Justice B.V. Nagarathna: ఒకరి తీర్పును మరొకరు కొట్టివేయడం ఆందోళనకరం
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:02 AM
ఒక ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొంత కాలం తరువాత మరో ధర్మాసనం కొట్టివేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో చోటుచేసుకుంటుండడంపై...
జస్టిస్ నాగరత్న వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, నవంబరు 30: ఒక ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొంత కాలం తరువాత మరో ధర్మాసనం కొట్టివేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో చోటుచేసుకుంటుండడంపై న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న ఆందోళన వ్యక్తంచేశారు. తీర్పు రాసిన న్యాయమూర్తి పదవీ విరమణ చేశారనో, స్థానాన్ని మారారనో చెప్పి తీర్పులను కొట్టివేయకూడదని సూచించారు. దేశంలో చట్టబద్ధ పాలన అమలు చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉం దని స్పష్టం చేశారు. హరియాణాలోని సోనీపట్‌లో ఉన్న ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీలో న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై శనివారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆమె ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. న్యాయమూర్తి ఒకసారి ఇచ్చిన తీర్పు స్థిరంగా ఉంటుందంటూ చట్టవ్యవస్థ ఇచ్చిన భరోసా మేరకే న్యాయవ్యవస్థ స్వతంత్రత అన్న భావన వృద్ధి చెందిందని తెలిపారు. న్యాయమూర్తులు సిరాతో తీర్పులు రాస్తారని, ఆ తీర్పును గౌరవించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థలోని అందరు భాగస్వాములు, ప్రభుత్వ యం త్రాంగంపై ఉందని చెప్పారు. ఒకవేళ ఏవైనా అభ్యంతరాలు ఉంటే అది సంప్రదాయ విధానాలకు అనుగుణంగా జరగాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.