Share News

ICBM Development: రహస్యంగా అణ్వస్త్ర బాలిస్టిక్‌ క్షిపణి తయారీ!

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:13 AM

పాకిస్థాన్‌ రహస్యంగా అణ్వస్త్ర ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను (ఐసీబీఎం) అభివృద్ధి చేస్తోందని వాషింగ్టన్‌లోని అమెరికా నిఘా సంస్థలు వెల్లడించాయి. ఈ నిఘా సంస్థల నివేదిక ప్రకారం...

ICBM Development: రహస్యంగా అణ్వస్త్ర బాలిస్టిక్‌ క్షిపణి తయారీ!

  • ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్థాన్‌ దుశ్చర్య

  • అమెరికాను ఢీకొనే సామర్థ్యం వాటి సొంతం

  • వాషింగ్టన్‌లోని పలు నిఘా సంస్థల వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 25: పాకిస్థాన్‌ రహస్యంగా అణ్వస్త్ర ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను (ఐసీబీఎం) అభివృద్ధి చేస్తోందని వాషింగ్టన్‌లోని అమెరికా నిఘా సంస్థలు వెల్లడించాయి. ఈ నిఘా సంస్థల నివేదిక ప్రకారం... పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాక్‌.. చైనా సహాయంతో తన అణ్వాయుధాలను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని భావించింది. దానికోసం అమెరికాలోని లక్ష్యాలను సైతం ఛేదించగలిగే సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను రహస్యంగా అభివృద్ధి చేస్తోంది. అలాంటి క్షిపణులను అభివృద్ధి చేయడంగానీ, కొనుగోలు చేయడంగానీ చేస్తే పాక్‌ను అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తామని అమెరికా అధికారులు పేర్కొన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అణ్వాయుధ, సాంప్రదాయ వార్‌హెడ్‌లతో కూడిన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులు 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ప్రస్తుతం పాకిస్థాన్‌ వద్ద ఈ క్షిపణులు లేవు. కొంతకాలంగా ఈ దేశం స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణుల అభివృద్ధిపై దృష్టి సారించింది. 2022లో పాక్‌ భూ ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే మధ్య శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి షాహీన్‌-3ని పరీక్షించింది. ఇది 2,700 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. గతేడాది పాక్‌ చేపట్టిన లాంగ్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి అమెరికా ఆంక్షలు పెట్టింది. దాదాపు 170 అణ్వాయుధాలు కలిగి ఉన్న పాకిస్థాన్‌.. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై సంతకం చేయలేదు.


భారత్‌తో చర్చలకు సిద్ధం: పాక్‌ ప్రధాని

భారత్‌తో అర్థవంతమైన చర్చలు జరిపేందుకు సిద్ధమని పాకిస్ధాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. జమ్మూకశ్మీర్‌, నీళ్లు, వ్యాపారం, ఉగ్రవాదం అంశాలపై చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సుల్తాన్‌తో జరిపిన ఫోన్‌ సంభాషణలో ఆయన తెలిపారు. మే 7నాటి ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో షరీఫ్‌ ఈ ప్రతిపాదన తీసుకువచ్చారు. అయితే, పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. పాకిస్థాన్‌తో చర్చలు జరపాల్సి వస్తే సీమాంతర ఉగ్రవాదం, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అంశాలపై మాత్రమే చర్చిస్తామని భారత్‌ ఇప్పటికే తేల్చిచెప్పింది.


అభినందన్‌ను పట్టుకున్న అధికారి హతం

బాలాకోట్‌ దాడుల సమయంలో భారత వైమానిక దళ పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను 2019లో అదుపులోకి తీసుకున్న పాకిస్థాన్‌ సైనిక అధికారి మేజర్‌ మోయిజ్‌ అబ్బాస్‌ షా తాజాగా ఉగ్రవాదుల కాల్పుల్లో హతమయ్యాడు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని దక్షిణ వజీరిస్థాన్‌ జిల్లాలో తెహ్రిక్‌-ఎ-తాలిబన్‌-పాకిస్థాన్‌(టీటీపీ) ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అబ్బాస్‌ మరణించినట్టు పాకిస్థాన్‌ మిలిటరీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు సైన్యం అక్కడ ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ చేపట్టి టీటీపీకి చెందిన 11 మంది ఉగ్రవాదులను హతమార్చిందని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఉగ్రవాదుల కాల్పుల్లో అబ్బాస్‌ సహా ఇద్దరు అధికారులు మరణించారని తెలిపింది.

Updated Date - Jun 26 , 2025 | 05:13 AM