Parliament Winter Sessions: శీతాకాలం.. గరంగరమే!
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:04 AM
పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. బిహార్‌లో భారీ విజయంతో దూకుడు మీదున్న అధికారపక్షం ఒకవైపు..
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. బిహార్‌లో భారీ విజయంతో దూకుడు మీదున్న అధికారపక్షం ఒకవైపు.. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ(సర్), ఢిల్లీ పేలుళ్లు, వాయు కాలుష్యం, అదానీ కంపెనీలో ఎల్‌ఐసీ పెట్టుబడులు వంటి అంశాలపై నిలదీసేందుకు ప్రతిపక్షం మరోవైపు సమావేశాలకు సిద్ధమయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగుతాయి.
సెలవు దినాలు మినహాయించి మొత్తం 15 రోజులు సమావేశాలు జరుగుతాయి. కొత్తగా 10 బిల్లులతోపాటు నాలుగు ఆర్థిక సవరణ బిల్లులు, కాలం చెల్లిన మొత్తం 120 చట్టాలను రద్దు చేేస మరో కీలక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్థమైంది. ప్రధానంగా అణుశక్తి, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, కార్పొరేట్, బీమా, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్, జాతీయ రహదారులు, మధ్యవర్తిత్వం- రాజీ చట్టాల సవరణ బిల్లులు ఉన్నా యి. వీటిలో అణుశక్తి రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని అనుమతించే అణుశక్తి బిల్లు-2025, వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు స్వయం ప్రతిపత్తి, కేంద్ర విద్యా కమిషన్ ఏర్పాటు లక్ష్యంగా రూపొందించిన ఉన్నత విద్యా కమిషన్ బిల్లు-2025 కీలకమైనవి.
సజావుగా సాగేందుకు సహకరించండి: కేంద్రం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. ఆదివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అర్జున్‌రామ్ మేఘవాల్, ఎల్.మురుగన్, అనుప్రియ పటేల్‌తోపాటు జైరామ్ రమేశ్ (కాంగ్రెస్), లావు శ్రీకృష్ణ దేవరాయలు (టీడీపీ), మిథున్‌రెడ్డి (వైసీపీ), సురేశ్‌రెడ్డి (బీఆర్‌ఎస్), బాలశౌరి (జనసేన) సహా 36 పార్టీల నుంచి 50 మంది నేతలు పాల్గొన్నారు. భేటీ అనంతరం కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. విపక్షాలు పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించాలని, ఆటంకాలు సృష్టించవద్దని కోరారు. ఇక అఖిలపక్ష భేటీలో రెండు గంటలపాటు విపక్షాల డిమాండ్లు విన్నారేగానీ ఏమాత్రం స్పందించలేదని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఉపనేత గౌరవ్ గొగోయ్ మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ మధ్య నదీ జలాల అంశాన్ని పరిష్కరించాలని కోరినట్టు బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి చెప్పారు. టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా కృష్ణా జలాల వినియోగం, కేటాయింపులపై పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్ చేశారు.
నేడు ఇండి కూటమి ప్రతినిధుల భేటీ
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆదివారం సాయంత్రం సోనియాగాంధీ నివాసంలో సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఏయే అంశాలపై నిలదీయాలనే దానిపై వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. ఇక రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే చాంబర్‌లో సోమవారం ఉదయం ఇండి కూటమి పార్టీల ప్రతినిధులు సమావేశం కానున్నారు. సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Justice B.V. Nagarathna: ఒకరి తీర్పును మరొకరు కొట్టివేయడం ఆందోళనకరం
PM Modi Praises Hyderabad Startup: భారత అంతరిక్షానికి ఇన్ఫినిటీ ఉత్సాహం