Share News

ఫోన్‌ కాల్‌ లీక్‌.. ఇరకాటంలో థాయ్‌ ప్రధాని

ABN , Publish Date - Jun 21 , 2025 | 03:57 AM

థాయ్‌లాండ్‌ ప్రధానిగా 38 ఏళ్ల పేటోంగ్టార్న్‌ షినవత్రా పదవీ బాధ్యతలు చేపట్టి పది నెలలు అవుతోంది. అంతలోనే ఆమె రాజీనామా చేయాలన్న డిమాండ్‌ తీవ్రమైంది.

ఫోన్‌ కాల్‌ లీక్‌.. ఇరకాటంలో థాయ్‌ ప్రధాని

  • కాంబోడియా మాజీ నేతతో సరిహద్దు వివాదంపై చర్చ

  • ఫోన్‌ సంభాషణ లీక్‌ కావడంతో జనంలో ఆగ్రహం

న్యూఢిల్లీ, జూన్‌ 20: థాయ్‌లాండ్‌ ప్రధానిగా 38 ఏళ్ల పేటోంగ్టార్న్‌ షినవత్రా పదవీ బాధ్యతలు చేపట్టి పది నెలలు అవుతోంది. అంతలోనే ఆమె రాజీనామా చేయాలన్న డిమాండ్‌ తీవ్రమైంది. ఇందుకు కారణం ఆమె పొరుగుదేశమైన కాంబోడియా మాజీ నేత హున్‌సేన్‌కు చేసిన ఓ ఫోన్‌ కాల్‌ ఆడియో లీక్‌ కావడమే. ఫోన్‌ సంభాషణ సందర్భంగా ఆమె హున్‌సేన్‌ను అంకుల్‌ అంటూ సంబోధించడమేకాకుండా ఇరు దేశాల మధ్య తాజాగా నెలకొన్న సరిహద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరిపినట్టున్న ఆడియో లీక్‌ అయింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఆగ్రహం వెల్లువెత్తింది. ఆమె రాజీనామా చేయాలన్న డిమాండ్‌ తీవ్రమైంది. దీంతో ఆమె గురువారం క్షమాపణలు చెప్పారు. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న భూమ్‌జాయ్‌థాయ్‌పార్టీ తప్పుకోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. మరో రెండు భాగస్వామ్య పార్టీలు తమ పరిస్థితి గురించి ఆలోచనలో పడ్డాయి. హున్‌సేన్‌ గతంలో చాలాకాలం కాంబోడియాను పాలించారు.


ఆ తర్వాత ఆయన కుమారుడు హున్‌ మానెట్‌ 2023లో అధికార పగ్గాలు అందుకున్నారు. హున్‌సేన్‌ ఫోన్‌ కాల్‌ ఆడియోను పలువురు రాజకీయ నాయకులతో పంచుకున్నారు. అలాగే పూర్తి స్థాయి క్లిప్‌ను తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేశారు. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ కాంబోడియా రాయబారికి ఓ లేఖ ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేసింది. గత నెలలో జరిగిన ఒక ఘర్షణ సందర్భంగా కాంబోడియా సైనికుడు మృతి చెందడంతో ఇరుదేశాల మధ్య సరిహద్దు ఉద్రికత్తతలు రాజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. థాయ్‌ దిగుమతులను కాంబోడియా నిషేధించింది. సరిహద్దు వద్ద ఇరు దేశాలు కొత్తగా ఆంక్షలను విధించాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Updated Date - Jun 21 , 2025 | 03:57 AM