Share News

Muthyam Lakshmi : ఈ బామ్మ క్రీడా ముత్యం

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:39 PM

ఐదు పదులు దాటిన వయసులో పరుగు మొదలుపెట్టారు. అరవైల్లో పోటీల బరిలోకి దిగారు. ఇప్పుడు తొంభై ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో... సరికొత్త ‘ట్రాక్‌’ రికార్డులు నెలకొల్పుతున్నారు. కేరళలో ఇటీవల జరిగిన ‘జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌’లో మూడు పతకాలు మెడలో వేసుకున్నారు.

Muthyam Lakshmi : ఈ బామ్మ  క్రీడా ముత్యం

ఐదు పదులు దాటిన వయసులో పరుగు మొదలుపెట్టారు. అరవైల్లో పోటీల బరిలోకి దిగారు. ఇప్పుడు తొంభై ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో... సరికొత్త ‘ట్రాక్‌’ రికార్డులు నెలకొల్పుతున్నారు. కేరళలో ఇటీవల జరిగిన ‘జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌’లో మూడు పతకాలు మెడలో వేసుకున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో ‘పరుగుల బామ్మ’గా పేరుపొందిన... ముత్యం లక్ష్మితో ‘నవ్య’ మాటామంతి.

‘‘మూడు దశాబ్దాలు దాటిపోయాయి... నేను పోటీల్లోకి దిగి. అప్పుడు నాకు యాభై ఎనిమిదేళ్లు. పరుగు మొదలుపెట్టినప్పుడు... ఇంటి పట్టునే కూర్చొని మనవళ్లతో ఆడుకొనే వయసులో ఆటలేంటని అన్నవారూ ఉన్నారు. అందుకు నేను చిన్నబుచ్చుకోలేదు. అది వారి అభిప్రాయం. నేనేంటో, నా సామర్థ్యం ఏంటో నాకు తెలిసినప్పుడు... ఎవరో ఏదో అన్నారని బాధ పడుతూ కూర్చోవడంలో అర్థంలేదు. అందుకే నాకు నచ్చిన దారిలో నేను అడుగులు వేశాను. ఇవాళ మాస్టర్స్‌ అథ్లెట్‌గా, ‘పరుగుల బామ్మ’గా మీ అందరి మన్ననలు పొందుతున్నాను. అనకాపల్లి జిల్లా చోడవరం మాది. ఏడో తరగతి వరకే చదువుకున్నాను. మావారు శ్రీనివాసరావు సర్పంచ్‌గా పని చేసేవారు. మాకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. పెద్ద కొడుకు పదవీ విరమణ పొందాడు.

రిటైర్మెంట్‌ వయసులో...

పిల్లలంతా పెద్దవారైపోయారు. పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని రిటైర్మెంట్‌ వయసులో నడక మొదలుపెట్టాను. తరువాత చిన్న చిన్న పరుగు, నడక పందేల్లో పాల్గొనేదాన్ని. ఆరు పదులు దగ్గరపడుతున్న వయసులో ఏదో సాధించాలని నేను పడుతున్న తపన చూసి స్థానికులు నన్ను ప్రోత్సహించారు. వారందరి ప్రోద్బలంతో 1993లో తొలిసారి జిల్లా స్థాయి పరుగు పోటీలకు వెళ్లాను. అందులో పతకాలు గెలిచాను. అది నాలో ఎనలేని ఉత్సాహం నింపింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. క్రమంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో పోటీపడుతూ వచ్చాను. పతకాలు గెలవడం ఒక ఆనవాయితీగా మారిపోయింది.


గాయంతో బ్రేక్‌ పడినా...

ఐదేళ్ల కిందటి వరకు నేను పరుగు పోటీల్లో పాల్గొనేదాన్ని. అయితే ఒకరోజు ఇంట్లో జారి పడ్డాను. కాలు విరిగింది. ఇక క్రీడలు వద్దని కొందరు సలహా ఇచ్చారు. కానీ నేను పరుగు పోటీలను పక్కన పెట్టి... జావెలిన్‌ త్రో, డిస్క్‌ త్రో, షార్ట్‌పుట్‌ ఎంచుకున్నాను. సాధన మొదలుపెట్టాను. నైపుణ్యం సాధించాను. నాపై నాకు నమ్మకం కుదిరడంతో, బరిలోకి దిగాను. దానికి ముందు 2010లో కౌలాలంపూర్‌లో జరిగిన ‘ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ మీట్‌’లో స్వర్ణ, రజత పతకాలు గెలుచుకున్నాను.

