Share News

A Line Dresses: హుందాతనాన్ని పెంచే ఎ లైన్‌ డ్రెస్‌లు

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:00 AM

ఫ్యాషన్‌తోపాటు సౌకర్యవంతంగా ఉండే దుస్తులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు నేటి మహిళలు. ఈ కోవలోనే ‘ఎ- లైన్‌’ డ్రెస్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. పేరుకు తగ్గట్టు...

A Line Dresses: హుందాతనాన్ని పెంచే ఎ లైన్‌ డ్రెస్‌లు

ఫ్యాషన్‌తోపాటు సౌకర్యవంతంగా ఉండే దుస్తులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు నేటి మహిళలు. ఈ కోవలోనే ‘ఎ- లైన్‌’ డ్రెస్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. పేరుకు తగ్గట్టు ఇవి అ ఆకారంలో కనిపిస్తుంటాయి. మినీలు, మిడ్డీలు, స్కర్టులు, మ్యాక్సీలు, లాంగ్‌ గౌన్లు అందుబాటులో ఉన్నాయి. కాలేజీలకు వెళ్లే యువతులతోపాటు కార్యాలయాలకు వెళ్లే మధ్య వయసు మహిళలు కూడా వీటిని ధరించడానికి ఇష్టపడుతున్నారు.

డ్రెస్‌ ఎలా ఉంటుందంటే...

ఎ- లైన్‌ డ్రెస్‌ను పై భాగంలో సన్నగా కింది భాగంలో వెడల్పుగా త్రిభుజాకారంలో ఉండేలా డిజైన్‌ చేస్తారు. మెడ, భుజాలు, నడుము భాగాలకు చక్కగా అమరేలా డ్రెస్‌ ఉంటుంది. నడుము నుంచి కాస్త వెడల్పుగా చూడడానికి చక్కని గౌన్‌లా కనిపిస్తుంది. శరీరాన్ని పట్టి ఉంచకుండా కాస్త వదులుగా హాయిగా అనిపించేలా ఉంటుంది. ఇష్టానుసారం డ్రెస్‌ పొడవును పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఈ డ్రెస్‌కు మ్యాచ్‌ అయ్యేలా లెగ్గింగ్స్‌ లేదా ఏ రకమైన ప్యాంట్‌ అయినా వేసుకోవచ్చు.


అందంగా ఇలా...

ఎ- లైన్‌ డ్రెస్‌లు ఎలాంటి శరీరాకృతి ఉన్నవారికైనా చక్కగా నప్పుతాయి. బొద్దుగా, సన్నగా, పొడవుగా, పొట్టిగా ఎలా ఉన్నవారైనా ఈ డ్రెస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మేని ఛాయను బట్టి రంగులు, డిజైన్లు ఎంచుకుంటే సొగసుగా కనిపిస్తారు. డెనిమ్‌, కాటన్‌, పాలిస్టర్‌, షిఫాన్‌, సిల్క్‌, నైలాన్‌, లెనిన్‌.. ఇలా అన్ని రకాల ఫ్యాబ్రిక్‌లతో ఎ- లైన్‌ డ్రెస్‌లను రూపొందిస్తున్నారు. స్లీవ్‌లెస్‌, పొడవు చేతులు, పొట్టి చేతులు, నడుముభాగంలో బెల్ట్‌ ఉండే రకాలు అందుబాటులో ఉన్నాయి. వి, యు, కాలర్‌ నెక్‌లు డ్రెస్‌ అందాన్ని పెంచుతాయి. ఫ్లోరల్‌ ప్రింట్‌లు, సాదా రంగులో ఉండే గౌన్‌, స్కర్ట్‌ టైప్‌ డ్రెస్‌లను యువతులు రోజువారీ వేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. పెద్ద బోర్డర్‌ డిజైన్లు, అదనపు హంగులతో కూడిన లాంగ్‌ గౌన్లను ఫంక్షన్లలో ధరిస్తున్నారు. ఎ- లైన్‌ డ్రెస్‌ల మీద పెద్దగా ఆభరణాలు పెట్టుకోనవసరం లేదు. చేతులకు చక్కని వాచ్‌, అందమైన బ్యాంగిల్‌ లేదా బ్రాస్‌లెట్‌, చెవులకు జుమ్కీలు పెట్టుకుని పాదాలకు ఆకర్షణీయమైన శాండల్స్‌ వేసుకుంటే హుందాగా కనిపిస్తారు. మంచి హెయిర్‌ స్టయిల్‌, లైట్‌ మేకప్‌తో అందంగా మెరిసిపోవచ్చు.

ఇవి కూడా చదవండి..

సిందూర్ శపథాన్ని నెరవేర్చాం.. అందుకే ఈ విజయోత్సవం

కశ్మీర్‌లో అంతా ప్రశాంతతే ఉంటే పహల్గాం దాడి ఎలా జరిగింది: ప్రియాంక

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం

Updated Date - Jul 30 , 2025 | 03:00 AM