Share News

నాన్న మాటే గుర్తొస్తుంది

ABN , Publish Date - May 14 , 2025 | 03:55 AM

‘‘సమాజం ఎదుర్కొంటున్న ఏదో ఒక సమస్యను కనీసం మన జీవిత కాలంలో పరిష్కరించగలిగితేనే ఈ జీవితానికి సార్థకత’’ అన్న నాన్న మాటల స్ఫూర్తితో స్వదేశంలో ‘కిడ్నాప్‌ పెళ్లిళ్ల’కు వ్యతిరేకంగా, బాలికలు, మహిళల హక్కుల కోసం...

నాన్న మాటే గుర్తొస్తుంది

మిస్‌ వరల్డ్‌

‘‘సమాజం ఎదుర్కొంటున్న ఏదో ఒక సమస్యను కనీసం మన జీవిత కాలంలో పరిష్కరించగలిగితేనే ఈ జీవితానికి సార్థకత’’ అన్న నాన్న మాటల స్ఫూర్తితో స్వదేశంలో ‘కిడ్నాప్‌ పెళ్లిళ్ల’కు వ్యతిరేకంగా, బాలికలు, మహిళల హక్కుల కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాడుతున్నారు ఐజాన్‌ చనాచెవ్‌. ‘మిస్‌ వరల్డ్‌’ పోటీల్లో కిర్గిస్తాన్‌ ప్రతినిధిగా పాల్గొంటున్న ఆమె... తన ఉద్యమ నేపథ్యం నుంచి అందాల పోటీల వరకూ అనేక అంశాలను ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘అది నా జీవితంలో మరచిపోలేని సందర్భం. నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు మా అమ్మ, నాన్న విడాకులు తీసుకున్నారు. నన్ను, మా తమ్ముణ్ణి తనతోపాటు తీసుకువెళ్లాలని అమ్మ అనుకుంది. కానీ నాన్న ఒప్పుకోలేదు. ‘‘నా కుమార్తెను ప్రపంచం గుర్తించేలా పెంచుతా’’ అని అమ్మతో ఆయన శపథం చేశారు. ప్రతిరోజూ ఆ మాట నాకు గుర్తుకువస్తూనే ఉంటుంది. మాది సంప్రదాయ ముస్లిం కుటుంబం అయినప్పటికీ... నాన్న నా ఇష్టాలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. నాకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించారు. ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తూ... నన్ను యూనివర్సిటీలో చదివించారు.


అక్కడ అది నిత్యకృత్యం

చదువుతోపాటు సామాజిక అంశాలపై స్పందించడం బాల్యం నుంచి నాన్న నాకు నేర్పారు. ‘‘సమాజం ఎదుర్కొంటున్న ఏదో ఒక సమస్యను కనీసం మన జీవిత కాలంలో పరిష్కరించగలిగితేనే ఈ జీవితానికి సార్థకత’’ అని ఆయన చెబుతూ ఉంటారు. నా స్వదేశమైన కిర్గిస్తాన్‌ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కిడ్నాప్‌ పెళ్లిళ్లు. నాన్న స్ఫూర్తితో అయిదారేళ్లుగా దానిపై నేను పోరాడుతున్నాను. బజారులో వెళ్తున్న యువతుల్లో, బాలలికల్లో తమకు నచ్చినవారిని కిడ్నాప్‌ చేసి, బలవంతంగా పెళ్లి చేసుకోవడం మా దేశంలో తరతరాలుగా కొనసాగుతున్న దుస్సంప్రదాయం. కిడ్నాప్‌ చేసి, వారి ఇళ్లకు తీసుకుపోయిన తరువాత... ఆ యువతుల కుటుంబీకులకు సమాచారం ఇస్తారు. వారి సమక్షంలో వెంటనే పెళ్లి జరిపిస్తారు. అందుకు ఆ యువతి నిరాకరిస్తే... అక్కడే చంపేస్తారు. ఇలా అనేకమంది యువతులు తమ కుటుంబ సభ్యుల కళ్లముందే హత్యకు గురవుతున్నారు. కిడ్నాప్‌ అయ్యాక... పెళ్లికి ఒప్పుకోవడం మినహా వేరు మార్గం లేకపోవడంతో... చాలామంది తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తరువాత అనేక హింసలకు గురవుతున్నారు. ‘ఇది అనాది ఆచారం’ అంటూ పురుషులు దీన్ని తమ హక్కుగా భావిస్తూ... దౌర్జన్యాలకు దిగడం నిత్యకృత్యంగా మారింది. మహిళల హత్యలు పెరుగుతూ ఉండడంతో... అయిదేళ్ల క్రితం ప్రభుత్వం దీన్ని నిషేధించింది. అయినప్పటికీ అటు పోలీసులు కానీ, ఇటు చట్టాలు కానీ ఏ మాత్రం అడ్డుకోలేకపోతున్నాయి. తనను కిడ్నాప్‌ చేసి పెళ్లి చేస్తున్నారని యువతులు స్వయంగా ఫిర్యాదు చేసినా... పోలీసులు స్పందించడం లేదు. చదువు మీద, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతులకు ఈ కిడ్నాప్‌ పెళ్లిళ్లు జీవితమంతా వేదనను మిగుల్చుతున్నాయి.


