Share News

Israel: యుద్ధ బీభత్సం

ABN , Publish Date - Jun 16 , 2025 | 05:37 AM

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం ముదురుతుండడంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా బ్రిటన్‌ తన సేనలను పశ్చిమాసియాకు తరలిస్తుండగా..

Israel: యుద్ధ బీభత్సం

మరింత విస్తరిస్తున్న ఇరాన్‌-ఇజ్రాయెల్‌ పోరు

  • టెహ్రాన్‌లో కారు బాంబులు.. ఆరుగురు అణు శాస్త్రవేత్తల మృతి

  • తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్‌ దాడులు

  • ఇరాన్‌లోని అతిపెద్ద ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తుల ప్రాంగణంపైనా..

  • టెహ్రాన్‌లో రక్షణశాఖ ఆఫీసు, పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ధ్వంసం

  • ఇజ్రాయెల్‌పైకి ఎయిర్‌డిఫెన్స్‌ కన్నుగప్పే హజ్‌ఖాసీం క్షిపణులు

  • అందుకే ఆ క్షిపణుల స్థావరాలపై దాడులు: నెతన్యాహు

  • ఇజ్రాయెల్‌ ‘వైజ్‌మన్‌ ఇన్‌స్టిట్యూట్‌’పై ఇరాన్‌ క్షిపణులు

  • అతిపెద్ద సైంటిఫిక్‌ కమ్యూనిటీకి ఆ సంస్థ ఆవాసం

  • 80 లక్ష్యాలపై ఇజ్రాయెల్‌ దాడి.. 128 మంది మృతి

  • టెల్‌అవీవ్‌ శివార్లలో విధ్వంసం.. 10 మంది దుర్మరణం

  • ఇజ్రాయెల్‌కు మద్దతుగా పశ్చిమాసియాకు బ్రిటన్‌ సేనలు

  • మా బేస్‌లపై దాడి చేస్తే ఇరాన్‌కు మూల్యం తప్పదు: ట్రంప్‌

టెల్‌అవీవ్‌/టెహ్రాన్‌/దుబాయ్‌, జూన్‌ 15: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం ముదురుతుండడంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా బ్రిటన్‌ తన సేనలను పశ్చిమాసియాకు తరలిస్తుండగా.. ఇరాక్‌లోని తమ సైనిక బేస్‌లపై దాడులు చేస్తే, ఇరాన్‌ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. భారత్‌-పాకిస్థాన్‌ మాదిరిగా ఇరాన్‌-ఇజ్రాయెల్‌ కలిసి చర్చలు జరిపి, యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. అటు ఇరాన్‌కు పాకిస్థాన్‌, తుర్కియే మద్దతిస్తుండగా.. మరికొన్ని ఇస్లామిక్‌ దేశాలు అండగా నిలవాలని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ పిలుపునిచ్చారు. ఇలా ఇరాన్‌-ఇజ్రాయెల్‌కు వేర్వేరు దేశాల మద్దతు పెరుగుతుండడంతో.. ఉద్రిక్తతలు మరింత విస్తరించే ప్రమాదాలున్నాయి.


