Share News

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ వ్యక్తికి వక్ఫ్ బోర్డ్ బంపర్ ఆఫర్

ABN , Publish Date - May 02 , 2025 | 03:39 PM

Pahalgam Terror Attack: పర్యాటకుల ప్రాణాలు రక్షించడానికి ధైర్య సాహసాలు ప్రదర్శించిన మృతుడు సయ్యద్ ఆదిల్‌కు ‘ బ్రేవరీ అవార్డు’ను ప్రకటించారు. ఈ అవార్డును వారి కుటుంబసభ్యులకు అందించారు. ఆదిల్ సోదరుడు సయ్యద్ నాజకత్ హుస్సేన్‌కు ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది.

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ వ్యక్తికి వక్ఫ్ బోర్డ్ బంపర్ ఆఫర్
Pahalgam Terror Attack

జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నపుడు 30 ఏళ్ల సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అక్కడే ఉన్నాడు. అతడు టూరిస్టులను తన గుర్రంపై స్వారీ చేయించి జీవనం సాగిస్తుండేవాడు. ఉగ్రవాదులు కాల్పులు చేస్తున్నపుడు ఆదిల్ మాత్రమే వారికి ఎదురు తిరిగాడు. వారినుంచి గన్నులు లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు అతడ్ని కాల్చి చంపేశారు. దాదాపు మూడు రౌండ్లు అతడి గుండెల్లో కాల్చారు. ఆదిల్ అక్కడికక్కడే చనిపోయాడు.


టూరిస్టులను కాపాడ్డానికి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టిన ఆదిల్‌పై కాశ్మీర్ వక్ఫ్ బోర్డు ప్రశంసలు కురిపించింది. అంతేకాదు.. ఆదిల్ సోదరుడు సయ్యద్ నాజకత్ హుస్సేన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతడికి ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జాబ్‌కు సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్‌ను నాజకత్‌కు అందించారు. అంతేకాదు.. పర్యాటకుల ప్రాణాలు రక్షించడానికి ధైర్య సాహసాలు ప్రదర్శించిన మృతుడు సయ్యద్ ఆదిల్‌కు ‘ బ్రేవరీ అవార్డు’ను ప్రకటించారు. ఈ అవార్డును వారి కుటుంబసభ్యులకు అందించారు.


ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు చైర్ పర్సన్ డాక్టర్ దరాక్షన్ మాట్లాడుతూ.. ‘ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా పోరాటానికి మద్దతు లభిస్తోంది. పర్యాటకులను కాపాడ్డానికి తన ప్రాణాలు త్యాగం చేసిన ఆదిల్ సోదరుడికి బోర్డులో ఉద్యోగం ఇవ్వాలని నిశ్చయించాం. ఆదిల్ గర్వంతో మా తలలు ఎత్తుకునేలా చేశాడు. ఆదిల్ సోదరుడికి ఉద్యోగం ఇస్తే అతడి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని అన్నారు. కాశ్మీర్ వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. బీజీపీ నేతలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Bilawal Bhutto: ఉగ్రవాద సంస్థలతో పాక్ సంబంధాలను ఒప్పుకున్న బిలావల్

Bill Gates: ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌కు అరుదైన వ్యాధి

Updated Date - May 02 , 2025 | 03:46 PM