బెదిరింపులకు తగ్గేదేలే...

ఇలాంటి కిడ్నా్‌పల భయంతోనే... నేను యూనివర్సిటీలో చదివే సమయంలో నాన్న నన్ను ఒంటరిగా పంపేవారు కాదు. ఎప్పుడూ నాకు తోడుగా ఉండేవారు. ప్రపంచం దృష్టిలో మహిళా సాధికారత అంటే... మహిళలు ఉద్యోగం చేయడం, వ్యాపారాలు చేయడం. కానీ తమకు నచ్చినవారిని పెళ్లి చేసుకొని, గృహిణిగా స్థిరపడడమే అసలైన మహిళా సాఽధికారత అని నేను నమ్ముతాను. దీనిపై నేను అయిదేళ్లుగా ప్రజా ఉద్యమాలు చేస్తున్నాను. కిడ్నాప్‌ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పోరాడుతున్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ‘‘సంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు... ప్రాణం అంటే ప్రేమ లేదా?’’ అంటూ నిత్యం బెదిరింపులు వస్తూ ఉంటాయి. అయినా వెనక్కు తగ్గకుండా, ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం సాగిస్తున్నాను. ఈ పోరాటంలో ప్రజల నుంచి నాకు విశేషమైన మద్దతు లభిస్తోంది. అది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. మా ఉద్యమాల నేపథ్యంలో... ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. మరోవైపు... నేను యువతులు వారి కలలను సాకారం చేసుకొనేందుకు దోహదపడే అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతున్నాను.


బిర్యానీ రోజూ ఇష్టంగా తింటున్నా...

