Love Affair: ముగ్గురు పిల్లల తల్లితో ప్రేమ.. ఆమె చేసిన పనికి కక్ష గట్టి..
ABN , Publish Date - May 17 , 2025 | 07:40 AM
Love Affair: లక్ష్మి తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. మంగళూరులో కూలీ పని చేస్తూ పిల్లల్ని సాకుతోంది. ఇలాంటి సమయంలో హవేరీ జిల్లాకు చెందిన సునీల్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

అవసరాల కోసం దార్లు తొక్కే పాత్రలే తప్ప.. హీరోలు, విలన్లు లేరీ నాటకంలో... అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ప్రతీ మనిషి తన అవసరం కోసం మాత్రమే ఇతరులతో ఉంటాడు. ప్రేమ, డబ్బు, శారీరక సుఖం, పదవి... అవసరం ఏదైనా కావచ్చు. మనతో నటించే వాళ్లే ఎక్కువ. అలాగని నిజంగా ఎదుటి వ్యక్తిని ప్రేమించే వాళ్లు.. అభిమానించే వాళ్లు ఉండరని కాదు. నూటికి 10 శాతం ఎలాంటి కల్మషం లేకుండా ఎదుటి వ్యక్తితో ఉండేవారు కొందరైతే.. 90 శాతం మంది అవసరాల కోసమే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే క్రైమ్ స్టోరీలో అతడిది శారీరక అవసరం.. ఆమె ఆర్థిక అవసరం.. ఇద్దరూ ఒక్కటయ్యారు.
కొంతకాలం వీరి మధ్య బంధం సాగింది. ఇకపై ఆమెతో అవసరం లేదనుకున్న యువకుడు వేరే యువతితో పెళ్లికి సిద్ధం అయ్యాడు. తన అవసరం తీరలేదు కాబట్టి.. ఆమె బ్లాక్ మెయిల్ చేసింది. చివరకు హత్యకు గురైంది. ఈ సంఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని గదగ్ జిల్లా నెలోగల్ గ్రామానికి చెందిన లక్ష్మి ఇనగలగి అనే మహిళకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఇద్దరూ విడిపోయారు.
లక్ష్మి తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. మంగళూరులో కూలీ పని చేస్తూ పిల్లల్ని సాకుతోంది. ఇలాంటి సమయంలో హవేరీ జిల్లాకు చెందిన సునీల్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నేళ్ల పాటు ఇద్దరూ కలిసి ఉన్నారు. కొన్ని నెలల క్రితం సునీల్‌కు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. ఈ విషయం లక్ష్మికి తెలిసింది. తనకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే తమ సంబంధాన్ని బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో సునీల్ ఆగ్రహానికి గురయ్యాడు.
తన స్నేహితులు సిద్దప్ప, నటరాజ్, రమేశ్‌లతో కలిసి లక్ష్మి మర్డర్ ప్లాన్ వేశాడు. ఏప్రిల్ 22వ తేదీన లక్ష్మిని కారులో మంగళూరు తీసుకెళ్లాడు. అక్కడ కేబుల్ వైర్‌ను ఆమె గొంతుకు చుట్టి చంపేశారు. తర్వాత శవాన్ని సురంగి ప్రాంతంలో పడేసి పోయారు. ఆమె శవం గురించి పోలీసులకు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో సునీల్ వ్యవహారం బయటపడింది. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. అతడితో పాటు అతడి స్నేహితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
Gold And Silver Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
Viral Video: భార్యను తలకిందులుగా వేలాడదీసిన భర్త.. కారణం ఏంటంటే..