Yatindra Siddaramaiah: రాజకీయ చరమాంకంలో మా నాన్న
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:15 AM
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో సీఎం సిద్దరామయ్య కుమారుడు....
సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో సీఎం సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తన తండ్రి సిద్దరామయ్య రాజకీయ చరమాంకంలో ఉన్నారని, ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు సతీశ్ జార్కిహొళి సమర్థుడని యతీంద్ర పేర్కొన్నారు. బెళగావి జిల్లా రాయభాగ తాలూకా కప్పలగుడ్డిలో బుధవారం జరిగిన కనకదాస విగ్రహావిష్కణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో, రాష్ట్రంలో త్వరలో నాయకత్వ మార్పు ఉంటుందని యతీంద్ర సంకేతం ఇచ్చారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, యతీంద్ర కొంతసేపటికే యూటర్న్ తీసుకున్నారు. నాయకత్వ మార్పు ఊహాగానమే అంటూ కొట్టిపారేశారు. ఈ విషయంలో తమ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని తెలిపారు.