Share News

Atthayya as Role Mode in Kabaddi: అత్తయ్య ఆదర్శంగా దేశం గర్వించేలా

ABN , Publish Date - Sep 01 , 2025 | 05:35 AM

ఆట ఆమెకు ఆటవిడుపు కాదు... జీవిత గమనం. ఈ క్రీడా ప్రయాణం... బాల్యంలో మొదలైంది. బడి రోజుల్లో... కళాశాలలో... ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాక కూడా కొనసాగుతోంది. అత్తయ్య శిక్షణలో నైపుణ్యం సంపాదించి...

Atthayya as Role Mode in Kabaddi: అత్తయ్య ఆదర్శంగా దేశం గర్వించేలా

సంకల్పం

ఆట ఆమెకు ఆటవిడుపు కాదు... జీవిత గమనం. ఈ క్రీడా ప్రయాణం... బాల్యంలో మొదలైంది. బడి రోజుల్లో... కళాశాలలో... ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాక కూడా కొనసాగుతోంది. అత్తయ్య శిక్షణలో నైపుణ్యం సంపాదించి... జాతీయ స్థాయి కబడ్డీలో పతకాలు ఎన్నో సాధించి... ప్రస్తుతం కోచ్‌గా, రిఫరీగా నిరుపమాన సేవలు అందిస్తున్నారు... జరుబుల శ్రావణి. రేపటి తరాన్ని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న ఆమె ‘నవ్య’తో ముచ్చటించారు.

‘‘నాది మా మేనత్త రాజ్యలక్ష్మి పోలిక అంటారు అందరూ. ఆమె ఒకప్పుడు మంచి క్రీడాకారిణి. ఆ తరువాత వ్యాయామ ఉపాధ్యాయురాలిగా స్థిరపడ్డారు. నాకు కూడా చిన్నప్పటి నుంచీ ఆటలంటే ఇష్టం. ఏదో సరదాకు కాకుండా... అత్తయ్యలా క్రీడల్లో రాణించాలని అనుకునేదాన్ని. రన్నింగ్‌, కబడ్డీ... అన్నిట్లో ఉండేదాన్ని. నా ఆసక్తిని గమనించిన మా అమ్మానాన్న లక్ష్మి, ఆంజనేయులు నన్ను మరింత ప్రోత్సహించారు. అత్తయ్య ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు స్కూల్లో పీఈటీగా చేసేవారు. నన్ను తీసుకువెళ్లి ఆ స్కూల్లో చేర్చారు. అప్పుడు నేను ఆరో తరగతి. అప్పటి నుంచీ అత్తయ్య దగ్గర ఆటల్లో, ముఖ్యంగా రన్నింగ్‌, కబడ్డీలో శిక్షణ మొదలైంది. మాది బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం సంతరావూరులో ఒక రైతు కుటుంబం. నేను ఒక్కగానొక్క సంతానం కావడంతో అమ్మానాన్న ఎంతో గారాబంగా పెంచారు. ఎప్పుడూ వాళ్లను వదిలి ఉన్నది లేదు. కానీ నన్ను ఒక మంచి క్రీడాకారిణిగా చూడాలన్న ఆశయంతో వేరే ఊరు పంపించారు.


జాతీయ స్థాయి క్రీడాకారిణిగా...

కొంత కాలానికి నేను మిగిలిన ఆటలను వదిలేసి... కబడ్డీ మీదనే దృష్టి పెట్టాను. స్కూల్‌, కళాశాల స్థాయి టోర్నీలో పాల్గొన్నాను. తరువాత నాగార్జున వర్సిటీ తరుఫున ఆలిండియా యూనివర్సిటీ మీట్స్‌లో పోటీపడ్డాను. పలుమార్లు చాంపియన్‌గా నిలిచాను. ఆ విజయాలు నాలో ఆత్మవిశ్వాసం నింపాయి. ఆ తరువాత రాష్ట్ర స్థాయి, అక్కడి నుంచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాను. పాతికకు పైగా ఆలిండియా మీట్స్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఎన్నో గెలుచుకున్నాను. గత ఏడాది ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే ‘నేషనల్‌ సివిల్‌ సర్వీసెస్‌ కబడ్డీ టోర్నీ’లోనూ సత్తా చాటాను.

