Euthanasia law: గౌరవ మరణం కోసం...
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:49 AM
జీవనపోరాటం చేసేవాళ్లను చూశాం. కానీ కర్ణాటకకు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు కరిబసమ్మ మరణం కోసం ప్రభుత్వాలతో పోరాడారు. తాజాగా కర్ణాటక రాష్ట్రం గౌరవనీయమైన మరణాన్ని పొందే హక్కును చట్టబద్ధం చేయడంతో, ఆ హక్కును వినియోగించుకోబోయే తొలి లబ్దిదారు కాబోతున్నారామె. ఆ వివరాలు...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కరిబసమ్మ వెన్నుపూస పట్టు తప్పడంతో గత 30 ఏళ్లుగా తీవ్ర వేదనను అనుభవిస్తున్నారు. ఆ తర్వాత ఆమెకు క్యాన్సర్ కూడా సోకింది. తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతూ, చికిత్సకు స్పందించకుండా, వ్యాధులను నయం చేసుకునే వీల్లేని రోగులకు కారుణ్య మరణ హక్కును కల్పించాలని కోరుతూ ఆమె, గత 24 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. అందుకోసం కర్ణాటక ముఖ్యమంత్రి, భారత ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీం కోర్టులతో సహా రాజకీయ నాయకులకు లెక్కలేనన్ని పిటీషన్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తన ఆస్థులన్నీ పోగొట్టుకున్నారు. ఆర్థికంగా చితికిపోయారు. ఆత్మీయులు, బంధువులను దూరం చేసుకున్నారు. గత 20 ఏళ్లుగా వృద్ధాశ్రమాల్లోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం దావణగెరెలోని ఒక వృద్ధాశ్రమంలో, భర్తతో కలిసి నివసిస్తున్న కరిబసమ్మ తన దగ్గర మిగిలిని ఆరు లక్షల రూపాయల సొమ్మును కూడా బిఎ్‌సఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) సంక్షేమానికి దానం చేశారు. సంతానం లేని కరిబసమ్మ తన పోరాటం, వ్యాధులతో పోరాడుతున్న ఎంతోమందికి ద్వారాలు తెరుస్తుందని ఇంతకాలంగా ఎదురుచూశారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేయడంతో... ‘ఆ హక్కును వినియోగించుకునే వీలున్న రోగులందరూ తమ వంతు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ జాబితాలో ఎంతమంది ఉన్నా, అందరి కంటే ముందు ఆ అవకాశం నాకే దక్కాలని కోరుకుంటున్నా’ అంటూ కరిబసమ్మ మీడియాతో అనడం విశేషం.
అలుపెరగని పోరాటం
‘గౌరవంగా మరణించే హక్కును పొందడం’, ‘భారత దేశమంతటా నిష్ర్కియాశీల కారుణ్య మరణం (ప్యాసివ్ యుథనేషియా)పై ఏకరీతి చట్టం తీసుకురావడం’, దీర్ఘకాలికంగా బాధపడే వ్యక్తుల అవసరతలు’ గురించి కరిబసమ్మ ఏళ్ల తరబడి ప్రభుత్వంతో పోరాడుతున్నారు. చికిత్సకు లొంగని వ్యాధుల ఖర్చులు కుటుంబ సభ్యులకు భారం కాకూడదనీ, పేదరికానికి కారణం కాకూడదనీ, చికిత్సతో నయం కాని వ్యాధుల కోసం ఇల్లూ వాకిళ్లను అమ్ముకోవడం వల్ల ఉపయోగం లేదనీ ఆమె వాదించారు. నిజానికి భారత దేశం 2018లో ప్యాసివ్ కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసింది. అయితే తాజాగా కర్నాటక ప్రభుత్వం గౌరవంగా మరణించే హక్కును అధికారికంగా ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వ కొత్త విధానం ప్రకారం, చికిత్సకు స్పందించకుండా, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతూ లైఫ్ సపోర్ట్ మీద ఉన్న వాళ్లు మాత్రమే ఈ గౌరవప్రదమైన మరణాన్ని ఆశ్రయించే వీలుంది. కారుణ్య మరణానికి భిన్నమైన ఈ నిబంధన, శాశ్వతంగా కదల్లేని స్థితిలో ఉన్న రోగులకు మాత్రమే వర్తిస్తుంది.
నిష్ర్కియాశీల కారుణ్య మరణం అంటే?
ప్రాణాలను నిలిపి ఉంచడానికి తోడ్పడే వైద్య చికిత్సలను ఉపసంహరించుకుని, సదరు వ్యక్తిని మరణానికి చేరువ చేయడమే నిష్ర్కియాశీల కారుణ్య మరణం. ఇది యాక్టివ్ యుథనేషియా (క్రియాశీల కారుణ్య మరణం)కు పూర్తి భిన్నం. క్రియాశీల కారుణ్య మరణంలో ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి జీవితాన్ని అంతం చేయడం జరుగుతుంది. నిష్ర్కియాశీల కారుణ్య మరణంలో, లైఫ్ సపోర్ట్ యంత్రాలను ఉపసంహరించడం, ఆహారాన్ని అందించే ఫీడింగ్ ట్యూబ్‌ను ఉపసంహరించడం లాంటివి ఉంటాయి.
ఇవి కూడా చదవండి...
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.