Mobile scams; మోసపూరిత కాల్స్, ఎస్‌ఎంఎ్‌సలకు చెక్!
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:46 AM
దేశంలో 90 కోట్ల మందికి పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులున్నారు. వీరిలో ఎందరో మోసపూరిత కాల్స్, ఎస్‌ఎంఎ్‌సల బారిన పడుతున్నారు.

‘సంచార్ సాథీ’ మొబైల్ యాప్ తెచ్చిన డాట్
న్యూఢిల్లీ, జనవరి 17: దేశంలో 90 కోట్ల మందికి పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులున్నారు. వీరిలో ఎందరో మోసపూరిత కాల్స్, ఎస్‌ఎంఎ్‌సల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు టెలికాం విభాగం (డాట్) చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అనుమానిత కాల్స్, ఎస్‌ఎంఎ్‌సలను మరింత సులభతరంగా రిపోర్ట్ చేయడానికి వీలుగా డాట్ ‘సంచార్ సాథీ’ పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను తెచ్చింది. దీన్ని శుక్రవారం కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా విడుదల చేశారు. దీంతో వినియోగదారులు అనుమానిత కాల్స్, ఎస్‌ఎంఎ్‌సలను తమ మొబైల్ ఫోన్ కాల్ లాగ్స్ నుంచి నేరుగా రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కొత్త యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్లకు అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ పేరు మీద జారీ అయిన అన్ని మొబైల్ కనెక్షన్ల గురించి కూడా తెలుసుకోవచ్చు. దీని వల్ల తమ పేరుపై ఉన్న అనధికార కనెక్షన్ల వినియోగం జరగకుండా చూసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్ల బ్లాకింగ్ సదుపాయం కూడా కల్పించారు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ల ప్రామాణికతను సైతం తెలుసుకునే ఫీచర్ కూడా ఉంది. దీని వల్ల వినియోగదారులు అసలైన డివైజ్‌లను కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుంది. మోసపూరిత కాల్స్‌ను కట్టడి చేసేందుకు 2023లో డాట్ ‘సంచార్ సాథీ’ పోర్టల్‌ను ప్రారంభించింది. కొత్తగా తెచ్చిన యాప్ ద్వారా వీటికి మరింత సమర్థంగా చెక్ పెట్టే అవకాశం ఏర్పడనుంది. సంచార్ సాథీ మొబైల్ యాప్‌తో పాటు జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ 2.0 విజన్, ‘డిజిటల్ భారత్ నిధి’తో ఏర్పాటు చేసిన 4జీ మొబైల్ సైట్ల వద్ద ఇంట్రా సర్కిల్ రోమింగ్‌లను కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రారంభించారు.