Marriage issues; భర్త చనిపోయిన 6 రోజులకు గుర్తించిన భార్య
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:18 AM
దంపతుల మధ్య ఏర్పడే అగాధం ఎంతటి విపరీతానికి దారి తీస్తుందో ఈ సంఘటనే ఓ ఉదాహరణ!

ఒకే ఇంట్లో ఉంటున్నా పదేళ్లుగా మాటల్లేవు
కోయంబత్తూరులో వెలుగుచూసిన ఘటన
చెన్నై, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): దంపతుల మధ్య ఏర్పడే అగాధం ఎంతటి విపరీతానికి దారి తీస్తుందో ఈ సంఘటనే ఓ ఉదాహరణ! ఒకే ఇంట్లో ఉంటున్నా ఆ దంపతుల మధ్య పదేళ్లుగా మాటల్లేవ్! దీంతో భర్త ఏమయ్యాడో కూడా తెలుసుకోలేకపోయిన భార్య.. ఎట్టకేలకు ఆరు రోజుల తర్వాత ఇంట్లోనే పడివున్న అతడి మృతదేహాన్ని గుర్తించింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది. కోయంబత్తూర్ ఇరుగూర్ ఈశ్వరన్ ఆలయ వీధిలో రాజమాణిక్యం (73), రాజసులోచన (63) దంపతులు నివాసముంటున్నారు. పిల్లలిద్దరికీ వివాహమై వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ దంపతుల మధ్య తలెత్తిన విభేధాల కారణంగా పదేళ్లుగా వారు మాట్లాడుకోవడం లేదు. మిద్దెపై ఉన్న గదిలో ఉంటున్న రాజమాణిక్యం, రోజూ కిందికి వచ్చి భోజనం, తాగునీరు తీసుకెళ్లేవాడు. ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీ మధ్యాహ్నం కిందికి వచ్చిన రాజమాణిక్యం.. అన్నం తీసుకెళ్లాడు. ఆయనకు అదే ఆఖరి భోజనం. ఆరు రోజులైనా అతడు కిందికి రాకపోవడంతో వేరే ఊరికి వెళ్లి ఉంటాడని రాజసులోచన భావించింది. ఈ క్రమంలో శనివారం రాత్రి పైగది నుంచి దుర్వాసన రావడంతో రాజసులోచన అక్కడికి వెళ్లగా, తలుపు మూసి ఉంది. కిటికీ నుంచి చూడగా, రాజమాణిక్యం మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.