Krishna Teachings: అవగాహన కరుణ
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:17 AM
ఆత్మజ్ఞానం పొందే మార్గంలో మనకు ఎదురయ్యే అనేక అడ్డంకులను దాటడానికి, మూసి ఉన్న ద్వారాలను తెరవడానికి కావలసిన అమోఘమైన తాళం చెవులన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అటువంటి కీలకమైన ఉపాయాల్లో ఒకటి...
గీతాసారం
ఆత్మజ్ఞానం పొందే మార్గంలో మనకు ఎదురయ్యే అనేక అడ్డంకులను దాటడానికి, మూసి ఉన్న ద్వారాలను తెరవడానికి కావలసిన అమోఘమైన తాళం చెవులన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అటువంటి కీలకమైన ఉపాయాల్లో ఒకటి... మిమ్మల్ని ఇతరుల్లో, ఇతరులను మీలో చూసుకోవడం. అందరిలో ఉన్నది తానేనని శ్రీకృష్ణుడు గుర్తు చేస్తున్నాడు. తాను నిరాకారుణ్ణని సూచిస్తున్నాడు. అన్ని జీవులను ఒకేలా చూడగలిగే స్థాయికి ఎదగాలని చెబుతున్నాడు. ఇంద్రియాలు మనకు అందించిన సమాచారం ఆధారంగా... మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను సురక్షితమైనవిగా, ఆహ్లాదకరమైనవిగా లేదా హానికరమైనవిగా, బాధాకరమైనవిగా మన మనస్సు నిర్ధారిస్తుంది. ఎదురుకాబోయే ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడానికి ఇది ఎంతో అవసరం. ఇతర సాంకేతిక పరిజ్ఞానాల మాదిరిగా మన మనస్సు కూడా రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. అది మన మీద పెత్తనం చేయడం కోసం తన పరిధుల్ని మీరుతుంది. అదే అహంకారానికి జన్మస్థానం.
మనస్సును ఆధీనంలో ఉంచుకొని... ఈ విభజనలను తగ్గిస్తే కలయిక, ఐక్యత కలుగుతాయని భగవద్గీత చెబుతోంది. మనం ఇటువంటి కీలకమైన ఉపాయాలను ఉపయోగించినప్పుడు... ఇతరుల పట్ల కరుణను, మన గురించిన అవగాహనను పెంచుకుంటాం. ఏ కారణం చేతనైనా మనకు శత్రువుగా మారిన వ్యక్తిలో సైతం భగవంతుణ్ణి చూడడం మొదలుపెట్టడం ఈ సూత్రాన్ని అనుభవంలోకి తీసుకురావడానికి మంచి మార్గం. వారితో మనకు అనేక బాధాకరమైన జ్ఞాపకాలు, భావనలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇది కచ్చితంగా కష్టమైనదే. కానీ క్రమంగా... కాలంతో పాటు ఆ బాధంతా కరిగిపోయి, సంతోషానికి దారితీస్తుంది. నిజానికి మన అందరికీ ఇలాంటి పరిస్థితులు ఎదురై ఉంటాయి. కానీ అవగాహనతో గీతా బోధను అభ్యాసంలో పెట్టవలసిన అవసరం ఉంది. తన పట్ల అవగాహన, ఇతరుల పట్ల కరుణ అనేవి ప్రధానం. భగవద్గీత చెప్పిన మార్గంలో ప్రయాణిస్తూ ‘అంతరాత్మ’ అనే తీరాన్ని చేరడానికి దోహదం చేస్తాయి.
కె.శివప్రసాద్
మన మనస్సు రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. అది మన మీద పెత్తనం చేయడం కోసం తన పరిధుల్ని మీరుతుంది. అదే అహంకారానికి జన్మస్థానం.
ఇవి కూడా చదవండి
ఏడేళ్ల తర్వాత చైనాకు మోదీ.. ఇక అమెరికాకు మామూలుగా ఉండదు..
రీల్ కోసం సాహసం.. కదులుతున్న రైలుకు వెలాడుతూ వీడియో తీస్తుంటే.. షాక్..