Share News

Athika Mir: రేస్‌లో సరికొత్త సంచలనం

ABN , Publish Date - Feb 20 , 2025 | 04:48 AM

తాజాగా ‘రోటాక్స్‌ ఛాలెంజ్‌ ఇంటర్నేషనల్‌ ట్రోఫీ’ గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి ఆడపిల్లగా చరిత్ర సృష్టించింది. ‘వరల్డ్‌ సిరీస్‌ కార్టింగ్‌’ ఛాంపియన్‌షిప్‌ కోసం సన్నద్ధమవుతున్న ఆతికా కథ ఇది.

 Athika Mir: రేస్‌లో సరికొత్త సంచలనం

మైఖెల్‌ షూమాకర్‌, మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌... ఈ పేర్లు వినగానే ఎఫ్‌1 రేసుల్లో విమాన వేగంతో

దూసుకుపోయే కార్లు మన కళ్ల ముందు మెదులుతాయి. వారి స్ఫూర్తితో రేసుల్లో దూసుకుపోతోంది పదేళ్ల కశ్మీరు బాలిక ఆతికా మిర్‌. తాజాగా ‘రోటాక్స్‌ ఛాలెంజ్‌ ఇంటర్నేషనల్‌ ట్రోఫీ’ గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి ఆడపిల్లగా చరిత్ర సృష్టించింది. ‘వరల్డ్‌ సిరీస్‌ కార్టింగ్‌’ ఛాంపియన్‌షిప్‌ కోసం సన్నద్ధమవుతున్న ఆతికా కథ ఇది.

గో కార్టింగ్‌... కారు రేసు ప్రేమికులను ఆకట్టుకునే క్రీడ. ప్రత్యేకించి వరల్డ్‌ కార్టింగ్‌ సిరీస్‌, ఉత్తమమైన డ్రైవర్లనూ, టాప్‌ కార్ట్‌, ఇంజన్‌ ఉత్పత్తిదారులనూ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన ‘వరల్డ్‌ సిరీస్‌ కార్టింగ్‌’ (డబ్ల్యుఎస్‌కె) ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతున్న పదేళ్ల భారతీయ బాలికగా ఆతికా మిర్‌ చరిత్ర సృష్టించబోతోంది. తాజాగా దక్షిణ ఇటలీలోని, లా కొకా సర్క్యూట్‌లో చేపట్టిన టెస్ట్‌ సెషన్‌లో ఆతికా అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. జమ్ముకశ్మీరుకు చెందిన ఈ రేసర్‌, 60 కార్టులతో కూడిన మినీ క్లాస్‌లో పాల్గొన్న ఏకైక బాలిక కావడం విశేషం. ఈ పాప ఈ ఏడాది జరగబోయే డబ్ల్యుఎస్‌కె సూపర్‌ మాస్టర్‌ సిరీస్‌, డబ్ల్యుఎస్‌కె యూరో సిరీస్‌, డబ్ల్యుఎస్‌కె ఫైనల్‌ కప్‌ పోటీల్లో పాల్గొనబోతోంది. ఈ పోటీల గురించి మాట్లాడుతూ... ‘ఈ పోటీలో పాల్గొనే అవకాశం దొరకడం నా అదృష్టం. ఇది నేను నడపబోతున్న అత్యున్నతమైన కార్టింగ్‌ కాబోతోంది. ఈ పోటీ కోసం ఎన్నో సర్క్యూట్లలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

lkfrjhb.jpg

పైగా చలి కాలంలో డ్రైవ్‌ చేయడం చాలా కష్టం. అయినా నేనందుకు అన్ని విధాలా సిద్ధమయ్యాను’ అంటూ మీడియాకు వివరించిందీ పాప. డబ్ల్యుఎస్‌కెలో ప్రారంభ రోజుల్లో రేసులో పాల్గొన్న ప్రముఖ డ్రైవర్లలో ఎఫ్‌1 డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ కూడా ఉన్నాడు. అతనిలాగే ఆతికా కూడా రేసింగ్‌ కుటుంబ నేపధ్యాన్ని కలిగి ఉంది. ఈ పాప తండ్రి ఆసిఫ్‌ నజీర్‌, భారత మొట్టమొదటి జాతీయ కార్టింగ్‌, ఫార్ములా ఆసియా ఛాంపియన్‌. ఆతికా పాల్గొనే ప్రతి పోటీలో కూతురి వెన్నంటి ఉంటూ, రేసింగ్‌ మెలకువలను నేర్పిస్తూ ఉంటారు ఆసిఫ్‌.