మూడో రోజూ ఇరాన్‌కు నష్టాలు

మొదటి రోజు ఇరాన్‌ క్షిపణి కేంద్రాలు, అణు స్థావరాలు, మిలటరీ అధికారులనే లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్‌ దాడులు చేయగా.. శనివారం నుంచి ఆర్థిక మూలాలపై విరుచుకుపడుతోంది. బుషెహర్‌లోని అతిపెద్ద న్యాచురల్‌ గ్యాస్‌ క్షేత్రం(సౌత్‌ పార్స్‌), చమురు శుద్ధి కేంద్రంపై శనివారం రాత్రి దాడులు జరపగా.. ఆదివారం కూడా అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయి. టెహ్రాన్‌ సమీపంలోని మరో ఇంధన కేంద్రంపై ఆదివారం ఉదయం దాడి జరిగింది. ఈ చమురు క్షేత్రాలు సైన్యం కోసం పనిచేస్తుండడం వల్లే.. తాము వాటిని టార్గెట్‌గా చేసుకున్నామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. టెహ్రాన్‌ సమీపంలోని షిరాజ్‌లో ఉన్న అతిపెద్ద ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల పారిశ్రామిక ప్రాంతంపైనా ఇజ్రాయెల్‌ బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడింది. ఇక్కడ ఇరాన్‌ సైన్యం భారీగా ఆయుధాలను నిల్వచేసినట్లు ఇజ్రాయెల్‌ చెబుతోంది. ఇరాన్‌లోని మషాద్‌(ఇజ్రాయెల్‌ నుంచి 2,300 కిలోమీటర్ల దూరం)లో ఉన్న వైమానిక స్థావరంలో నిలిపి ఉన్న ఫైటర్‌ జెట్ల రీఫ్యూయలింగ్‌ విమానాన్ని ఆదివారం సాయంత్రం బాలిస్టిక్‌ క్షిపణితో కూల్చివేసినట్లు వివరించింది. టెహ్రాన్‌లోని రక్షణశాఖ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ చీఫ్‌ మహమ్మద్‌ కజేమీ, డిప్యూటీ చీఫ్‌ హసన్‌ మొహఖ్‌ చనిపోయినట్లు ఇజ్రాయెల్‌ ప్రధానిని ఉటంకిస్తూ ఫాక్స్‌న్యూస్‌ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ‘‘ఇక ఇప్పట్లో ఇరాన్‌ అణుశుద్ధి కార్యక్రమాలు జరపలేదు. ఆ విధంగా అక్కడి అణుస్థావరాలను నాశనం చేశాం. ఖమేనీతో సహా.. మా టార్గెట్‌ పరిధిలో ఉన్నారు’’ అని ఐడీఎ్‌ఫకు చెందిన ఓ సీనియర్‌ అధికారిని ఉటంకిస్తూ ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. శనివారం సాయంత్రం నుంచి ఇజ్రాయెల్‌ దాడులు ముమ్మరమయ్యాయి. గడిచిన మూడు రోజుల్లో ఇరాన్‌ వ్యాప్తంగా 406 మరణాలు నమోదవ్వగా.. 654 మంది క్షతగాత్రులైనట్లు మానవహక్కుల సంస్థలు ప్రకటించాయి. ఆదివారం ఒక్కరోజే 128 మంది మృతిచెందినట్లు తెలిపాయి.


పేలిన కారు బాంబులు

ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ లెబనాన్‌లో హిజ్బుల్లా నేతలనే లక్ష్యంగా చేసుకుని పేజర్‌, వాకీటాకీ బాంబులను పేల్చిన విషయం తెలిసిందే..! శనివారం సాయంత్రం ఇరాన్‌లోనూ అలాంటి దాడులే చేసింది. ఏకకాలంలో పలు కారు బాంబులను పేల్చి, ఆరుగురు అణు శాస్త్రవేత్తలను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్‌ మీడియా.. ఐదు కారుబాంబులు నమోదైనట్లు ఇరాన్‌ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. తాజా మరణాలతో.. మొత్తం 14 మంది అణు శాస్త్రవేత్తలు కన్నుమూసిన విషయాన్ని రాయిటర్స్‌, అరబ్‌ మీడియా నిర్ధారించాయి. తాజా దాడుల్లో అణుశాస్త్రవేత్త అలీ బకావీ, ఆయన కుటుంబం కూడా మృతిచెంది ఉంటారని ఇరాన్‌ అధికారిక వార్తాసంస్థ ఐఆర్‌ఎన్‌ఏ తెలిపింది.

