Share News

Anasuya Jena’s: వ్యర్థాలను వదిలించారు... ఆదాయ మార్గం చూపించారు!

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:06 AM

అరటి వ్యర్థాలను ఆదాయ మార్గంగా మార్చింది. వెయ్యికి పైగా రైతు కుటుంబాల ఆర్థిక సుస్థిరతకు దోహదం చేసింది. ‘‘నిబద్ధతతో, కలిసికట్టుగా పని చేయడమే మంచి ఫలితాలు సాధించే మార్గం’’ అంటున్న అనసూయ కథ ఆమె మాటల్లోనే...

Anasuya Jena’s: వ్యర్థాలను వదిలించారు... ఆదాయ మార్గం చూపించారు!

ఆదాయాన్నిచ్చే సాగుని మానుకోలేక, వ్యర్థాల్ని వదిలించుకోలేక సతమతమవుతున్న రైతులను కొత్తదారిలో నడిపించారు అనసూయ జెనా. భర్తతో కలిసి ఆమె చేసిన ప్రయత్నం... అరటి వ్యర్థాలను ఆదాయ మార్గంగా మార్చింది. వెయ్యికి పైగా రైతు కుటుంబాల ఆర్థిక సుస్థిరతకు దోహదం చేసింది. ‘‘నిబద్ధతతో, కలిసికట్టుగా పని చేయడమే మంచి ఫలితాలు సాధించే మార్గం’’ అంటున్న అనసూయ కథ ఆమె మాటల్లోనే...

‘‘అరటి చెట్ల నుంచి గెలలు తీసేసిన తరువాత..... నరికిన చెట్లను తోటలలోంచి తొలగించడం శ్రమతోనే కాదు, ఖర్చుతో కూడా కూడుకున్న వ్యవహారం. కూలీలకు రోజుకు రెండువేల రూపాయల వరకూ ఇవ్వాలి. సాధారణ రైతులు ఈ ఖర్చు భరించలేరు. దాంతో తమ తోటల పక్కనే వాటిని పడేసి, ఎండిపోయిన తరువాత కాల్చేసేవారు. ఆ పొగ చుట్టు పక్కల ప్రాంతాల్లో వ్యాపించేది. ఇక మరికొందరు రైతులు ఆ వ్యర్థాలను ఊరి బయట పారబోసేవారు. ఆ కుప్పలు పెద్ద గుట్టల్లా ఉండేవి. ఎండకు ఎండి, వానకు తడిసి, కుళ్ళిపోవడంతో... ఆ వైపు వెళ్ళలేనంత దుర్వాసన. ఈ వాతావరణ కాలుష్యం ప్రభావం సమీప గ్రామాల్లో కూడా తీవ్రంగానే ఉండేది. కొన్నేళ్ళ క్రితం మాకు ప్రతిరోజూ ఎదురయ్యే దృశ్యాలివి.

gfl;nk.jpg

వాటికి అర్థం కల్పించేందుకు...

మాది ఒడిశా రాష్ట్రం ఖుర్దా జిల్లాలోని బలిపట్న. మా జిల్లాలో సాగుచేసే వాణిజ్య పంటల్లో అరటి ప్రధానమైనది. ముఖ్యంగా మాకు దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బనమాలిపూర్‌ అరటి పంటకు ప్రసిద్ధి. దాదాపు ప్రతి ఇంటి పెరట్లోనూ అరటి మొక్కలు ఉంటాయి. రైతులకు ఆ పంట జీవనాధారమైతే, దానిద్వారా వచ్చే వ్యర్థాలు తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యేవి. నా భర్త కాశీనాథ్‌ జెనా గత ముప్ఫయ్యేళ్ళ నుంచి రూరల్‌ డెవల్‌పమెంట్‌ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు, అణగారిన వర్గాలకు జీవనోపాధి కల్పించడం లాంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండేవారు. తరచుగా మేము బనమాలిపురా మీదుగా ప్రయాణించేవాళ్ళం. అప్పుడు అరటి వ్యర్థాల సమస్యే మా సంభాషణల్లో ప్రధానంగా ఉండేది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే... రాబోయే రోజుల్లో దుష్ప్రభావాలు మరింత పెరిగిపోతాయనే ఆందోళన కలిగింది. కొందరు రైతులతో మాట్లాడినప్పుడు... పంట కోత తరువాత వ్యర్థాల్ని వదిలించుకోవడమే వారి ప్రధాన సమస్య అని గ్రహించాం. దీన్ని ఇతర ప్రాంతాల్లో ఎలా పరిష్కరిస్తున్నారో తెలుసుకోడానికి నా భర్త ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్రల్లో పర్యటించారు. అరటి బెరళ్ళ నుంచి నారు తీసి వస్త్రాలు నేయడం, ఉత్పత్తుల తయారీ లాంటివి గమనించారు. ఈ విధంగా వ్యర్థాలకు ఒక అర్థం కల్పించవచ్చనిపించింది. ఎన్నో నెలలపాటు పరిశోధన చేసిన తరువాత... 2021లో ‘జయదేవ్‌ బనానా ఫార్మర్స్‌ అండ్‌ ఆర్టిసన్స్‌ అసోసియేషన్‌’ను ఏర్పాటు చేశాం.


