Mysterious Man: అంతా ఒక్కటే
ABN , Publish Date - Feb 28 , 2025 | 04:05 AM
ఒక చెట్టు కింద ఓ మనిషి కనిపించాడు. వస్త్రాలు ధరించని ఆ వ్యక్తి... నేల మీద పడుకొని ఉన్నాడు. అతను చాలా సంతోషంతో ఉన్నట్టు బిగ్గరగా నవ్వుతున్నాడు. ప్రపంచమంతా తనతోనే ఉన్నట్టు, లోకమంతా తనదే అయినట్టు అతనిలో ఆనందం పొంగిపొరలుతోంది.
ఒక రాజు కొందరు భటులతో కలిసి అడవిలో వేటకు వెళ్ళాడు. వాళ్ళు జంతువులను తరుముతూ కొంత ముందుకు వెళ్ళాక... ఒక చెట్టు కింద ఓ మనిషి కనిపించాడు. వస్త్రాలు ధరించని ఆ వ్యక్తి... నేల మీద పడుకొని ఉన్నాడు. అతను చాలా సంతోషంతో ఉన్నట్టు బిగ్గరగా నవ్వుతున్నాడు. ప్రపంచమంతా తనతోనే ఉన్నట్టు, లోకమంతా తనదే అయినట్టు అతనిలో ఆనందం పొంగిపొరలుతోంది. ఇది చూసిన రాజుకు ఆశ్చర్యం వేసింది. తన భటులను పిలిచి... ‘‘ఆ మనిషి ఎవరో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకొని రా!’’ అని ఆజ్ఞాపించాడు.
భటులు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళారు. అతణ్ణి పిలిచారు. ఆ వ్యక్తి కనీసం వారు అక్కడ ఉన్న సంగతి కూడా గుర్తించనట్టు... తన ధోరణిలో తను ఉన్నాడు. భటులు కొద్దిసేపు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో... రాజు దగ్గరకు వచ్చి, జరిగింది చెప్పారు.
అప్పుడు రాజు గుర్రం దిగి... ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ‘‘స్వామీ! మీరెవరు? ఈ అడవిలో ఏం చేస్తున్నారు? దుస్తులేవీ లేకుండా, ఉత్త నేల మీద ఎందుకు పడుకున్నారు? మీలో అనంతమైన ఆనందం కనిపిస్తోంది. మీరు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ స్థితిని సాధించడానికి మీకు దారి చూపించిన గురువు ఎవరు?’’ అని ప్రశ్నించాడు.
అప్పుడు ఆ వ్యక్తి రాజు వైపు చూసి ‘‘నాయనా! ఈ శరీరం, ఈ భూమి, పక్షులు, కొన్ని పరికరాలు, కొందరు మనుషులు... ఇలా నాకు ఎందరో గురువులు. వారందరూ నాకు బోధించారు. వారందరి దగ్గరా నేను నేర్చుకున్నాను. గమనించినట్టయితే మన చుట్టూ ఉన్న ప్రతిదీ మనకి గురువే. ప్రతి దానినుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. మంచిని చూసి... అలా ఉండాలని తెలుసుకున్నాను. చెడ్డ విషయాలను గమనించి, వాటికి దూరంగా ఉండాలని గ్రహించాను. అలా నేర్చుకున్నాక... తిన్నా, తినకపోయినా, ఎక్కడ పడుక్కున్నా, మంచి దుస్తులు ఉన్నా, లేకపోయినా... అన్నీ ఒకటేననేది అర్థమయింది. అప్పుడు సంతోషం తప్ప ఇంకేం ఉంటుంది?’’ అని సమాధానం ఇచ్చాడు. అతను మహా జ్ఞాని అనీ, అవధూత అనీ, సాక్షాత్తూ దత్తాత్రేయ స్వరూపమనీ రాజుకు అర్థమయింది. అతని పాదాలకు నమస్కరించి, తన భటులతో కలిసి వెనుతిరిగాడు.
మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ
Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్
For National News And Telugu News