తండ్రి తోడుగా...

తన కూతురి ప్రతిభ గురించి మాట్లాడుతూ, ‘ఆతికా తన అంకితభావంతో, ప్రతిభతో కార్టింగ్‌లో అత్యున్నత స్థానాన్ని అందుకోగలిగింది. అయితే తాజా రేసులో ఆమె కొన్ని మెలకువలను అలవరుచుకోక తప్పదు. కొత్త ట్రాక్స్‌, కొత్త పరిస్థితులు, కొత్త వాతావరణాలకు కూడా అలవాటు పడాలి. ఈ పోటీ ఆమెకొక పెద్ద సవాలుగా మారబోతోంది’’ అంటూ కూతురి ప్రతిభను ప్రశంసిస్తూనే, పోటీలో గెలుపు సాధ్యాసాధ్యాల గురించి ప్రస్థావించాడు ఆసిఫ్‌ నజీర్‌.

ఐదేళ్ల వయసులోనే...

ఐదేళ్ల వయసులోనే ఇండోర్‌ కార్టింగ్‌ మొదలుపెట్టిన ఆతికా, ఎంతో వేగంగా యుఎఇ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే స్థాయికి చేరుకుంది. ర్యాంకుల పరంగా కూడా వేగంగా ఎదిగింది. ఆ సందర్భం గురించి మాట్లాడుతూ... ‘ప్రతి విజయం తరువాత మా నాన్న నాకు కొత్త లక్ష్యాలను ఇస్తూ ఉంటారు. ఆయన ప్రేరణతో నేను వాటిని అందుకుంటూ ఉంటాను. అలా క్రమేపీ నా వయసు విభాగంలో జాతీయ పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదగగలిగాను’ అంటోంది ఆతికా. తన విజయాల గురించి వివరిస్తూ... ‘నాకెంతో గర్వంగా ఉంది. మోటార్‌ స్పోర్ట్‌లో మహిళలకు అవకాశాలు తక్కువ. లె మ్యాన్స్‌ కార్ట్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో విజయం సాధించినందుకు, ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్‌ సిరీస్‌ కార్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అర్హత పొందినందుకూ నాకెంతో గర్వంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది ఈ చిన్నారి.


ఆతికా మిర్‌ విజయ పరంపర

మెగా ఛాంపియన్‌షిప్‌ మీద గురి పెట్టిన ఆతికా ఇప్పటివరకూ పలు పోటీల్లో అత్యద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఆ వివరాలు...

ప్రపంచవ్యాప్త జాతీయా కార్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అత్యధిక ర్యాంకు సాధించిన తొలి మహిళా డ్రైవర్‌గా గుర్తింపు పొందింది

డిఎఎమ్‌సి, మిడిల్‌ఈస్ట్‌ కప్‌ 2024లో మూడో స్థానం పొందింది

ఎఫ్‌ఎమ్‌ఎస్‌ఐ జాతీయ నేషనల్‌ కార్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ రౌండ్‌ వన్‌లో మూడో స్థానం సాధించింది

దుబాయిలోని ల్యాప్‌ రికార్డును బద్దలు కొట్టిన మొట్టమొదటి భారతీయురాలు

లె మ్యాన్స్‌ కార్ట్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ గెలిచిన తొలి మహిళా డ్రైవర్‌

ఐరన్‌ డేమ్స్‌ యంగ్‌ టాలెంట్‌ ప్రోగ్రామ్‌కు ఎంపికైన తొలి ఆసియా వనిత

రోటాక్స్‌ ఛాలెంజ్‌ అంతర్జాతీయ ట్రోఫీ రేసులో గెలిచిన తొలి భారతీయురాలు


ఇవి కూడా చదవండి:

Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 20 , 2025 | 04:48 AM