ఇజ్రాయెల్‌లో 10 మంది మృతి

ఇరాన్‌ తొలిసారి తన అమ్ముల పొదిలోని భీకర అస్త్రాన్ని ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. ‘హజ్‌ ఖాసీం’ బాలిస్టిక్‌ మిసైల్‌ కారణంగా టెల్‌అవీవ్‌ శివార్లలోని పలు పట్టణాలు రూపురేఖలను కోల్పోయాయి. హజ్‌ ఖాసీంను గగనతల రక్షణ వ్యవస్థలు గుర్తించలేవని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికారి అబ్బాస్‌ అరాగ్చి వెల్లడించారు. ఈ క్షిపణి దాడులతో టెల్‌అవీవ్‌ శివార్లలోని బ్యాట్‌యామ్‌, గుష్‌డాన్‌, షెఫెలా, తామ్రా పట్టణాల్లో భారీ ఆస్తినష్టం సంభవించగా.. ఆదివారం ఒక్కరోజే నలుగురు చిన్నారులు సహా.. 10 మంది మృతిచెందారు. ఇజ్రాయెల్‌ తమ న్యూక్లియర్‌ సైంటిస్టులను మట్టుబెట్టిన నేపథ్యంలో ఇరాన్‌ ప్రతీకార దాడికి దిగింది. ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద సైంటిఫిక్‌ కమ్యూనిటీ (శాస్త్రవేత్తలు, పరిశోధనలకు ఆవాసం) అయిన వైజ్‌బన్‌ ఇన్‌స్టిట్యూట్‌పై డ్రోన్‌ దాడులు జరిగాయి. అప్పటికే శాస్త్రవేత్తలు, వారి కుటుంబాలు బంకర్లలో ఉండడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు. ‘‘ఇరాన్‌ వద్ద ఇలాంటి(హజ్‌ఖాసీం) క్షిపణులు వేలల్లో ఉంటే.. ఈ రోజు ఏం జరిగేదో ఆలోచించండి. అది ఇజ్రాయెల్‌ అస్తిత్వానికే ముప్పు అందుకే ఇరాన్‌ క్షిపణి కేంద్రాలను టార్గెట్‌గా చేసుకున్నాం’’ అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు బాట్‌యామ్‌లో కూలిన భవనాలను పరిశీలిస్తున్న సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా.. ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థలను దాదాపుగా ధ్వంసం చేశామని, ఇప్పుడు ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగలవని ఐడీఎఫ్‌ వాయుసేన ప్రకటించింది.


ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరికలు

ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు చేయడంతో ట్రంప్‌ సీరియస్‌ అయ్యారు. మరోమారు అమెరికా సైన్యం స్థావరాలపై దాడులు జరిగితే.. ఇరాన్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, టెహ్రాన్‌ రూపురేఖలను కోల్పోతుందని ఆయన హెచ్చరించారు. భారత్‌-పాకిస్థాన్‌ మాదిరిగా.. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ కూడా శాంతి చర్చలు జరిపి, యుద్ధాన్ని విరమించుకోవాలని సూచించారు.కాగా, అమెరికా, ఇరాన్‌ మధ్య ఆదివారం జరగాల్సిన అణు చర్చలు రద్దయ్యాయి. ఇజ్రాయెల్‌ భీకర దాడుల నేపథ్యంలో.. ఆ దేశానికి అమెరికా సహకరిస్తోందని ఇరాన్‌ ఆరోపిస్తూ.. ‘‘ఈ పరిస్థితుల్లో చర్చలకు అర్థం లేదు’’ అంటూ ఓ ప్రకటన చేసింది. మరోవైపు, ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీని అంతమొందించేందుకు ఇజ్రాయెల్‌ ప్రణాళిక రూపొందించిందని, తాను ఆ చర్యను అడ్డుకున్నానని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాయిటర్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే దీన్ని నెతన్యాహు ఖండించారు.


ఇజ్రాయెల్‌ ఆపితే.. మేమూ ఆపుతాం: ఇరాన్‌

ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులతో ఇరాన్‌ వెనక్కి తగ్గింది. ‘‘ఇజ్రాయెల్‌ మాపై దాడులను ఆపితే.. మేము కూడా ప్రతీకార దాడులను నిలిపివేస్తాం’’ అని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికారి అబ్బాస్‌ అరాగ్చి వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన వచ్చాక కూడా ఇజ్రాయెల్‌ నుంచి స్పందన లేకపోవడంతో.. ఇరాన్‌ తన ‘ఆపరేషన్‌ సాధిక్‌ ప్రామి్‌స-3’ని ఆదివారం రాత్రి ప్రారంభించింది. ఇజ్రాయెల్‌పైకి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగిస్తున్న దృశ్యాలను మీడియాకు విడుదల చేసింది. అదే సమయంలో.. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ)తో ఇకపై ఎలాంటి సమాచారాన్ని పంచుకోబోమని ప్రకటించింది.

Updated Date - Jun 16 , 2025 | 05:51 AM