ఆడపిల్లకు ఆటలెందుకు అన్నారు...

చిన్నప్పుడు కోచింగ్‌ కోసం, తరువాత టోర్నమెంట్‌ల కోసం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఆ సమయంలో కొందరు బంధువులు, సన్నిహితులు అమ్మానాన్నలను వారించారు. ‘వయసుకు వచ్చిన ఆడపిల్లను పెళ్లి చేసి పంపాలే కానీ, ఇలా రాష్ట్రాలు దాటిస్తే ఎలా’ అంటూ నిలదీశారు. కానీ మా అమ్మానాన్న తమ బిడ్డ విజయాన్ని ఈ దేశం చూడాలని అనుకున్నారు. ఒత్తిళ్లకు తలొగ్గలేదు. అడుగడుగునా నన్ను ప్రోత్సహించారు. అడిగినవన్నీ సమకూర్చారు. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నా. ఆడపిల్లలంటే అన్నిటికీ భయపడాలా? వంట గదికే పరిమితమవ్వాలా? ఇలా తక్కువ చేసి మాట్లాడేవారికి నా విజయాలతోనే సమాధానం ఇవ్వాలనుకున్నా. దృఢ సంకల్పంతో ప్రయత్నించి అనుకున్నది సాధించాను. అమ్మానాన్న గర్వపడేలా చేశాను.


000-navya.jpg

పీఈటీగా ఉద్యోగం...

ఆటల్లో పడి చదువును నిర్లక్ష్యం చేయలేదు. కాకినాడ స్పోర్ట్స్‌ హాస్టల్‌లో ఇంటర్‌, చీరాల వీఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌ కళాశాలలో బీఏ చదివాను. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రవేశ పరీక్షలో మొదటి స్థానం సంపాదించడంతో నాగార్జున వర్సిటీలో సీటు లభించింది. 2012 డీఎస్సీలో పీఈటీగా ఉద్యోగం వచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పెద్దకొత్తపల్లిలో ఉద్యోగ జీవితం ప్రారంభించాను. రెండేళ్లుగా బాపట్ల జిల్లా వేటపాలెం బాలికోన్నత పాఠశాలలో పీఈటీగా చేస్తున్నాను. పెళ్లి తరువాత కూడా నా క్రీడా ప్రస్థానం కొనసాగుతోందంటే అందుకు మావారు వెంకటసుబ్బారావు సహకారం ప్రధాన కారణం. మా అమ్మానాన్నల్లా ఆయన కూడా నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ వచ్చారు. మాకు ఇద్దరు పిల్లలు... తారక్‌రామ్‌, హర్షిత్‌రామ్‌. కుటుంబ మద్దతు ఉంటే ఆడపిల్లలు ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించగలరు. దానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ.’’

తాళ్లూరి ప్రదీప్‌, చీరాల

99854 11491

మరో అడుగు...

నా ప్రయాణంలో మరో కొత్త అడుగు పడింది. ఇటీవల విజయవాడలో నిర్వహించిన యువ ఆంధ్ర కబడ్డీ చాంపియన్‌షిప్‌లో రిఫరీగా వ్యవహరించాను. ప్రస్తుతం నేను ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాను. నా వద్ద కబడ్డీలో శిక్షణ తీసుకున్న కొందరు జూనియర్‌ జట్లకు ఎంపిక అయ్యారు. రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మట్టిలో మాణిక్యాలు మన దగ్గర ఎన్నో ఉన్నాయి. అలాంటివారిని గుర్తించి ప్రోత్సహించాలంటే ఆర్థికంగా, సౌకర్యాల పరంగా ప్రభుత్వం నుంచి సహకారం అవసరం. నైపుణ్యం, సామర్థ్యం గల ఎంతోమంది క్రీడాకారులు పేదరికంతో ముందడుగు వేయలేకపోతున్నారు. వారికి అండగా నిలిస్తే దేశానికి గర్వకారణం అవుతారు.

ఇవి కూడా చదవండి

హరీష్ రావు తప్పు చేశారని కమిషన్ చెప్పింది: ముఖ్యమంత్రి రేవంత్

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది.. మంత్రి ఉత్తమ్‌‌పై హరీష్‌రావు ఫైర్

Updated Date - Sep 01 , 2025 | 05:37 AM