Donald Trump: పాక్ వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్ను!
ABN , Publish Date - Jun 21 , 2025 | 05:20 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్ గగనతలం, వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్నేశారు. ఇరాన్ విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌ను కోరారు.
ఇరాన్ అంశంలో మద్దతివ్వాలని సూచన
మీ సైనిక, వైమానిక స్థావరాలను వాడుకుంటాం
ప్రతిగా మీకు మా రక్షణ టెక్నాలజీని, ఐదోతరం జెట్‌లను, అత్యాధునిక ఆయుధాలనిస్తాం
భారీగా ఆర్థిక సాయం కూడా చేస్తాం
పాకిస్థాన్‌కు అమెరికా అధ్యక్షుడి ఆఫర్
ఇరాన్‌కు చైనా ఆయుధాలు?
ఇజ్రాయెల్‌కు 14 సైనిక రవాణా విమానాల్లో
ఆయుధాలు సరఫరా చేసిన అమెరికా, జర్మనీ
భారత్‌ను కాల్పుల విరమణ కోరింది మేమే
పాక్ ఉప ప్రధాని ఇషాక్‌దార్ ఒప్పుకోలు
న్యూఢిల్లీ, జూన్ 20: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్ గగనతలం, వైమానిక స్థావరాలపై ట్రంప్ కన్నేశారు. ఇరాన్ విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌ను కోరారు. తమకు బేషరతుగా వ్యూహాత్మక, సైనిక సహకారం అందించాలని సూచించారు. ఇరాన్ గురించి తమకంటే పాకిస్థాన్‌కే బాగా తెలుసని ట్రంప్ వ్యాఖ్యానించారు. మునీర్‌కు ట్రంప్ శ్వేతసౌధంలో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ లంచ్ భేటీ షెడ్యూల్ ప్రకారం గంటసేపు జరగాల్సి ఉండగా.. ట్రంప్, మునీర్ రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఆ సమయంలోనే ట్రంప్ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. పాక్‌లోని సైనిక, వైమానిక స్థావరాలను వాడుకుంటామని.. ప్రతిగా అధునాతన ఆయుధాలను అందజేస్తామని ట్రంప్ ఆఫర్ ఇచ్చినట్లు శ్వేతసౌధం వర్గాలు పేర్కొన్నాయి. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ట్రంప్ ఆఫర్ కలకలకం సృష్టిస్తోంది. ఇది భారత్-అమెరికా బంధాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ‘‘అమెరికా ఇరాన్‌పై యుద్ధానికి దిగితే, పాకిస్థాన్ మా వైపే ఉంటుందని భావిస్తున్నాం’’ అని అమెరికా సీనియర్ దౌత్యాధికారి ఒకరు సీఎన్‌ఎన్‌తో చెప్పారు.
పాకిస్థాన్‌లోని వైమానిక, సైనిక స్థావరాలు, క్షేత్రస్థాయిలో మద్దతు కోరినట్లు తెలిపారు. ప్రతిగా పాక్‌కు అత్యాధునిక ఆయుధాలను అందజేస్తామని ట్రంప్ మునీర్‌తో చెప్పినట్లు వెల్లడించారు. తమకు మద్దతిస్తే పాకిస్థాన్‌కు అమెరికా రక్షణ టెక్నాలజీని అందిస్తామని, ఐదో తరం స్టెల్త్ జెట్‌లు, అత్యాధునిక క్షిపణులను కూడా అందిస్తామని ఆఫర్ చేసినట్లు వివరించారు. అలాగే భారీ ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పినట్లు తెలిపారు. పాకిస్థాన్ చైనాతో సైనిక సంబంధాలు పెంచుకుంటున్న తరుణంలో అమెరికా ఈ భారీ ప్యాకేజీ ఇవ్వజూపడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేగాక రష్యా, చైనాతో దూరంగా ఉండాలన్న సందేశాన్ని ట్రంప్ పాక్ నాయకత్వానికి ఇచ్చినట్లయింది. ‘మా పాత భాగస్వామి (పాక్) తిరిగి మాతో కలిసి వస్తారని కోరుకుంటున్నాం’ అని శ్వేతసౌధం వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు భారత్‌తో సమస్యలపైనా మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ ఆఫర్ చేసినట్లు తెలిపాయి. కాగా, ట్రంప్-మునీర్ లంచ్ భేటీ సాధారణ దౌత్యమార్గాల ద్వారా ఏర్పాటు చేయలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రంప్ సలహాదారులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తుల బృందం చేసిన అసాధారణ ప్రయత్నాల వల్లే ఈ సమావేశం జరిగినట్లు చెబుతున్నాయి.