Share News

పిల్లల లైంగికతకు వారు బాధ్యులా

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:06 AM

ఆడపిల్ల పుడితే పురిటిలోనే చంపుతున్న అమానవీయ ఘటనలు ఈనాటికీ వార్తల్లో చూస్తున్నాం. కొడుకు ట్రాన్స్‌ మహిళగా మారినందుకు ఇంటి నుంచి గెంటేస్తున్న తల్లిదండ్రులు కోకొల్లలు. అలాంటిది తన...

పిల్లల లైంగికతకు వారు బాధ్యులా

ఆడపిల్ల పుడితే పురిటిలోనే చంపుతున్న అమానవీయ ఘటనలు ఈనాటికీ వార్తల్లో చూస్తున్నాం. కొడుకు ట్రాన్స్‌ మహిళగా మారినందుకు ఇంటి నుంచి గెంటేస్తున్న తల్లిదండ్రులు కోకొల్లలు. అలాంటిది తన కుమారుడు విష్ణుతేజ స్వలింగ సంపర్కుడు అని తెలిసినా... ఆ వాస్తవాన్ని స్వాగతించారు... బోయపాటి అంజలి. అంతేకాదు, కొడుకు చేపట్టిన గే హక్కుల ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. అంతర్జాతీయంగా జూన్‌... ఎల్జీబీటీక్యూ సమూహానికి హక్కుల పరిరక్షణ ఉత్సవాల మాసం. ఈ సందర్భంగా అంజలి ‘నవ్య’తో చెబుతున్న విశేషాలివి.

‘‘మా అబ్బాయి బాగా చదువుకుని, పెద్ద ఉద్యోగంలో చేరాలి. వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా జీవించాలి’... ఇలా అందరు అమ్మల్లాగానే నేనూ అనుకున్నాను. అది సాధ్యం కాదని తెలిసిన తర్వాత నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను. మా అబ్బాయి నేరుగా నాతో ఎప్పుడూ తాను ‘గే’ అని చెప్పలేదు. కానీ తన లైంగిక అస్తిత్వాన్ని, అభిప్రాయాలను రకరకాల రూపాలలో నాకు అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా నేషనల్‌ జియోగ్రఫిక్‌ ఛానల్‌లో ప్రసారమయ్యే హోమోసెక్సువల్‌ స్వభావం కలిగిన పక్షులు, జంతువుల కథనాలు చూపించి, ప్రకృతిలో స్వలింగ సంపర్కం సహజమే అనే అవగాహన కలిగించడం లాంటివి. నేను చదువుకున్నది పదో తరగతి అయినా... వైజ్ఞానిక శాస్త్ర విశేషాలు తెలుసుకోవడం నాకు చాలా ఆసక్తి. సమాజంలో విభిన్న లైంగిక ప్రవృత్తులు ఉంటాయన్న అవగాహన నాలో ఉంది. కాబట్టి మా అబ్బాయి నాతో చెప్పాలనుకున్న విషయాన్ని నేను అంతే సులభంగా, సున్నితంగా గ్రహించాను. వాడిని యథాతథంగా అంగీకరించాను.


నచ్చినట్టు ఉండమన్నాను...

మా అబ్బాయి ‘గే’ అని తెలిసిన తర్వాత, ‘మానసిక చికిత్స తీసుకో...’ ‘ఆలోచన మార్చుకో.!’ లాంటి ఒత్తిళ్లు వాడి మీద నేను ఎప్పుడూ తీసుకురాలేదు. ఆ లైంగికత అన్నది వాడికై వాడు కోరుకున్నది కాదు కదా! మరి మార్చుకోమని ఎలా అంటాం? ‘నిజానికి హోమోసెక్సువల్‌ లైంగిక భావన ప్రకృతికి విరుద్ధం కాదు. అలాంటి వారిని లైంగికత మార్చుకోవాలని బలవంతపెట్టడమే అసహజం’ అని తెలుసుకున్నాను. అందుకే నా బిడ్డ ఆలోచనలను, అభిప్రాయాలను పూర్తిగా స్వాగతించాను. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం... అప్పటికి వాళ్ల నాన్న చనిపోయి నాలుగు నెలలు. 2018 సెప్టెంబరులో అనుకుంటా... ఐపీసీ సెక్షన్‌ 377ను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. టెలివిజన్‌లో ఆ వార్తలు చూస్తూ విష్ణు ఎంతగా భావోద్వేగానికి లోనయ్యాడో మాటల్లో చెప్పలేను. అప్పుడు వాడితో ఒక్కటే అన్నాను.. ‘‘నువ్వు పూర్తి స్వతంత్రుడివి. నీకు నచ్చినట్టు బతుకు నాన్నా’’ అని. కనిపెంచిన బిడ్డ కళ్ల ముందే మానసికంగా కుంగిపోతూ, ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ కుమిలిపోతున్నప్పుడు మనం మాత్రం చూస్తూ సంతోషంగా ఉండగలమా? నా బిడ్డ మరొకరికి ద్రోహం చేయడంలేదు. నేరం చేయలేదు. మరి వాణ్ణి ఎందుకు తప్పుగా చూడాలి? నా బిడ్డ ‘గే’ అయినా, వాడికి తోచిన మంచి పనులు చేస్తూ సంతోషంగా ఉంటే చాలు. ఒక తల్లిగా అంతకుమించి నాకు మరే కోరికలూ లేవు.


అప్పుడు బంగారు గొలుసు ఇచ్చాను...

