Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్
ABN , Publish Date - May 13 , 2025 | 06:03 AM
ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశవ్యాప్తంగా అధికారులు యూనియన్ వార్ బుక్‌ను అనుసరించి యుద్ధ ప్రొటోకాల్ అమలు చేశారు. ప్రజల రక్షణ కోసం రూపొందించిన ఈ రహస్య మాన్యువల్ ద్వారా ప్రాణనష్టం, ఆస్తినష్టం తగ్గించగలిగారు.

న్యూఢిల్లీ, మే 12 : సరిహద్దు వెంబడి గ్రామాలు, పట్టణాల్లో ప్రమాదాన్ని శంకించగానే విద్యుత్ దీపాలు ఆర్పివేయడం, సైరన్లు మోగించడం, అక్కడి నుంచి ప్రజలను తరలించడం వంటి చర్యలను అధికారులు చకచకా చేపట్టడం ఆపరేషన్ సిందూర్ కొనసాగినంతకాలం చూశాం. ఆ చివర జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి ఈ చివర గుజరాత్‌లోని కచ్ వరకు.. అధికారులు ఒకేరకమైన యుద్ధ ప్రొటోకాల్‌ను సమర్థవంతంగా అమలుచేశారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం చాలావరకు తగ్గించగలిగారు. ప్రజలను ఈ సమయంలో అధికారులు ఎప్పటికప్పుడు గైడ్ చేయగా, వారిని ఓ రహస్య మాన్యువల్ గైడ్ చేసింది. అదే యూనియన్ వార్ బుక్. యుద్ధం వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందించాలో ఈ మాన్యువల్‌లో స్పష్టంగా మార్గదర్శకాలు ఉన్నాయి. పాక్‌తో సంఘర్షణ మొదలుకాగానే...‘యూనియన్ వార్ బుక్‌ను అనుసరించండి’ అంటూ దేశవ్యాప్తంగా అత్యున్నత స్థానాల్లో ఉన్న కీలక అధికారులకు ఆదేశాలు వెళ్లాయని సీనియర్ అధికార వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ఈ కథనాన్ని అనుసరించి...రెండువందల పేజీలతో నీలం రంగులో ఉన్న ఈ మాన్యువల్‌ను 2010లో కేంద్ర రక్షణ, హోంశాఖలు, కేబినెట్ సచివాలయ అధికారులు సంయుక్తంగా రూపొందించారు. ముంబైపై ఉగ్రదాడి జరిగిన రెండేళ్లతర్వాత దీనిని తయారుచేశారు. చాలా లిమిటెడ్ ఎడిషన్ ఇది. బయటలభ్యం కాదు. కేంద్ర మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల వద్ద మాత్రమే ఒక ప్రతి ఉంటుంది. సాయుధ సంఘర్షణ తలెత్తినప్పుడు ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాలు ఎలా ప్రతిస్పందించాలీ....ఎలా పనిచేయాలనే వివరాలు ఇందులో ఉంటాయి.