Venkaiah Naidu Meets Modi: మోదీతో వెంకయ్య భేటీ
ABN , Publish Date - Aug 11 , 2025 | 02:48 AM
గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ప్రధాని మోదీ సహా పలువురు
ఆర్‌ఎస్‌ఎస్ నేతలతోనూ మంతనాలు
ఉప రాష్ట్రపతి, బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక..
పార్టీ వ్యవహారాలు, రాజకీయాలపై చర్చ
న్యూఢిల్లీ, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ప్రధాని మోదీ సహా పలువురు ఆర్‌ఎ్‌సఎస్, సంఘ్ పెద్దలను కలుసుకున్నారు. కొద్ది రోజులుగా బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ మధ్య జరుగుతున్న పరిణామాలు, దేశ రాజకీయాలు, ఉప రాష్ట్రపతి నియామకం ఇతర సంస్థాగత అంశాలపై నేతలు వెంకయ్య సలహాలను కోరినట్లు తెలిసింది. శనివారం వెంకయ్య.. ప్రధాని నివాసానికి వెళ్లి దాదాపు 40 నిమిషాలపాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. ట్రంప్ టారి్‌ఫల పట్ల భారత్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలని, ఆ దేశంతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూనే మన ఆర్థిక, విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న విషయంలో వెంకయ్య అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. ఇక బీజేపీ అధ్యక్షుడి నియామకం కూడా త్వరలో జరుగుతుందని మోదీ ఆయనకు చెప్పినట్లు తెలిసింది. ఆదివారం ఉదయం వెంకయ్య ఢిల్లీలోని దేశ బంధు గుప్త రోడ్‌లో నూతనంగా నిర్మించిన ఆర్‌ఎ్‌సఎస్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆర్‌ఎ్‌సఎస్ నేతలతో పాటు పలువురు ప్రముఖులతో దాదాపు గంటకుపైగా ఏకాంతంగా చర్చలు జరిపారు. దేశ రాజకీయాలు, బీజేపీ అధ్యక్షుడి నియామకం, ఇతర అంశాలపై వారు మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం వెంకయ్య నివాసానికి బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) శివప్రకాశ్ వచ్చి సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై వారు చర్చించినట్లు తెలిసింది. ఆ తర్వాత ఐబీ ఆధికారులు వెంకయ్యను కలిశారు. ఇక, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు తెలిసింది. ధర్మేంద్ర ప్రదాన్, భూపేంద్ర యాదవ్‌తో పాటు కొంత మంది దక్షిణాది నేతల పేర్లు కూడా చర్చలో ఉన్నాయి.