Share News

Donald Trump: మేం ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నాం

ABN , Publish Date - Aug 09 , 2025 | 05:12 AM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట విరుచుకుపడిన విషయం తెలిసిందే

Donald Trump: మేం ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నాం

  • భారత్‌-పాక్‌ల మధ్య యుద్ధం ఆపాం

  • ఆపరేషన్‌ సిందూర్‌ కాల్పుల విరమణపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

వాషింగ్టన్‌, ఆగస్టు 8: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే..పాకిస్థాన్‌ వేడుకోలు మేరకు కాల్పులు నిలిపివేశామని భారత్‌ చెబుతుంటే, కాదు.. మా జోక్యంతోనే ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపేశాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే చెప్పారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మరోసారి ట్రంప్‌ మాటనే వల్లెవేశారు. ‘‘మేం ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నాం. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నిలువరించాం. శాంతిని నెలకొల్పే విషయంలో ట్రంప్‌ కీలకపాత్ర పోషించారు. ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపేస్తే.. భారీస్థాయిలో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. అందుకే ఇరు దేశాలు కాల్పులు విరమించాయి.’’అని రుబియో వ్యాఖ్యానించారు. గురువారం ‘ఈడబ్ల్యూటీఎన్‌’ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌-పాక్‌ల మధ్య కాల్పుల విరమణలో తమ జోక్యం ప్రత్యక్షంగా ఉందన్నారు. అధ్యక్షుడు ట్రంప్‌ను.. శాంతికి ప్రతిరూపమని అభివర్ణించారు. ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ పీస్‌’ (శాంతి అధ్యక్షుడు)గా పేర్కొన్నారు. ‘‘ట్రంప్‌ పాలనంతా శాంతిమయం. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘర్షణ ఏర్పడినా ఆయన శాంతి కాముకుడిలా వ్యవహరిస్తున్నారు. కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నాం.’’ అని వ్యాఖ్యానించారు.

ఎందుకు ఖండించరు?: కాంగ్రెస్‌

ఆపరేషన్‌ సిందూర్‌పై గతంలో ట్రంప్‌, తాజాగా రుబియో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ స్పందిస్తూ.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించింది. వారి వ్యాఖ్యలను నిర్దిష్టంగా ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించింది. అమెరికా వ్యాఖ్యలను ఖండించేందుకు ప్రధాని భయపడుతున్నారని ఎద్దే వా చేసింది. ఈమేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘మే 10న సాయంత్రం 5.35గంటలకు రుబియో స్పంది స్తూ.. భారత్‌-పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీనికి కార ణం అమెరికా జోక్యం చేసుకోవడమేనని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రంప్‌ 34సార్లు ఇదే మాట చెప్పారు. ఇప్పుడు మరోసారి రుబియో ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నామని, శాంతిని స్థాపించామని చెప్పారు. ఇంత జరుగుతున్నా మోదీ ఎందుకు బహిరంగంగా ఖండించలేకపోతున్నారు? అమెరికాఅంటే ఆయన భయపడుతున్నారా?’’అని ఎద్దేవా చేశారు.

Updated Date - Aug 09 , 2025 | 05:12 AM