j.jpg

మూడు విభాగాల్లో...

ఆ తరువాత ఒక ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ తయారు చేసి, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎ్‌సఎంఇ) మంత్రిత్వశాఖకు అందజేశాం. ‘స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌’ (ఎస్‌పీవీ)గా ఈ సంఘాన్ని పరిగణిస్తూ... గ్రామీణ ఉపాధి, ఆర్థికాభివృద్ధి కోసం సహకరించడానికి ఆ శాఖ అంగీకరించింది. తొలి విడతగా, 350 మంది రైతులు మాతో చేరారు. ఆ సంఖ్య క్రమంగా పెరిగి ఇప్పుడు వెయ్యి దాటిపోయింది. అలాగే దాదాపు 40 మంది యువతకు, మహిళలకు ఉద్యోగాలను మా కల్పించాం. ఉత్పత్తుల విషయానికి వస్తే... వాటిని ఆహారం, వ్యవసాయం, ఉపయుక్తమైన వస్తువులు అనే మూడు విభాగాల్లో తయారు చేస్తున్నాం. అరటి దవ్వ పచ్చడి, జామ్‌, మురబ్బా, జ్యూస్‌, వడియాల్లాంటి ఆహార ఉత్పత్తులు, భూమి సారాన్ని పెంచే సూక్ష్మ పోషకాలు ఉన్న ‘జీవసార’, అలాగే అరటి నారతో బ్యాగ్‌లు, కోస్టర్లు, బాస్కెట్లు, గిఫ్ట్‌ బాక్సులు, టేబుల్‌ మ్యాట్స్‌... ఇలా అనేక ఉత్పత్తులను తయారు చేయించి విక్రయిస్తున్నాం. ఇంతకుముందు రైతుల వద్దకు మేమే వెళ్ళి... వ్యర్థాలను సేకరించేవాళ్ళం, ఇప్పుడు వారే నేరుగా మా కేంద్రానికి వచ్చి విక్రయిస్తున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండానే వారి పొలాలు తదుపరి పంట కోసం శుభ్రంగా మారుతున్నాయి. ఉత్పత్తుల తయారీ ద్వారా లాభాలు కూడా దక్కుతున్నాయి.

పురస్కారాలు... ప్రశంసలు

ఖుర్దాతోపాటు కటక్‌, పూరీ జిల్లాల రైతులు కూడా మా సంఘంలో భాగస్వాములయ్యారు. వారు తమ పంట దిగుబడి వల్ల వచ్చే మొత్తంతో పాటు ఈ వ్యర్థాల ద్వారా సగటున రూ.7 వేల నుంచి రూ.10 వేల మధ్య ఆదాయం పొందుతున్నారు. మా కార్యక్రమాలకు గుర్తింపుగా... రెండేళ్ళ నుంచి ఎన్నో పురస్కారాలు లభించాయి. అలాగే దేశంలోని పలుచోట్ల మేము ఏర్పాటు చేసిన ప్రదర్శనలకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఇప్పుడు మా ప్రాంతంలో అరటి వ్యర్థాలను తగులబెట్టడం, కుప్పలుగా పోయడం లాంటి దృశ్యాలు కనిపించడం లేదు. మరోవైపు రైతులకు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. ఒక సమస్య పరిష్కారానికి అందరూ కలిసికట్టుగా నిలబడి, నిబద్ధతతో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయనడానికి మా సంస్థ ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఇంతకన్నా సంతోషం, సంతృప్తి ఇంకేం ఉంటుంది?’’


ఇవి కూడా చదవండి..

Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు

Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..

For More National News and Telugu News..

Updated Date - Feb 10 , 2025 | 04:12 AM