Share News

Saleshwaram: ఆ ఆలయాన్ని తెరిచేది మూణ్ణాళ్ళే...

ABN , Publish Date - Feb 28 , 2025 | 04:15 AM

అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉండే దట్టమైన అడవిలోని గుహలో కొలువైన ఆ స్వామి భక్తులకు దర్శనం ఇచ్చేది ఏడాదికి కేవలం మూడు లేదా అయిదు రోజులే.

Saleshwaram: ఆ ఆలయాన్ని తెరిచేది మూణ్ణాళ్ళే...

సలేశ్వరం లింగమయ్యను దర్శించాలంటే భక్తి మాత్రమే కాదు, సహనం, సాహసం కూడా కావాలి. అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉండే దట్టమైన అడవిలోని గుహలో కొలువైన ఆ స్వామి భక్తులకు దర్శనం ఇచ్చేది ఏడాదికి కేవలం మూడు లేదా అయిదు రోజులే. ఈ పురాతన ఆలయం ఎన్నో విశేషాలకు నిలయం. ఈ యాత్రను అమరనాథ్‌ యాత్రతో భక్తులు పోల్చుతూ ఉంటారు.

క్రీస్తుశకం 13వ శతాబ్దం నాటి ‘మల్లికార్జున పండితారాధ్య చరిత్ర’లో సలేశ్వర క్షేత్రం గురించి పాల్కురికి సోమనాథుడు వైభవంగా వర్ణించాడు. అలాగే 16వ శతాబ్దంనాటి ‘శ్రీ పర్వత పురాణం’లో... ఈ గుహాలయం గురించి, ఇక్కడి సర్వేశ తీర్థం, పుష్కర తీర్థం గురించి ప్రస్తావనలు కనిపిస్తాయి. క్రీస్తుశకం 300-750 విష్ణుకుండినులు, చాళుక్యుల కాలంలో జరిగిన నిర్మాణాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఏడాదిలో కొద్దిరోజులు మాత్రమే తెరిచి ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. భక్తుల సందర్శనకు ఆలయాన్ని సందర్శించే రోజుల సంఖ్య కూడా నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. 1990వ దశకం వరకూ 11 రోజుల పాటు దీన్ని తెరిచి ఉంచేవారు. తరువాత భద్రత తదితర కారణాల వల్ల ఏడు రోజులకు, అయిదురోజులకు, చివరకు మూడు రోజులకు కుదించారు. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమికి అటు రెండు రోజులు, ఇటు రెండు రోజులు సలేశ్వర స్వామి ఆలయాన్ని తెరిచి ఉంచే అనవాయితీ కొన్ని ఏళ్ళు కొనసాగింది. ప్రస్తుతం మూడు రోజులే తెరుస్తున్నారు. ఫాల్గుణ మాసంలోనే ఏర్పాట్లు మొదలవుతాయి. కాగా, సౌకర్యాలను మెరుగుపరిచి, ఏడాదిలో తొమ్మిదినెలల పాటు సరేశ్వరం సంగమయ్యను భక్తులు దర్శించుకొనేందుకు వీలు కలిగిస్తామని అటవీశాఖ ప్రతిపాదిస్తోంది. దీనికి ఆదివాసీ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.



కీకారణ్యంలో ప్రయాణం...

తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని నల్లమల లోతట్టు అభయారణ్యంలో, జనావాసాలకు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే దట్టమైన కీకారణ్యంలో ప్రయాణం సాగించవలసి ఉంటుంది. సుమారు అయిదు కిలోమీటర్లు కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. మోకాళ్ళ కురువ వైపు రాళ్ళు తేలి ఉన్న కొండలను దిగాల్సి ఉంటుంది. హైదరాబాద్‌- శ్రీశైలం మార్గంలో... పర్హాబాద్‌ నుంచి అటవీ మార్గంలో 32 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. రాంపూర్‌ పెంట నుంచి కొద్ది దూరంలో వాహనాలు ఆపి, నడిచి వెళ్ళాలి. ఇక లింగాల నుంచి అప్పాయిపల్లి మీదుగా గిరిజన గుడారాల వరకూ వాహనాల్లో వెళ్ళవచ్చు. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో సలేశ్వరం ఆలయం ఉంటుంది. దారిలో ఎన్నో గుహలు, జలధారలు కనిపిస్తాయి. నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య ఇరుకైన దారిలో నడవాల్సి ఉంటుంది. అజాగ్రత్తగా ఉంటే అపాయం తప్పదు.


జలపాత స్నానం... స్వామి దర్శనం

ఏటా చైత్ర పౌర్ణమికి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షల సంఖ్యలో తరలి వస్తారు. చుట్టూ ప్రకృతి సౌందర్యంతో అలరారే ఈ ఆలయం ఎదుట దాదాపు వెయ్యి అడుగుల ఎత్తునుంచి జలపాతం దూకుతూ ఉంటుంది. భక్తులు అక్కడ ఉన్న గుండంలో స్నానం చేసి, ప్రధాన గుహలో ఉన్న లింగమయ్యను దర్శించుకొని, పూజలు చేస్తారు. ఆలయం ముందు వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు, కింది గుహలో మరో లింగం ఉంటాయి. భక్తులు మనసులో తలచుకున్న కోరికలన్నీ తీర్చే స్వామిగా లింగమయ్యను విశ్వసించి, ఆరాధిస్తారు.


మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ

Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్

For National News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 04:15 AM