Astha Poonia: సాగర సమరానికి సై
ABN , Publish Date - Jul 06 , 2025 | 04:48 AM
ఆస్తా పూనియా... భారత నావికాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలెట్‌గా చరిత్ర సృష్టించిన ఆమె త్రివిధ దళాల్లో విస్తరిస్తున్న నవ నారీ శక్తికి ప్రతీక. శ్రమించే తత్వం, కష్టపడే గుణం ఉంటే ఏదీ అసాధ్యం...

ఆస్తా పూనియా... భారత నావికాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలెట్‌గా చరిత్ర సృష్టించిన ఆమె త్రివిధ దళాల్లో విస్తరిస్తున్న నవ నారీ శక్తికి ప్రతీక. శ్రమించే తత్వం, కష్టపడే గుణం ఉంటే ఏదీ అసాధ్యం కాదంటున్న ఆస్తా ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
అది ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఒక మధ్యతరగతి కాలనీ. తమ ఇంటికి కాస్త ఎత్తులో దూసుకువెళ్తున్న విమానం శబ్దం ఎప్పుడు వినిపించినా చిన్నారి ఆస్తా పరుగులు పెడుతూ బయటికి వచ్చేది. విమానాలను అబ్బురంగా చూసేది. ‘‘ఏదో ఒక రోజు నేను అలాంటి విమానం నడుపుతాను’’ అని అమ్మకు, నాన్నకు చెప్పేది. ఆ కలను నిజం చేసుకోవడమే కాదు... దేశంలో తొలి మహిళా ఫైటర్ పైలెట్‌గా చరిత్రకెక్కింది. ‘‘ఇది చెప్పుకున్నంత సులువుగా జరిగిపోలేదు. తన కలను నిజం చేసుకోవడానికి ఆమె పడ్డ కష్టం ఎంతో ఉంది. చదువులో, ఆటల్లో తను ఎప్పుడూ ఫస్ట్. ఏ పనినైనా పూర్తి ఏకాగ్రతతో చేస్తుంది’’ అంటారు ఆమె కుటుంబ సభ్యులు.
బీటెక్ చేసి...
ఆస్తాది సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. ఆమె ఇంజనీర్ కావాలని తల్లిదండ్రులు కోరుకున్నారు. వారి ఆలోచనలను గౌరవిస్తూ ఆమె బీటెక్ చేసింది. అదే సమయంలో... పైలెట్ కావాలనే తన కోరికను మరచిపోలేదు. బీటెక్ పూర్తి కాగానే.... ‘షార్ట్ సర్వీస్ కమిషన్’ (ఎస్‌సిసి) ద్వారా భారత నావికాదళంలో చేరింది. ‘‘నేవల్ ఏవియేషన్‌కు సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరం. దానికి నా ఇంజనీరింగ్ పునాది ఉపకరించింది’’ అని చెబుతుంది ఆస్తా. మొదట కేరళలోని ఎజిమలలో ఉన్న ప్రతిష్ఠాత్మకమైన ‘ఇండియన్ నేవల్ అకాడమీ’ (ఐఎన్‌ఎ)లో శిక్షణ పొందింది. ఆ తరువాత హైదరాబాద్‌లోని దుండిగల్ ‘ఎయిర్ ఫోర్స్ అకాడమీ’లో ప్రాథమిక వైమానిక శిక్షణ తీసుకుంది. సైనిక విమానాలు నడపడంలో తొలి పాఠాలు అక్కడే నేర్చుకుంది. ఆ తరువాత విశాఖపట్నంలోని ‘ఐఎన్‌ఎ్‌స డేగా’లో హాక్ అడ్వాన్స్‌డ్ జెట్ ట్రైనర్ (ఎజెటి) మీద అడ్వాన్స్‌డ్ ఫ్లయింగ్, ఆ తరువాత ఫైటర్ ఫైటర్ పైలెట్‌గా ఎదురయ్యే సవాళ్ళకు సిద్ధం కావడం కోసం అవసరమైన ‘సెకెండ్ బేసిక్ హాక్ కన్వర్షన్ కోర్సు’లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. క్వాలిఫైడ్ నేవల్ ఏవియేటర్‌కు గుర్తింపు చిహ్నమైన ‘గోల్డ్ ఆఫ్ వింగ్స్’ను ఈ నెల మూడో తేదీన రియర్ అడ్మిరల్ జనక్ బెల్వీ చేతుల మీదుగా అందుకొని, అది సాధించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది.
ఆ దిశగా గట్టి అడుగు
ఇది ఆస్తా వ్యక్తిగతమైన ఘనత మాత్రమే కాదు, భారత రక్షణ దళాల్లో నారీ శక్తిని... మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా, ‘మారిటైమ్ ఇండియా విజన్ - 2030’ లక్ష్యాల దిశగా వేసిన గట్టి అడుగు కూడా. ఇక ‘హాక్ ఏజేటీ’ మీద కూడా శిక్షణ పొందిన తరువాత మిగ్29 కె ని నడపడానికి ఆస్తాకు పూర్తి అర్హత లభిస్తుంది. ఐఎన్‌ఎ్‌స విక్రాంత్, ఐఎన్‌ఎ్‌స విక్రమాదిత్య లాంటి విమాన వాహక నౌకల నుంచి ప్రయోగించే యుద్ధ విమానాలను నడిపిస్తూ... సరిహద్దుల భద్రతలో కీలక పాత్ర పోషించే అవకాశాన్ని ఆమె అందుకుంటుంది. ‘‘ఇది ఉద్వేగభరితమైన క్షణం. దేశ రక్షణలో భాగం కావడం గర్వంగా ఉంది’’ అంటున్న ఆస్తా... ఎంతోమంది యువతులకు స్ఫూర్తిప్రదాత అవుతుందనడంలో సందేహం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి.
రాష్ట్రంలో.. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు
కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పీఎస్‌కు మాజీ మంత్రి
Read Latest Telangana News and National News