నడకే నన్ను నడిపిస్తోంది...

ఇటీవల కేరళలో కేరళలో ముగిసిన జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో మూడు విభాగాలు... షాట్‌పుట్‌, డిస్క్‌ త్రో, జావెలిన్‌ త్రోల్లో పాల్గొన్నాను. అందులో రెండు స్వర్ణ పతకాలు, ఒక రజతం నెగ్గాను. జాతీయ స్థాయిలో నేను సాధించిన పతకాలు ఎన్నో ఉన్నాయి. ఏ పోటీకి వెళ్లినా పతకం లేకుండా తిరిగి వచ్చిన సందర్భాలు అరుదు. తొమ్మిది పదుల వయసులో కూడా ఇంత ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండటానికి కారణం... నడక. నా జీవితంలో నడక ఒక భాగమైపోయింది. స్థానికంగా ఎక్కడికైనా సరే... నడిచే వెళతాను. తప్పనిసరి అయితే తప్ప వాహనాలు ఎక్కను.

ఇంటి వంట...

వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతుంటాయి. అందుకే క్రమబద్ధమైన ఆహార నియమాలను నా జీవనశైలిలో చేర్చుకున్నాను. ప్రత్యేకమైన ఆహారం ఏమీ ఉండదు కానీ... ఉదయం అల్పాహారం తీసుకోను. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం... అంతే. రాత్రి ఏమీ తినను. ఉదయం, సాయంత్రం... రెండుసార్లు కాఫీ తాగుతాను. ఏదైనా ఇంటి వంటే. బయటవి అస్సలు ముట్టుకోను. ఇతర ప్రాంతాలకు వెళ్లినా అక్కడ వంట చేసుకొంటాను. ఇది మా అమ్మ నుంచి వచ్చిన అలవాటు. ఇంట్లో వండిన ఆహారం తినడంవల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. నా ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలు. అడుగడుగునా సవాళ్లు. ఆటపై ఇష్టంతోనే వీటన్నిటినీ అధిగమించి, రాణించగలుగుతున్నాను. సాధించాలన్న తపన ఉండాలే కానీ... వయసు అడ్డంకి కాదని చెప్పడానికి నేనే ఒక ఉదాహరణ.’’

ప్రోత్సాహం అవసరం...

మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం. గతంలో చోడవరం తహసీల్దారుగా పని చేసిన శైలజ నాకు ఇంటి స్థలం మంజూరు చేశారు. అందులో చిన్న ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాను. పిల్లలు అందరూ విశాఖపట్టణంలో ఉంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నాలుగు వేల వృద్ధాప్యపు పింఛను మినహా నాకు వేరే ఆధారం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడాకారుల పింఛన్‌ కింద ఏడాదికి ఆరు వేలు వచ్చేది. విభజన తరువాత అదీ ఆపేశారు. దాతల సహకారంతో ఈవెంట్లకు వెళుతున్నాను. ఈ వయసులో కూడా పోటీల్లో పాల్గొంటున్నానంటే క్రీడలపై నాకున్న మక్కువ. ఇంకా ఏదో సాధించాలన్న తపన. ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తే, నాలాంటి మరెందరో క్రీడాకారులు ముందుకు వస్తారు.

వి.జోజిబాబు, చోడవరం


ఇవి కూడా చదవండి...

Maha Kumbh 2025: కుంభమేళాకు అర్థమే లేదు.. లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు

Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణం ఇదేనా?

Maharashtra: మహారాష్ట్రలో లవ్‌ జిహాద్‌ నియంత్రణకు చట్టం!

Ranveer Allahbadia: చంపుతామంటూ బెదిరిస్తున్నారు.. ఇన్‌స్టా పోస్ట్‌లో రణ్‌వీర్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 16 , 2025 | 11:39 PM