Electrocuted During Kabaddi: కబడ్డీ మ్యాచ్ సందర్భంగా తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి..
ABN , Publish Date - Sep 21 , 2025 | 01:02 PM
టెంట్ కోసం భూమిలో పాతిన ఇనుప రాడ్డులో కరెంట్ పాస్ అయింది. ఈ విషయం తెలియని ఓ వ్యక్తి రాడ్డుపై చెయ్యి వేశాడు. అతడికి షాక్ కొట్టింది.
కబడ్డీ మ్యాచ్ సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ కారణంగా ముగ్గురు చనిపోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం కొండగావ్ ప్రాంతంలోని రవస్వాహీ గ్రామంలో కబడ్డీ మ్యాచ్ జరుగుతూ ఉంది. కొంతమంది మ్యాచ్ జరుగుతున్న ప్రాంతంలో టెంట్‌లో కూర్చున్నారు. ఎంతో ఆసక్తిగా మ్యాచ్ చూస్తూ ఉన్నారు.
ఇలాంటి సమయంలో టెంట్ కోసం భూమిలో పాతిన ఇనుప రాడ్డులో కరెంట్ పాస్ అయింది. ఈ విషయం తెలియని ఓ వ్యక్తి రాడ్డుపై చెయ్యి వేశాడు. అతడికి షాక్ కొట్టింది. అతడితో పాటు అతడ్ని పట్టుకున్న మరో ఐదుగురికి కూడా కరెంట్ షాక్ కొట్టింది. అందరూ అక్కడే కుప్పకూలిపోయారు. మ్యాచ్ ఆగిపోయింది. స్థానికులు బాధితులను హుటాహుటిన దగ్గరలోని విశ్రమ్‌పురి ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు ముగ్గురు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు.
ప్రాణాలతో బయటపడ్డ మరో ముగ్గురికి చికిత్స అందించారు. వీరిలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు విశ్రమ్‌పురి ఆస్పత్రికి వెళ్లారు. చనిపోయిన వారిని సతీష్ నేతమ్, శ్యామలా నేతమ్, సునీల్ శోరీలుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి
ట్రక్ నడుపుతూ అశ్లీల వీడియో చూశాడు.. కట్ చేస్తే..
రజినీకి గుడి కట్టి నవరాత్రి పూజలు చేస్తున్న అభిమాని..