Pani Puri: పానీపూరీ పవర్!
ABN , Publish Date - Jan 06 , 2025 | 05:14 AM
పానీ పూరీ.. మన దేశంలో ప్రసిద్ధమైన ఒక స్ట్రీట్ ఫుడ్! సాయంత్రం అయిందంటే చాలు చిన్న పట్టణాల నుంచి నగరాల వరకూ వీధుల్లో, రోడ్ల పక్కన పానీ పూరీ విక్రయించే బండ్ల ముందు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు బారులు తీరుతుంటారు.

ఏడాదిలో రూ.40 లక్షల డిజిటల్ లావాదేవీలు
దాంతో పానీపూరీ వ్యాపారికి జీఎస్టీ నోటీసులు
తమిళనాట ఘటన.. సోషల్ మీడియాలో వైరల్
రూ.40 లక్షల పరిమితి దాటితే జీఎస్టీ వర్తింపు
న్యూఢిల్లీ, జనవరి 5: పానీ పూరీ.. మన దేశంలో ప్రసిద్ధమైన ఒక స్ట్రీట్ ఫుడ్! సాయంత్రం అయిందంటే చాలు చిన్న పట్టణాల నుంచి నగరాల వరకూ వీధుల్లో, రోడ్ల పక్కన పానీ పూరీ విక్రయించే బండ్ల ముందు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు బారులు తీరుతుంటారు. లొట్టలు వేసుకుంటూ.. పానీ పూరీలను లాగించేస్తారు. ఈ వ్యాపారంలో అధిక సంఖ్యలోనే లావాదేవీలు ఉంటాయి. అది ఎంతలా అంటే.. తమిళనాడుకు చెందిన ఒక పానీపూరీ వ్యాపారికి జీఎస్టీ విభాగం నుంచి నోటీసులు వచ్చేంత! 2023-24 ఆర్థిక సంవత్సరంలో పోన్‌ఫే, రేజర్‌పేల ద్వారా రూ.40 లక్షలకు పైగా నగదు చెల్లింపులు జరిగాయని.. సదరు వ్యాపారి జీఎస్టీ కింద నమోదు చేసుకోలేదని నోటీసులు జారీచేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మీమ్స్, జోక్స్ పేలుస్తున్నారు. ఉద్యోగాలు చేసే వారి కంటే పానీపూరీ వ్యాపారం ఆదాయమే బెటర్ అని కామెంట్లు పెడుతున్నారు. ఎగుమతి అవకాశాలు, విదేశీ సహకారం కూడా అవసరం అవుతాయేమోనని హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు. పానీ పూరీ అమ్మకందారులు వ్యాపార దిగ్గజాలుగా మారే అవకాశం ఉందంటూ మరికొందరు పోస్టులు చేస్తున్నారు. ఇక, డిజిటల్ పేమెంట్లను అధికంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో.. ఇది వీధి వ్యాపారులను కూడా నెమ్మదిగా పన్ను వ్యవస్థ పరిధిలోకి తెచ్చేలా చేస్తోంది. ఇది భారత అసంఘటిత వ్యాపార రంగం భవిష్యత్తుపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది.