Share News

Mandakini Shahs Inspiring Journey: బైకర్‌ బామ్మ

ABN , Publish Date - Nov 26 , 2025 | 01:24 AM

87 Year Old Biker Grandma Mandakini Shahs Inspiring Journey

Mandakini Shahs Inspiring Journey: బైకర్‌ బామ్మ

విభిన్నం

87 ఏళ్ల వయసులో స్కూటర్‌ నడపడమే కాదు, షోలే సినిమాను తలపించేలా చెల్లిని వెంటేసుకుని మరీ రయ్యిన దూసుకుపోతున్నారు అహ్మదాబాద్‌కు చెందిన మందాకినీ షా. మహిళా మండళ్లు, పంచాయితీ సమావేశాలతో నిరంతరం బిజీ బిజీగా ఉండే మందాకిని, సమాజ సేవ గురించీ, స్కూటర్‌తో ఏర్పడిన అనుబంధం గురించి ఇలా వివరిస్తున్నారు...

‘‘నా పేరు మందాకినీ షా. నాకు 87 ఏళ్లు. చెల్లెలు ఉషతో కలిసి, స్కూటర్‌ మీద చక్కర్లు కొట్టడమంటే నాకు చాలా ఇష్టం. నేను అహ్మదాబాద్‌లోనే పుట్టి పెరిగాను. మేం ఐదుగురం అక్కాచెల్లెళ్లం. మాకొక తమ్ముడు కూడా ఉన్నాడు. అందర్లోకీ నేనే పెద్దదాన్ని కాబట్టి జీవితపాఠాలను ఎంతో ముందుగానే నేర్చేసుకున్నాను. స్వాతంత్రసమరయోధుడైన నాన్న, నా చిన్నతనంలో ఏదో ఒక వ్యాపారంలో స్థిరపడాలని పరితపించేవారు. కానీ అందుకు సరిపడా డబ్బు మా దగ్గర ఉండేది కాదు. దాంతో వ్యాపారం చేయలేకపోయారు. అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచింది. ఆమె కష్టాన్ని చూస్తూ పెరిగానేమో, వీలైనంత త్వరగా నా కాళ్ల మీద నేను నిలబడాలని నిర్ణయించుకున్నాను. అందుకే కాలేజీ చదువు వద్దనుకుని, బడి చదువు పూర్తవగానే ఉద్యోగంలో చేరిపోయాను. అలా 16వ ఏట బాలమందిర్‌లో టీచర్‌గా పని చేయడం మొదలుపెట్టాను.


సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ..

నాకు ఇంగ్లీషు అంతగా రాదు. కానీ జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల బలంగా ఉండేది. దాంతో సమాజ సంక్షేమ పథకాల్లో చేరిపోయాను. మహిళా మండళ్లను కలుస్తూ, పంచాయితీ సమావేశాల్లో పాల్గొంటూ మహిళా హక్కుల గురించి బోధించడం మొదలుపెట్టాను. అలా దుమ్ము లేచే రోడ్ల మీద వేర్వేరు చోట్లకు ప్రయాణాలు చేసే క్రమంలో, స్కూటర్‌, జీప్‌ నడపడం నేర్చేసుకున్నాను. ఆ తర్వాత ఒక సెకండ్‌ హ్యాండ్‌ స్కూటర్‌ కొనుక్కున్నాను. స్కూటర్‌ చేతిలో ఉంటే, ప్రయాణాలకు వెనకాడే పరిస్థితి ఉండదు. అయితే పెద్ద వయసులో ఒక మహిళ స్కూటర్‌ నడపడమన్నది ఆశ్చర్యకరమైన విషయమే! అందరూ వింతగా చూసేవారు. అక్కడితో ఆగితే ఫరవాలేదు. చాలా ఏళ్ల పాటు నన్నొక ప్రశ్నతో ఇబ్బంది పెట్టారు.

16 ఏళ్ల యువతిలా...

‘మీకు పెళ్లి కాలేదా? మీరు విధవా?’’ అనే వాళ్ల ప్రశ్న నన్ను చాలా కాలం ఇబ్బంది పెట్టింది. వాళ్లకు.. ఒక ఒంటరి మహిళ, ముగియని కథ లాంటిది. కానీ నిజానికి నా కథ కాస్త ఆలస్యంగా మొదలైందనే విషయం వాళ్లకు తెలియదు. ఒకానొక సందర్భంలో నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ మనం అనుకున్నట్టు సాగితే అది జీవితం ఎలా అవుతుంది? అందుకే జీవితంతో రాజీ పడిపోయాను. ట్రాఫిక్‌ పోలీసులు ఇప్పటికీ... ‘అమ్మా మీరు స్కూటర్‌ ఎందుకు నడుపుతున్నారు?’ అని అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నకు చిరునవ్వే నా సమాధానం. స్కూటర్‌ నడుపుతున్నప్పుడు ముఖాన్ని స్పృశించే గాలి, నన్ను 16 ఏళ్ల యువతిననే భావనకు లోను చేస్తుందని ఎంతమందికి చెప్పను? వయసు నాలో సత్తువను తగ్గిస్తూ ఉండవచ్చు. కానీ మనసులో పట్టుదలను సడలించలేకపోయింది. నేనిప్పటికీ చెల్లి ఉషను వెంటబెట్టుకుని వేర్వేరు ఊర్లు తిరుగుతూ ఉంట ాను. ప్రతిరోజూ స్నేహితులను కలుసుకుంటూ ఉంటాను. ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ ఉంటాను. 80ల్లో ఉన్నాను కాబట్టి ఇక్కడితో నా కథ కంచికే అనుకుంటే పొరపాటు, సమాజం ఊహించని జీవితం జీవించాను. నా కథ ముగియడానికి ఇంకా ఎంతో సమయం మిగిలిఉంది.’’

ఇవి కూడా చదవండి...

ఉగాదిలోగా 5 లక్షల ఇళ్లు పూర్తి: మంత్రి పార్థసారథి

ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2025 | 01:24 AM