దేశం కోసం కాబట్టి కాదనలేదు
ABN , Publish Date - May 11 , 2025 | 05:03 AM
‘‘ఏదైనా పండుగ వచ్చినప్పుడు... ఇంటి దగ్గర బిడ్డ లేడని వెలితిగా ఉంటుంది. కానీ అతనిలాంటి వారు సరిహద్దుల్ని రక్షిస్తున్నారు కాబట్టే అందరూ ప్రశాంతంగా పండుగ జరుపుకొంటున్నారని ఆనందంగా అనిపిస్తుంది’’ అంటున్నారు...
‘‘ఏదైనా పండుగ వచ్చినప్పుడు... ఇంటి దగ్గర బిడ్డ లేడని వెలితిగా ఉంటుంది. కానీ అతనిలాంటి వారు సరిహద్దుల్ని రక్షిస్తున్నారు కాబట్టే అందరూ ప్రశాంతంగా పండుగ జరుపుకొంటున్నారని ఆనందంగా అనిపిస్తుంది’’ అంటున్నారు ఉప్పరబోయిన పద్మ. నల్లగొండ జిల్లాకు చెందిన ఆమె కుమారుడు వెంకన్న కొన్నేళ్లుగా బీఎస్‌ఎఫ్‌లో... దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘మదర్స్ డే’ సందర్భంగా... ‘నవ్య’తో తన అమ్మ మనసును పద్మ పంచుకున్నారు.
‘‘మాది తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లాలోని తిరుమలరాయినిగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కుటుంబం. నాకు ముగ్గురు సంతానం. ఒకరు చనిపోయారు. ఇద్దరు మగపిల్లలు మిగిలారు. వారిలో వెంకన్న పెద్దవాడు. చదువు పూర్తయ్యాక ఆర్మీలో చేరుతానని చెప్పాడు. మాకు సైన్యం గురించి అప్పటివరకూ తెలీదు. కళ్లముందే ఉంటాడనుకున్న పెద్దబ్బాయి ఆర్మీలోకి వెళ్తానని అన్నప్పుడు... మొదట మాకు కొంచెం భయం వేసింది. తను ఏది చేసినా ఆలోచించే చేస్తాడని మాకు తెలుసు. దేశ సేవ చేస్తానంటే కాదనలేకపోయాం... ఆశీర్వదించి పంపించాం.
తనలోనే దాచుకుంటాడు...
వెంకన్న విధుల్లో చేరిన తరువాత... తొమ్మిది నెలలపాటు ఇంటికి రాలేదు. తనతో కలిసి చదువుకొని, ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు... పండుగ పూట ఇంటికి వచ్చి, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ ఉంటే బాధగా ఉండేది. మెల్లమెల్లగా మాకు పరిస్థితి అర్థమయింది. నా బిడ్డ, అతనిలాంటివారు దేశ సరిహద్దుల్లో కాపలాగా ఉండబట్టే... అందరూ ప్రశాంతంగా పండుగ జరుపుకొంటున్నారనే ఆనందంతో సర్దుకుపోతున్నాం. తను వచ్చినప్పుడు సరిహద్దుల్లో పరిస్థితి గురించి చెబుతూ ఉంటాడు. మేము ఆందోళన చెందుతామని తెలుసు కాబట్టి.. ఇబ్బందికరమైన విషయాలు చెప్పడు. మేము బాధపడే సంగతులేవీ చెప్పడానికి ఇష్టపడడు. వాటిని, తన కష్టాలను తనలోనే దాచుకుంటాడు. ఇక... తన విధి నిర్వహణలో భాగంగా ఆయుధం తప్పనిసరి. దేశ భద్రతకు అవసరమైన పనిలో ఉన్నాడు కాబట్టి... తనను ఆయుధంతో చూసినా సంతోషంగానే ఉంటుంది. ఎప్పుడైనా తన గురించి కాస్త కలవరపాటుకు గురైనా... ఆ తరువాత సర్దిచెప్పుకుంటాం.
భయపడకండి...
ప్రస్తుతం భారత్-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో... సైనికుల కుటుంబ సభ్యులకు నేను చెప్పేది ఒక్కటే. ఎవరూ భయపడవద్దు. యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. కానీ తప్పదనుకున్నప్పుడు శత్రువులకు తగిన విధంగా బుద్ధి చెప్పవలసిందే. పిల్లలు దేశ సేవలో ఉన్నారని గర్వపడాలి. వారిని ప్రోత్సహించాలి. దేశానికి సేవ చేసే అవకాశం అందరికీ రాదు. వచ్చినప్పుడు వదులుకోకూడదు. యువత ప్రతి ఒక్కరూ దేశ సేవకు అంకితం కావాలి.’’
సోమేశ్వర్
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: ఇండియాతో ఉద్రిక్తత..దారుణంగా పాకిస్తాన్ పరిస్థితి, కేజీ ఉల్లి రూ.300
India Pakistan Tensions: పాకిస్తాన్ను పట్టించుకోని అమెరికా..దాడులు ఆపించాలని వేడుకున్నా కూడా..
Operation Sindoor: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..
Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
యుద్ధం నేనే ఆపాను: కేఏ పాల్