Share News

Aruna Sareen Transforming Prisoners Lives : కారాగారం ఆమెకు దేవాలయం

ABN , Publish Date - Nov 20 , 2025 | 05:43 AM

‘‘తప్పులు చేయడం మానవ సహజం. ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నవారికి... తమ నడవడికను మార్చుకొని, సాధారణ జీవితం గడపగలిగే అవకాశాన్ని సమాజమే ఇవ్వాలి’’ అని చెబుతారు...

Aruna Sareen Transforming Prisoners Lives : కారాగారం ఆమెకు దేవాలయం

‘‘తప్పులు చేయడం మానవ సహజం. ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నవారికి... తమ నడవడికను మార్చుకొని, సాధారణ జీవితం గడపగలిగే అవకాశాన్ని సమాజమే ఇవ్వాలి’’ అని చెబుతారు అరుణా సరీన్‌. ఇరవయ్యేళ్లకు పైగా మధ్యప్రదేశ్‌లోని పలు కారాగారాల్లో యోగ, నైపుణ్య శిక్షణ, ప్రసంగాల ద్వారా వేలాది ఖైదీల్లో మార్పునకు ఆమె దోహదం చేస్తున్నారు. ఇది కూడా దైవానికి చేస్తున్న సేవగానే భావిస్తున్నానంటున్న 83 ఏళ్ల అరుణ అరుదైన ప్రయాణం ఇది.

‘‘అధ్యాపకురాలుగా, గృహిణిగా తీరికలేని జీవితం గడిపిన నేను... ఖైదీల శ్రేయస్సు కోసం పని చేస్తానని ఎన్నడూ అనుకోలేదు. దీనికి కారణం ఢిల్లీకి చెందిన మంజు గోయెల్‌ అని చెప్పాలి. మంజు... ఢిల్లీలో ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ సంస్థలో పని చేసేవారు. తన తల్లిదండ్రులను కలుసుకోడానికి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ వచ్చారు. అప్పటికే నేను కూడా అక్కడ ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ కార్యకర్తగా పని చేస్తున్నాను. స్థానిక జైలులో ఒక కోర్సును నిర్వహించాలని మంజు అనుకున్నారు.. నన్ను కూడా తోడుగా రమ్మన్నారు. అలా మొదటిసారిగా జబల్‌పూర్‌ కారాగారంలో మొదటిసారి అడుగు పెట్టాను. ఆ తరువాత... ఆదివారాలు, సెలవు దినాలు మినహా... మిగిలిన అన్ని రోజులూ జైలును సందర్శిస్తూనే ఉన్నాను. అందరూ రోజూ గుడికి ఎలా వెళ్తారో... నేను జైలుకు అలా వెళ్తూ ఉంటాను.

నా భర్తకు నచ్చేది కాదు...

నా భర్త కల్నల్‌ సరీన్‌ సైన్యంలో పని చేసేవారు. ఆయన ఉద్యోగ రీత్యా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చింది. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిని. నా భర్తకు జబల్‌పూర్‌ బదిలీ అయినప్పుడు... అక్కడే కేంద్రీయ విద్యాలయలో టీచర్‌గా చేరాను. అప్పుడే ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’కు సంబంధించిన ఒక కరపత్రాన్ని చూశాను. అందులో పేర్కొన్న అంశాలు నన్ను ఆకర్షించాయి. ఆ సంస్థలో చేరి... విపశ్యన ధ్యానం అభ్యసించాను. అయితే నా భర్తకు ఇదంతా పెద్దగా నచ్చేది కాదు. నన్ను ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ క్యాంపస్‌ దగ్గర వదిలేసి వెళ్ళేవారు. ఒక రోజు అక్కడి నిర్వాహకులు ఆయనను కూడా అభ్యాసం చెయ్యాలని కోరారు. ‘‘సరే, మీరు చెబుతున్నారు కాబట్టి ఈ రోజు చేస్తాను. రేపటి నుంచి ఈ వైపు రానే రాను’’ అన్నారాయన. కానీ ఆయన కూర్చొని, అభ్యాసం చేసిన తరువాత... రోజూ రావడం మొదలుపెట్టారు. పదవీవిరమణ చేశాక... ఆ సంస్థ నిర్వహించే పలు కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యారు. నేను కూడా ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇద్దరం కలిసి ఆ సంస్థలో పని చేసేవాళ్ళం. ఇంతలో నా భర్త హఠాత్తుగా మరణించారు. తీవ్రమైన వేదనకు గురైన నాకు ఆధ్యాత్మికతే ఆలంబనగా నిలిచింది.


