Share News

Maharashtra: ఫడణవీస్‌‌తో ఉద్ధవ్‌ భేటీ

ABN , Publish Date - Jul 18 , 2025 | 05:14 AM

మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయా? ఉద్ధవ్‌ ఠాక్రే మళ్లీ బీజేపీతో కలవనున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి.

Maharashtra: ఫడణవీస్‌‌తో ఉద్ధవ్‌ భేటీ

  • అధికార పక్షం వైపు రావాలని ఆహ్వానించిన మరుసటి రోజే సమావేశం

  • బీజేపీతో శివసేన (యూబీటీ) మళ్లీ దోస్తీ?

  • మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ

ముంబై, జూలై 17: మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయా? ఉద్ధవ్‌ ఠాక్రే మళ్లీ బీజేపీతో కలవనున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే గురువారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీ్‌సతో భేటీ అయ్యారు. విధాన మండలి చైర్మన్‌ రామ్‌ శిందే కార్యాలయంలో వీరిద్దరూ సమావేశం అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పక్షం వైపు రావాలంటూ ఉద్ధవ్‌ను ఫడణవీస్‌ ఆహ్వానించిన మరుసటి రోజే వీరిద్దరూ భేటీ కావడం గమనార్హం. బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీలో సీఎం ఫడణవీస్‌ మాట్లాడుతూ.. ‘‘2029 వరకు మేం ప్రతిపక్షంలోకి వెళ్లే అవకాశం లేదు. కాబట్టి ఉద్ధవ్‌ జీ అధికార పక్షం వైపు వచ్చే అవకాశాన్ని పరిశీలించాలి’’ అని అన్నారు.


మహారాష్ట్రలో బీజేపీ, శివసేన స్నేహం 2014 వరకు అప్రతిహతంగా సాగింది. 25 ఏళ్ల పాటు కలిసి సాగిన ఈ రెండు పార్టీల మధ్య 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సందర్భంగా విభేదాలు వచ్చాయి. అనంతరం 2019 ఎన్నికల్లో గెలిచాక బీజేపీకి ఝలక్‌ ఇచ్చిన ఉద్ధవ్‌.. కాంగ్రె్‌సతో చేతులు కలిపారు. అయితే, రెండున్నరేళ్ల తర్వాత ఫడణవీస్‌.. ఉద్ధవ్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు. 2022లో ఏక్‌నాథ్‌ శిందేతో తిరుగుబాటు చేయించి, శివసేనను చీల్చి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శిందే రెండేళ్లకు పైగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (శిందే) కూటమి రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేయడంతో ఫడణవీస్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలో త్రిభాషా విధానం అమలు విషయంలో కూటమి సర్కారుపై ఉద్ధవ్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఫడణవీస్‌.. ఉద్ధవ్‌ను అధికార పక్షం వైపు రావాలని ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - Jul 18 , 2025 | 05:14 AM