Karur Stampede: ఆ పాపం విజయ్‌దే!
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:14 AM
తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఈ నెల 27న నిర్వహించిన తమిళ వెట్రి కళగం(టీవీకే) ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. టీవీకే అధ్యక్షుడు, ఇళయ దళపతి విజయ్‌ను తప్పుబట్టారు. ఈ ర్యాలీకి విజయ్ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా వచ్చారని....
జనాన్ని పోగేయడానికే కరూర్‌కు ఆలస్యంగా వచ్చారు
అనుమతి లేకుండా రోడ్‌షో చేశారు
విద్యుత్ సరఫరానూ ఆపేయమన్నారు
కరూర్ ఘోరంపై పోలీసుల ఎఫ్‌ఐఆర్
41కి చేరిన తొక్కిసలాట మృతుల సంఖ్య
చెన్నై/న్యూఢిల్లీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఈ నెల 27న నిర్వహించిన తమిళ వెట్రి కళగం(టీవీకే) ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. టీవీకే అధ్యక్షుడు, ఇళయ దళపతి విజయ్‌ను తప్పుబట్టారు. ఈ ర్యాలీకి విజయ్ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా వచ్చారని, అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారని పేర్కొన్నారు. టీవీకే జిల్లా కార్యదర్శి మథియాళగన్.. 10 వేల మందికి మాత్రమే అనుమతి తీసుకున్నారని.. కానీ, 25వేల మందికి పైగా ర్యాలీకి వచ్చారని పేర్కొన్నారు. జనసమూహాన్ని పోగేయడానికే.. ఉద్దేశ పూర్వకంగా విజయ్ ఆలస్యం చేశారని తెలిపారు. ‘‘నిర్ణీత సమయం కంటే 4 గంటల పాటు విజయ్ ఆలస్యంగా వచ్చారు. జనాలు భారీగా వచ్చారని రాజకీయంగా ప్రకటించుకునేందుకే ఇలా చేశారు. అప్పటికే వేలాదిగా చేరుకున్న ప్రజలు ఎండలో నిలబడి అలసిపోయారు. ఈ కారణంగానే తొక్కిసలాటలో 11 మంది అక్కడే చనిపోయారు’’ అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ‘‘వాస్తవానికి కరూర్ జిల్లా సరిహద్దుకు విజయ్ సాయంత్రం 4.45 గంటలకే చేరుకున్నారు. కానీ, అక్కడి నుంచి ఆయన కదలికలు ఆలస్యం చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారు. రాత్రి 7 గంటలకు వేలుసామిపురానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే నియంత్రించలేని స్థాయిలో జనాన్ని సమీకరించారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసు అధికారులు.. పరిస్థితి తీవ్రంగా మారిందని, ప్రజలకు ఊపిరాడే పరిస్థితి కూడా ఉండకపోవచ్చని మథియాళగన్‌ను హెచ్చరించారు. కానీ, ఆయన పట్టించుకోలేదు. చాలా మంది ప్రజలు విజయ్‌ను చూసేందుకు సమీపంలోని చెట్లెక్కారు. మరికొందరు రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాల పైకప్పులపైకి ఎక్కారు. దీంతో వారి బరువుతో అవి కుప్పకూలాయి. వాటి కింద ఉన్నవారు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. ఒకదశలో టీవీకే నేతలు విద్యుత్ సరఫరాను కూడా ఆపేయమన్నారు.’’ అని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. దీనిలో టీవీకే జిల్లా కార్యదర్శి మథియాళగన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుషి ఆనంద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్ పేర్లను చేర్చారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ సభ్యురాలు జస్టిస్ అరుణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలుసుకుని వివరాలు సేకరించారు. అదేవిధంగా ఘటన జరిగిన ప్రాంతంలోనూ పర్యటించి స్థానికులతో మాట్లాడారు.
విద్యుత్‌కోత విధించాలని టీవీకే కోరింది!
కరూర్‌లో విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో స్టాలిన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విద్యుత్ సరఫరా నిలిపివేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర విద్యుత్ బోర్డు ఖండించింది. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపేయాలని టీవీకే నిర్వాహకులు లేఖ ఇచ్చారని, అయితే ఆ వినతిని తాము తిరస్కరించామని బోర్డు అధికారులు తెలిపారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. కాగా, తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి పెరిగింది. కరూర్ ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ(61) సోమవారం కన్నుమూశారు. ప్రస్తుతం 11మంది ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, కరూర్ తొక్కిసలాట ఘటనపై బీజేపీ.. ఎనిమిది మంది ఎన్డీయే ఎంపీలతో కూడిన నిజనిర్ధారణ కమిటీని నియమించింది. ఈ బృందం కరూర్‌కు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించనుంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించి నివేదికను నడ్డాకు సమర్పించనుంది.
సెలవుల తర్వాతే విచారణ: హైకోర్టు
కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ టీవీకే దాఖలుచేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు మదురై ధర్మాసనం నిరాకరించింది. తొక్కిసలాటలో డీఎంకే కుట్ర ఉందని టీవీకే తన పిటిషన్‌లో ఆరోపించింది. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరింది. అయితే, ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో ఆ తర్వాతే పిటిషన్‌పై విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.
ఎవరినీ తప్పుబట్టలేం: నిర్మల
కరూర్ దుర్ఘటనలో ఎవరినీ తప్పుబట్టలేమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సోమవారం కరూర్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను కలిసి ఓదార్చారు. అనంతరం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని సూచనల మేరకు తాము కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా బాధితులను పరామర్శించేందుకు వచ్చామని తెలిపారు. నిర్మల వెంట కేంద్ర మంత్రి మురుగన్ తదితరులు ఉన్నారు. కాగా, ఈ ఘటనపై సీఎం స్టాలిన్ సోమవారం మరోమారు స్పందించారు. ఏ పార్టీ నాయకుడైనా తన కార్యకర్తలు, ప్రజలు మరణించాలని కోరుకోరని, ఘటనపై తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.