలో.. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు
కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పీఎస్‌కు మాజీ మంత్రి
Read Latest Telangana News and National News