Police News: కూలిన పోలీస్ స్టేషన్ పైకప్పు.. ఊహించని విషాదం..
ABN , Publish Date - May 25 , 2025 | 02:58 PM
UP Cop Passed away: శనివారం రాత్రి పోలీస్ స్టేషన్‌లోనే నిద్రపోయాడు. రాత్రి భారీ వర్షం పడ్డం వల్ల.. పోలీస్ స్టేషన్ పైకప్పు మొత్తం ఊడి కిందపడింది. ఆ శిథిలాలు మీదపడి వీరేంద్ర అక్కడికక్కడే చనిపోయాడు.
దేశ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానాలలోనూ ఇదే పరిస్థితి. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పెద్ద పెద్ద చెట్లు నేల కొరిగాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా పోలీస్ స్టేషన్ పైకప్పు ఊడిపడిపోయింది. దీంతో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన వీరేంద్ర కుమార్ మిశ్రా.. అంకుర్ విహార్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం రాత్రి పోలీస్ స్టేషన్‌లోనే నిద్రపోయాడు. రాత్రి భారీ వర్షం పడ్డం వల్ల.. పోలీస్ స్టేషన్ పైకప్పు మొత్తం ఊడి కిందపడింది. ఆ శిథిలాలు మీదపడి వీరేంద్ర అక్కడికక్కడే చనిపోయాడు. ఆదివారం ఉదయం కొంతమంది పోలీసులు స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్ కుప్పకూలిపోయి ఉండటం గమనించారు.
అక్కడే శిథిలాల కింద వీరేంద్ర తీవ్రగాయాలతో కనిపించాడు. ఆ పోలీసులు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరేంద్రను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. కాగా, భారీ వర్షాల కారణంగా ఉత్తర ప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. మే 21 నుంచి మే 22 మధ్య కాలంలో వర్షాల కారణంగా 49 మంది చనిపోయారు. చెట్లు విరిగి మీదపడ్డం.. గోడలు కూలిపోవటం.. ఇంటి పైకప్పులు కూలిపోవటం, పిడుగుల కారణంగా ఈ మరణాలు చోటుచేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి
Relationship Tips: అత్తమామలతో గొడవపడి పుట్టింట్లో ఉంటున్నారా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..
Mann ki Baat: తెలంగాణ డ్రోన్ దీదీలపై ప్రధాని మోదీ ప్రశంసలు