Monkeys Drag Infant Drown: కోతుల దారుణం.. 2 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి..
ABN , Publish Date - Sep 06 , 2025 | 09:11 AM
పసికందు ఊయలలో నిద్రపోతూ ఉంది. కొన్ని కోతులు ఇంట్లోకి ప్రవేశించాయి. ఓ కోతి నిద్రపోతున్న పాపను పట్టుకుని బయటకు వచ్చింది. నేరుగా మేడపైకి ఎక్కింది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విషాదకరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కోతులు దారుణానికి ఒడిగట్టాయి. 2 నెలల పసికందును ఎత్తుకెళ్లి నీటి డ్రమ్ములో పడేశాయి. దీంతో ఆ చిన్నారి చనిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. సీతాపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ రెండు నెలల క్రితం డెలివరీ అయింది. చూడ చక్కనైన ఆడపిల్ల పుట్టింది. నిన్న మధ్యాహ్నం పాపను ఇంట్లో పడుకోబెట్టి తల్లి బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు.
పసికందు ఊయలలో నిద్రపోతూ ఉంది. కొన్ని కోతులు ఇంట్లోకి ప్రవేశించాయి. ఓ కోతి నిద్రపోతున్న పాపను పట్టుకుని బయటకు వచ్చింది. నేరుగా మేడపైకి ఎక్కింది. మేడపైన నీటితో నిండి ఉన్న డ్రమ్ములో పాపను పడేసి వెళ్లిపోయింది. పాప నీటిలో మునిగిపోతూ గట్టిగా ఏడవసాగింది. ఇంటికి తిరిగి వచ్చిన తల్లి పాప ఇంట్లో లేకపోవటం గమనించింది. పాప కోసం వెతకసాగింది. ఇంటి పైనుంచి పాప ఏడుపు వినిపించటంతో పైకి వెళ్లింది. నీటి డ్రమ్ములో ఉన్న పాపను బయటకు తీసింది. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది.
చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తేల్చారు. కన్నబిడ్డ చనిపోవటంతో ఆ తల్లి గుండెలు అవిసేలా ఏడ్చింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉందని, ప్రతీ రోజూ కోతులు మనుషులపై దాడి చేస్తూనే ఉన్నాయని అన్నారు. ఫారెస్ట్ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుని కోతుల బెడద నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
గూగుల్ కంపెనీపై భారీ ఫైన్.. ఈయూకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..
రైల్వే ప్రయాణికులకో గుడ్‌న్యూస్.. అదేంటో తెలిస్తే..