Girl Prettier Than Her: లేడీ సీరియల్ కిల్లర్.. తనకంటే అందంగా ఉంటే చంపేస్తుంది..
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:28 PM
ఓ మహిళ సీరియల్ కిల్లర్‌గా మారింది. తనకంటే అందంగా కనిపించిన బాలికల్ని చంపేసింది. నీటిలో ముంచి వారి ప్రాణాలు తీసింది. తన మీద అనుమానం రాకుండా ఉండటానికి కన్న కొడుకును కూడా చంపేసింది.
తనకంటే అందంగా ఉన్నారన్న కోపంతో ఓ మహిళ ముగ్గురు బాలికలపై దారుణానికి ఒడిగట్టింది. వారిని నీటిలో ముంచి చంపేసింది. కేసునుంచి తప్పించుకోవడానికి, తన మీద అనుమానం రాకుండా ఉండటానికి కన్న కొడుకును కూడా చంపేసింది. చివరకు పాపం పండి అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది. ఈ సంఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం సోనిపత్‌కు చెందిన విధి అనే బాలిక తన కుటుంబంతో కలిసి బంధువుల పెళ్లి కోసం పానిపత్‌లోని నౌల్తా గ్రామానికి వచ్చింది.
సోమవారం మధ్యాహ్నం పెళ్లి వేడుక సందర్భంగా విధి కనిపించకుండా పోయింది. ఫ్యామిలీ మొత్తం బాలిక కోసం వెతకటం ప్రారంభించింది. విధి బంధువులు ఉంటున్న బిల్డింగ్‌లో కూడా వెతకటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే బాలిక నాన్నమ్మ ఫస్ట్ ఫ్లోర్‌లోని స్టోర్ రూములోకి వెళ్లింది. అక్కడి దృశ్యం చూసి షాక్ అయింది. విధి తల నీళ్ల టబ్‌లో మునిగి ఉంది. కాళ్లు నేలపై ఉన్నాయి. ఆమె గట్టిగా కేకలు పెట్టింది. అందరూ స్టోర్‌రూము దగ్గరకు వచ్చారు. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు.
ఇక, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విధికి అత్త వరుసయ్యే పూనమ్ అనే మహిళపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. విధి హత్యతో పాటు మరో మూడు హత్యల గురించి కూడా పూనమ్ బయటపడింది. పూనమ్ ఓ సీరియల్ కిల్లర్ అని తేలింది. ఆమె తనకంటే అందంగా కనిపించే బాలికల్ని టార్గెట్ చేసి చంపుతూ ఉంది.
2023లో వదిన కూతుర్ని చంపేసింది. పాప తనకంటే అందంగా ఉందన్న కోపంతో నీటిలో ముంచి ప్రాణం తీసింది. తన మీద అనుమానం రాకుండా ఉండటానికి కన్న కొడుకును హత్య చేసింది. పాపను చంపినట్లే కొడుకును కూడా నీటిలో ముంచి చంపేసింది. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో శివాహ్ గ్రామానికి చెందిన బాలికను కూడా చంపేసింది. విధి హత్య కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా ఈ మూడు హత్యలు బయటపడ్డాయి. పోలీసులు పూనమ్‌ను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఎంసీడీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీదే పైచేయి.. రెండో ప్లేస్‌లో ఆప్ః
సచిన్ రికార్డు సాధ్యమయ్యేనా.. కింగ్ కోహ్లీ అరుదైన సెంచరీ ప్రత్యేకతలివే..