23 ఏళ్ల నుంచి...

ఆరు నెలల తరువాత... ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’లో యోగా టీచర్‌గా శిక్షణ పూర్తి చేసుకున్నాను. ఆ సంస్థ తరఫున వివిధ ప్రాంతాల్లో బోధన ప్రారంభించాను. అంతకుముందే మంజూ గోయెల్‌కు తోడుగా జబల్‌పూర్‌ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కేంద్ర కారాగారానికి వెళ్ళాను. మేము ఖైదీలను కలుసుకున్నాం. వారితో మాట్లాడాం. వారి కోసం యోగా తరగతులు నిర్వహించాం. మహిళా ఖైదీలతో, జైలు అధికారులతో, సిబ్బందితో కలిసి భోజనం చేశాం. మా తరగతులకు వచ్చిన స్పందన గమనించిన అధికారులు... వాటిని కొనసాగించాల్సిందిగా కోరారు. మంజు తిరిగి ఢిల్లీ వెళ్ళాల్సి ఉండడంతో... ఆ బాధ్యతను నేనే స్వీకరించాను. అప్పటి నుంచి... ఇరవై మూడేళ్ళుగా దాదాపు ప్రతిరోజూ ఉదయం జైళ్ళకు వెళుతున్నాను. ఇండోర్‌, భోపాల్‌, సత్నాలతో సహా మధ్యప్రదేశ్‌లో పదికి పైగా కారాగారాల్లో కార్యక్రమాలు నిర్వహించాను. అవి సాధారణంగా మూడు గంటల సేపు కొనసాగుతాయి. ధ్యానం, శ్వాస తీసుకోవడంలో టెక్నిక్స్‌ లాంటి వాటితో కూడిన హ్యాపీనెస్‌ ప్రోగ్రా మ్‌, సుదర్శన క్రియతో కూడిన అడ్వాన్స్‌డ్‌ కోర్సులు దీనిలో ప్రధానంగా ఉంటాయి. ఒత్తిడి కలిగించే కోర్టిసోల్‌ లాంటి హార్మోన్లను గణనీయంగా తగ్గించడానికి, రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరచడానికి, ఒత్తిడి నుంచి విముక్తికి, మెదడు పనితీరు మెరుగుపరచడానికి ఇవి దోహదం చేస్తాయి.’’

111-navya.jpg

అలాంటివి తగ్గాయి...

ఇన్నేళ్ళలో నేను 50 వేలమందికి పైగా ఖైదీలతో తరగతులు నిర్వహించాను. మహిళలకు ముత్యాల ఆభరణాలు, బొమ్మలు తయారీ, బ్యూటీషియన్‌ కోర్సులు, పురుషులకు వాహనాల మరమ్మతులు, ఎలక్ట్రికల్‌ పనులు తదితరాల్లో శిక్షణ కూడా మా సంస్థ నేతృత్వంలో అందించాం. జబల్‌పూర్‌ కారాగారంలో ఒక చిన్న తయారీ యూనిట్‌ ఏర్పాటుకు దోహదం చేశాం. యోగాభ్యాసం, ధ్యానం, నైపుణ్య శిక్షణ తదితరాల వల్ల ఖైదీల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఖైదీల మధ్య కొట్లాటలు, ఆగ్రహావేశాలు చాలా ఎక్కువగా ఉండేవి. మత్తుపదార్థాలకు అలవాటుపడినవారు డిప్రెషన్‌కు గురై, చేతులు కోసుకోవడం లాంటి చర్యలకు పాల్పడేవారు. జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేవారు. మా కార్యక్రమాలతో వారిలో పరివర్తన వచ్చింది. ‘రెడ్‌క్రాస్‌’ సంస్థతో కలిసి డి-అడిక్షన్‌ తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. ఎంతోమంది ఖైదీలు తమ సమస్యలను నాకు వినిపిస్తారు. జీవితంలో ఇకపై తప్పులు చెయ్యబోమనీ, గౌరవంగా జీవిస్తామనీ చెబుతారు. వారందరిలో అధికశాతం పరిస్థితులకు బాధితులు. వారిలో మార్పుకోసం దాదాపు రెండు దశాబ్దాలకు పైగా నేను అంకితం కావడం... దైవ సంకల్పంగా భావిస్తున్నాను.

ఇవీ చదవండి:

హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ

Updated Date - Nov 20 , 2025 | 05:43 AM