Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:15 AM
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఈశాన్య ఢి ల్లీలో తెల్లవారుజామున ఓ బహుళ అంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 11 మంది దుర్మరణం చెందారు.
11 మంది దుర్మరణం, 11 మందికి గాయాలు
తెల్లవారుజామున ముస్తఫాబాద్‌లో ఘటన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలో తెల్లవారుజామున ఓ బహుళ అంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 11 మంది దుర్మరణం చెందారు. మరో 11 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ), అగ్ని మాపక సిబ్బంది, ఢిల్లీ పోలీసులు, వాలంటీర్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు 12 గంటలకుపైగా శ్రమించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ముస్తఫాబాద్ ఏరియాలో ఉన్న 20 ఏళ్ల నాటి నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది.
ఘటన జరిగినప్పుడు భవనంలో 22 మంది ఉన్నారు. ఇందులోనే భవన యజమాని తెహసీన్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు నివసిస్తున్నారు. భవనం కూలిపోవడంతో తెహసీన్, మరో ఆరుగురు కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో రెండు మూడు దుకాణాలకు సంబంధించిన నిర్మాణ పనుల కారణంగా భవనం కూలిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కొత్త దుకాణంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఇవే భవనం కూలిపోవడానికి దారితీసి ఉండవచ్చని స్థానికులు కూడా వాపోతున్నారు. భవనం కూలిపోవడంతో పొరుగున ఉన్న ఇళ్ల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దుర్ఘటన పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.