Delhi Rains: వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం
ABN , Publish Date - May 26 , 2025 | 02:30 AM
ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతాలు కుండపోత వర్షాలతో అతలాకుతలమయ్యాయి. విమానాశ్రయం నుంచి రహదారుల వరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు; ఒక అధికారి మృతిచెందారు.
గంటకు 82 కి.మీ వేగంతో గాలులు.. 200 విమానాలపై ప్రభావం
ఏసీపీ కార్యాలయం పైకప్పు కూలి పోలీసు అధికారి దుర్మరణం
రోడ్లపై నీళ్లు.. మునిగిన వాహనాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
కేరళలోనూ వర్షాల ఉధృతి.. మహారాష్ట్రను తాకిన రుతుపవనాలు
రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు.. యెల్లో అలెర్ట్ జారీ
2-3 రోజుల్లో ఏపీకి నైరుతి.. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
న్యూఢిల్లీ, మే 25: కుండపోత వర్షాలతో దేశ రాజధాని నగరం ఢిల్లీ అతలాకుతలమైంది. శనివారం అర్ధరాత్రి దాటాక మొదలై.. ఆదివారం ఉదయం వరకు తెరిపినివ్వకుండా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపించగా.. వాహనాలు నీట మునిగాయి. ఉరుములతో కూడిన వర్షానికి తోడు.. గంటకు 82 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో.. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో 200 విమానాలపై తీవ్ర ప్రభావం కనిపించింది. 49 విమానాలు రీ-షెడ్యూల్ అవ్వగా.. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. విమానాశ్రయం టెర్మినల్-1 వద్ద పైకప్పు దెబ్బతిని, వర్షపునీరు లీకవుతోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్‌సీఆర్-ఢిల్లీ వ్యాప్తంగా భారీ వర్షాల ప్రభావం కనిపించింది. చాలా చోట్ల విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయమేర్పడింది. పలు కాలనీల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది.

అండర్‌పా్‌సలు, రహదారులపై మోకాలి లోతు మొదలు.. ఐదారు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. వాహనాలు నీట మునిగాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఢిల్లీలోని పోలీసు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం పైకప్పు కూలడంతో.. ఓ అధికారి దుర్మరణం పాలయ్యారు. నగరంలోని చాలా చోట్ల 5-8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఆదివారం రాత్రి కూడా ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు.. గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో కేరళలో జనజీవనం స్తంభించిపోయింది. కోళికోడ్‌లో చెట్టు కూలి ఓ వృద్ధుడు మృతిచెందాడు. కాగా.. నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, గోవాలను తాకినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి
Minister Satyakumar: 2047 నాటికి ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ ఎదగడం ఖాయం
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..
Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్, దాని నీచమైన నిర్వాహకుడు పాక్.. నిప్పులు చెరిగిన అభిషేక్
India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి