ఆయుధ దిగుమతుల్లో.. ఉక్రెయిన్ తర్వాత మనమే!
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:53 AM
రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ పెద్దఎత్తున ఆయుధ సమీకరణ చేస్తోంది.

న్యూఢిల్లీ, మార్చి 11: రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ పెద్దఎత్తున ఆయుధ సమీకరణ చేస్తోంది. ఆయుధ దిగుమతుల్లో ఆ దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలువగా.. పాకిస్థాన్, చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న భారత్ రెండో స్థానంలో ఉందని అంతర్జాతీయ స్వతంత్ర సాధికార విశ్లేషణ సంస్థ ‘స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రీ)’ వెల్లడించింది. అయితే 2014-19తో పోల్చితే గత నాలుగేళ్లలో భారత్ దిగుమతులు 9.3 శాతం తగ్గాయని సోమవారం విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది.
ఈ రిపోర్టు ప్రకారం.. 2015-19 నడుమ అమెరికా ఎగుమతుల వాటా 35 శాతం కాగా.. గత నాలుగేళ్లలో 43 శాతానికి పెంచుకుంది. ఆయుధ ఎగుమతుల పరంగా ఫ్రాన్స్ 9.6 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో చైనా (5.9ు), జర్మనీ (5.6), ఇటలీ (4.8), యూకే (3.6), ఇజ్రాయెల్ (3.1), స్పెయిన్ (3ు) నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా రక్షణ దిగుమతుల్లో ఉక్రెయున్ వాటా 8.8 శాతం కాగా.. భారత్ 8.3 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఉక్రెయిన్‌కు అందుతున్న ఆయుధాల్లో 45 శాతం అమెరికావే. ఇదిలా ఉండగా, పాక్ దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల్లో 81 శాతం చైనావే.