నా వ్యక్తిగత విషయాలకు వస్తే... నా మాతృభాష కిర్గి్‌సతోపాటు రష్యన్‌, తుర్కిష్‌, ఇంగ్లీష్‌, స్పెయిన్‌ భాషలు వచ్చు. అలాగే సైగల భాష (సైన్‌ లాంగ్వేజ్‌) కూడా బాగా వచ్చు. మా దేశం తరఫున ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్స్‌, నేషనల్‌ డ్యాన్సెస్‌ పోటీల్లో పలుమార్లు ప్రాతినిధ్యం వహించాను. చదువుకుంటున్న సమయంలో... పదేళ్ల క్రితమే భారతదేశానికి వచ్చాను. గ్వాలియర్‌, ఆగ్రా, ఢిల్లీ నగరాల్లో కొన్ని రోజులు గడిపాను. మళ్లీ కచ్చితంగా భారతదేశానికి రావాలని అనుకున్నాను. కానీ ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలకోసం వస్తానని ఊహించలేదు. ఈ పోటీలు తెలంగాణలో జరుగుతున్నాయని తెలిశాక... కిర్గిస్తాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయానికి వెళ్లి, ఈ రాష్ట్ర చరిత్ర గురించి తెలుసుకున్నాను. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు గురించి అధికారులు నాకు చాలా వివరంగా తెలిపారు. స్వరాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరగడం, అనేకమంది ప్రాణాలు కోల్పోవడం గురించి వింటుంటే చాలా బాధ కలిగింది. తెలంగాణ వంటకాలు, సంస్కృతి, పర్యాటక ప్రాంతాల గురించి కూడా తెలుసుకున్నాను. ఉద్యమాలతో ఏర్పడిన ఈ రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. నాకు హైదరాబాద్‌ బాగా నచ్చింది. కిర్గిస్తాన్‌ పర్యాటకానికి ప్రసిద్ధి. నేను ఉద్యోగం చేస్తున్నది కూడా పర్యాటక శాఖలోనే. ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలకు తెలంగాణ పర్యాటక శాఖ ఆతిథ్యం ఇస్తూ ఉండడంతో... ఈ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను చూడాలని ఎంతో ఆసక్తిగా ఉన్నా. వాటి గురించి మా దేశంలోనూ ప్రచారం చేస్తా. వారం రోజులుగా ఇక్కడ తెలంగాణ వంటకాలతో పాటు వివిధ భారతీయ వంటకాల రుచులను ఆస్వాదిస్తున్నా. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌ బిర్యానీ గురించి చాలా విన్నాను. ఇప్పుడు ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తింటున్నా.’’

ముహమ్మద్‌ ఆర్‌హెచ్‌ షరీఫ్‌


అదే నా లక్ష్యం

రష్యా, ఉక్రెయిన్‌లతో పాటు మొత్తం 15 దేశాల సమూహమైన ‘యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌’ (యుఎ్‌సఎ్‌సఆర్‌) నుంచి 1991లో విడిపోయిన కిర్గిస్తాన్‌ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. కేవలం నాలుగేళ్ల క్రితమే మా దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దాదాపు 70 లక్షల జనాభాలో 90 శాతం ముస్లింలు, మిగిలిన 10 శాతం క్రైస్తవులు, బౌద్ధులు ఉంటారు. మా దేశంలో అందాల పోటీల నిర్వహణ 2011లో ప్రారంభమయింది.

ఇస్లామిక్‌ దేశమైనా... అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ఎలాంటి ఆంక్షలూ లేవు. నేను ‘మిస్‌ కిర్గిస్తాన్‌’గా ఎంపిక కావడంతోపాటు... మా దేశం తరఫున ‘మిస్‌ ఎర్త్‌’ పోటీలకు ప్రాతినిధ్యం వహించాను. చదువులో భాగంగా... ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్స్‌, నేషనల్‌ డ్యాన్సెస్‌ కాంపిటీషన్‌, ఎడ్యుకేషనల్‌ ఎక్స్‌ఛేంజ్‌... ఇలా 9 సార్లు వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉంది. అందుకే ‘మిస్‌ వరల్డ్‌’ పోటీల్లో చాలా ఆత్మవిశ్వాసంతో పాల్గొంటున్నా. నా దేశంతో పాటు అత్యంత వెనుకబడిన దేశాల్లో మహిళలు కోరుకొనే సాధికారతకు పాటుపడడం నా లక్ష్యం. ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటం గెలిస్తే నా లక్ష్యాన్ని చేరుకోవడం మరింత సులువవుతుంది.

ప్రపంచం దృష్టిలో మహిళా సాధికారత అంటే... మహిళలు ఉద్యోగం చేయడం, వ్యాపారాలు చేయడం. కానీ తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొని, గృహిణిగా స్థిరపడడమే అసలైన మహిళా సాఽధికారత అని నేను నమ్ముతాను.

ఇవి కూడా చదవండి..

Operation Sindoor: ఎస్-400తో ప్రధాని మోదీ ... పాకిస్థాన్‌కు హెచ్చరిక సందేశం..
Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

Updated Date - May 14 , 2025 | 03:55 AM