Woman Oath: భర్త హత్యకు ప్రతీకారం.. శపథం చేసి మరీ చంపింది..
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:10 PM
Woman Takes Life Of Three: సోమ గ్యాంగు సభ్యులు చీకట్లో పరిగెడుతున్న వారి ముఖాలు గుర్తు పట్టలేకపోయారు. పరిగెడుతున్నది జగదీష్, అన్నప్పలు అనుకుని వెంబడించారు. వారిని చంపేశారు.
భర్తను చంపిన వారిని చంపేంత వరకు తాను తాళి బొట్టు తియ్యనని ఓ మహిళ శపథం చేసింది. భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఏకంగా ముగ్గురిని చంపింది. ఈ సంఘటన కర్ణాటకలోని కలబురగిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కలబురగికి చెందిన రౌడీ షీటర్ సోమ.. గత సంవత్సరం నవంబర్ 12వ తేదీన హత్యకు గురయ్యాడు. సిద్ధార్థ్ తుగడి, జగదీష్, అన్నప్పలు సోమను చంపేశారు. ఈ విషయం తెలిసి సోమ భార్య భాగ్యశ్రీ ఆగ్రహంతో ఊగిపోయింది.
భర్త శవంపై ఓ శపథం చేసింది. ‘నిన్ను చంపిన ఆ ముగ్గుర్ని చంపేవరకు నా తాళి బొట్టు తియ్యను’ అంది. సోమ మర్డర్ కేసులో ఆ ముగ్గురు జైలుకు వెళ్లారు. భాగ్యశ్రీ, సోమ సోదరులు ఈరన్న, నాగరాజ్ ఆ ముగ్గురు ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నారు. మంగళవారం సిద్ధార్థ్, జగదీష్, అన్నప్పలు బెయిల్ మీద విడుదల అయి బయటకు వచ్చారు. ఈ విషయం సోమ గ్యాంగుకు తెలిసింది. భాగ్యశ్రీ, సోమ సోదరులు మర్డర్ ప్లాన్ వేశారు. తమ గ్యాంగును రంగంలోకి దింపారు.
సిద్ధార్థ్, జగదీష్, అన్నప్పలు వారి సొంత డాబా దగ్గర ఉన్నారని మంగళవారం అర్ధరాత్రి సోమ గ్యాంగుకు సమాచారం అందింది. సోమ గ్యాంగ్ ఆలస్యం చేయకుండా డాబా దగ్గరకు వెళ్లింది. వాళ్లు డాబాకు చేరుకునే సమయానికి జగదీష్, అన్నప్పలు అక్కడినుంచి వెళ్లిపోయారు. అక్కడ సిద్ధార్థ్, డాబాలో పని చేసే రమణ, రామచంద్ర ఉన్నారు. సోమ గ్యాంగ్ సిద్ధార్థ్‌పై దాడి చేసి చంపేసింది. దీంతో భయపడిపోయిన రమణ, రామచంద్ర పొలాల వైపు పరుగులు పెట్టారు.
సోమ గ్యాంగు సభ్యులు చీకట్లో పరిగెడుతున్న వారి ముఖాలు గుర్తు పట్టలేకపోయారు. పరిగెడుతున్నది జగదీష్, అన్నప్పలు అనుకుని వెంబడించారు. వారిని చంపేశారు. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయారు. మర్డర్ల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూడు మర్డర్లతో సంబంధం ఉన్న 10 మందిని అరెస్ట్ చేశారు. భాగ్యశ్రీని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
భార్య అలా చేసిందని మెట్రో రైలు తగుల బెట్టాడు..
తరచుగా ఆవలిస్తుంటే జాగ్రత్త.. మీ శరీరం చెప్పే ఆరోగ్య సంకేతాలు ఇవే!