విష్ణుతేజ ఎమ్మెస్సీ పోస్టు గ్రాడ్యుయేషన్‌లో బయోటెక్నాలజీ పూర్తిచేశాడు. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆట, పాటల్లోనూ బాగా యాక్టివ్‌. నలుగురికి మంచి చేయాలన్నది వాడి ఆలోచన. ఒకవైపు ఎల్జీబీటీక్యూ ఉద్యమాలతో కలసి నడుస్తూనే తనలాంటి వారి హక్కుల కోసం ప్రత్యేకంగా పని చేయాలని ఉందన్నాడు. అందుకు కనీసం లక్షరూపాయలు అయినా అవసరమవుతాయని చెప్పాడు. మరొక నిమిషం ఆలోచించకుండా నా బంగారపు గొలుసు తీసి ఇచ్చాను. దాన్ని తాకట్టు పెట్టగా వచ్చిన సొమ్ముతో ఒక ఆఫీసు తీసుకున్నాడు. మూడేళ్లుగా ‘అస్తిత్వం ఫౌండేషన్‌’ ద్వారా ‘గే’ సంరక్షణ, సంక్షేమం కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాడు. ముకుందమాల అనే మహిళ కూడా నాలాంటి తల్లే. ఆమె కుమార్తె ట్రాన్స్‌మహిళ. ఈ ఫౌండేషన్‌ నిర్వహణలో విష్ణుతేజకు ఆమె సహకారం కూడా తోడవడంతో తాను కోరుకున్న విధంగా ముందుకు వెళుతున్నాడు. ఎల్జీబీటీక్యూ సమావేశాలకు, ప్రైడ్‌ మంత్‌ ప్రోగ్రామ్స్‌కు నన్నూ తరచుగా తీసుకెళుతుంటాడు. వాళ్ళు నన్ను ఎంతగా ఆదరించి, అభిమానిస్తారంటే... నాలో వాళ్ల అమ్మను చూసుకుంటారు.


జీవితాంతం ఒక తోడు...

మా అబ్బాయి ‘గే’ స్నేహితులు ఒకరిద్దరు ప్రాజెక్టుల పని మీద విదేశాలకు వెళ్లి జంటలుగా తిరిగివచ్చారు. వారంతా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంటారు. స్వలింగ సంపర్కుల జంట అయినా... సాధారణ భార్యాభర్తలాగే చాలా అన్యోన్యంగా ఒకరికొకరు చాలా ప్రేమగా మెలగడం చూసి నిర్ఘాంతపోయాను. ‘మా అబ్బాయి కూడా ఎవరినైనా తనకు ఇష్టమైన వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటే బావుంటుంది కదా’ అనిపించింది. అదే ఆలోచన వాడితో చెప్పాను. కానీ అవతలి నుంచి సమాధానం రాలేదు. వాడు ఒంటరిగా మిగిలిపోకూడదు అన్నది నా అభిమతం. నేను మాత్రం ఎంతకాలం వాడి మంచిచెడులు చూస్తాను? అందుకే విష్ణును అర్థంచేసుకొని వాడికి జీవితాంతం తోడుగా ఉండే ఒక వ్యక్తిని... అదీ వాడికి నచ్చిన అబ్బాయినే చూసుకొని కలసి బతకమని బతిమాలుతున్నాను. అదే సమయంలో మనుషుల్లో రకరకాల ప్రవృత్తులుంటాయి. గే కమ్యూనిటీలోనూ అంతా నమ్మకస్తులే ఉంటారనుకోలేం. రోజూ నేర వార్తల్లో రకరకాల వికృత పోకడలు చూస్తున్నాం కదా.! అందుకే విష్ణుకు ఎప్పుడు ఎలాంటి ఆపద ఎదురవుతుందేమోనన్న భయంకూడా నాలో లేకపోలేదు. కుటుంబం, సమాజంతో పాటు కొన్ని సందర్భాలలో... తన సమూహంతోనూ పోరాడాల్సిన సందర్భం తనకు ఎదురుకావచ్చు. కాబట్టి ‘‘అందరినీ అమాయకంగా నమ్మకు’’ అని హెచ్చరిస్తూ ఉంటాను.

సాంత్వన్‌


కన్నబిడ్డకన్నా ఎక్కువా?

మా సొంతూరు ఒంగోలు. మాది పరువు, మర్యాదలు, పట్టింపులకు విలువ ఇచ్చే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. నా భర్త సివిల్‌ కాంట్రాక్టరు. అనారోగ్యం కారణంగా ఐదేళ్ల కిందట ఆయన చనిపోయారు. విష్ణు లైంగికత గురించి వాళ్ల నాన్నగారికి కొంత అవగాహన ఉంది. దాంతో ప్రవర్తన మార్చుకోమని గట్టిగా మందలించిన సందర్భాలు ఉన్నాయి. అందరిలాగే విష్ణు కూడా మొదట్లో కుటుంబ హింస భరించాడు. వాటన్నిటినీ దాటి తన అస్తిత్వాన్ని బహిరంగంగా ప్రకటించాడు. ఆ విషయం మా బంధుమిత్రులకు తెలిసినా.. చాలామంది మా ఎదుట బయటపడలేదు. ఒకరిద్దరు మాత్రం ‘‘వాణ్ణి ఎందుకు అలా వదిలేశావు? పెళ్లిచేస్తే మారతాడు’ అని సలహాలిచ్చారు. అలాంటి మూర్ఖపు సలహాలు, సూచనలను నేనెప్పుడూ పట్టించుకోలేదు. వారి కోసం మా అబ్బాయిని వదులుకుంటామా? నాకు నా బిడ్డకన్నా బంఽధువులు ఎక్కువ కాదు. తమ లైంగికతకు పిల్లలు బాధ్యులు కారు. కనుక భిన్న లైంగికతలను అర్థం చేసుకొని తల్లిదండ్రులు వారికి మద్దతుగా ఉండాలి.

Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 30 , 2025 | 04:06 AM