Air force: సీబీఐ వలలోఎయిర్‌ఫోర్స్ అధికారి
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:19 AM
అడిగినంత కమీషన్ ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇంకే కాంట్రాక్టు దక్కకుండా చేయడంతో పాటు బ్లాక్ లిస్టులోకి పంపిస్తా...

కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్.. వేధింపులు
రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్.. విశాఖ సీబీఐ కోర్టులో హాజరు
బాపట్ల, జనవరి 6(ఆంధ్రజ్యోతి): అడిగినంత కమీషన్ ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇంకే కాంట్రాక్టు దక్కకుండా చేయడంతో పాటు బ్లాక్ లిస్టులోకి పంపిస్తా... ఇదీ బాపట్ల ఎయిర్‌ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి బెదిరింపులు! దీనిపై బాధిత కాంట్రాక్టర్ విశాఖపట్నంలోని సీబీఐ అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదు చేయడంతో ఆ అవినీతి అధికారిని బాపట్లలో రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే బాపట్లలో ఉన్న ఎయిర్ ఫోర్స్ విభాగంలో చైతన్యకుమార్ అనే వ్యక్తి లాజిస్టిక్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇతనికి ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదా కూడా ఉంది. ఎయిర్‌ఫోర్స్‌లో పరుపులు కొనే బిడ్‌ను రూ.4,99,500కు ఓ కాంట్రాక్టర్‌ను దక్కించుకున్నారు. వీటితో పాటు రూ.2 లక్షల విలువ చేసే మరో రెండు పనులను కూడా ఇదే కాంట్రాక్టర్ సదరు విభాగంలో దక్కించుకొని.. పనులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎయిర్‌పోర్స్ ఉద్యోగి కమీషన్ డిమాండ్ చేయడంతో పాటు తనకు లంచం ఇవ్వకపోతే ఇక్కడ పనులు చేయలేవని సదరు కాంట్రాక్టర్‌ను బెదిరించినట్లు సమాచారం.
నేరుగా సీబీఐ అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదు
చైతన్యకుమార్ వేధింపులతో బాఽధిత కాంట్రాక్టర్ విశాఖపట్నంలోని సీబీఐ అవినీతి నిరోధక విభాగానికి వారం క్రితం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. రెడ్ హ్యాండెడ్‌గా ఆ అవినీతి అధికారిని అదుపులోకి తీసుకుంది. ప్లాన్‌లో భాగంగా చైతన్యకుమార్‌కు లంచం ఇచ్చేందుకని కాంట్రాక్టర్‌తో ఫోన్ చేయించి.. ఆదివారం ఆయన్ను బాపట్ల రూరల్ గ్రామం భర్తిపూడికి రప్పించారు. అప్పటికే అక్కడ మాటు వేసిన సీబీఐ అఽధికారులు సదరు అధికారి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని విశాఖపట్నం సీబీఐ కోర్టులో సోమవారం హాజరుపరిచారు. సీబీఐ అధికారులు ఆరు వాహనాల్లో సోదాల కోసం భర్తిపూడికి వచ్చారని ఆదివారం కలకలం రేపిన విషయం తెలిసిందే. మధ్యాహ్నమే ఎయిర్‌ఫోర్స్ అధికారిని అదుపులోకి తీసుకుని సాయంత్రం వరకు అప్పికట్ల రైల్వేస్టేషన్‌లో ఉంచి విచారణ చేసినట్లు సమాచారం. కానీ పూర్తి వివరాలు ఇవ్వడానికి సీబీఐ అధికారులు నిరాకరించారు. సోమవారం విశాఖ సీబీఐ కోర్టులో హాజరుపర్చడంతో కేసు వివరాలు వెలుగులోకి వచ్చాయి.