Share News

Tejashwi Yadav Accuses: ఉపముఖ్యమంత్రికి రెండు ఓటరు కార్డులు

ABN , Publish Date - Aug 11 , 2025 | 02:55 AM

బిహార్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్‌ సిన్హాకు రెండు ఓటరు కార్డులు ఉన్నాయని ఆర్జేడీ నేత

Tejashwi Yadav Accuses: ఉపముఖ్యమంత్రికి రెండు ఓటరు కార్డులు

  • ఆయనపై ఏం చర్యలు తీసుకున్నారు: తేజస్వీ

పట్నా, ఆగస్టు 10: బిహార్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్‌ సిన్హాకు రెండు ఓటరు కార్డులు ఉన్నాయని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు. ఆయనపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఆదివారం పట్నాలో తేజస్వీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘విజయ్‌ కుమార్‌ సిన్హా రెండు వేర్వేరు జిల్లాల్లోని రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓటరు. లఖీసరాయ్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో సిన్హా పేరు ఉంది. పట్నా జిల్లాలోని బంకీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలోనూ ఆయన పేరుంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? సిన్హానా? లేక ఎన్నికల కమిషనా? సిన్హాపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? అని నిలదీశారు. తేజస్వీ ఆరోపణలపై విజయ్‌ కుమార్‌ సిన్హా స్పందించారు. ‘నాతోపాటు నా కుటుంబసభ్యుల పేర్లు బంకీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఉన్నాయి. లఖీసరాయ్‌లో మా పేర్లు చేర్చాలని 2024 ఏప్రిల్‌లో దరఖాస్తు చేశాం. అదే సమయంలో బంకీపూర్‌ నుంచి మా పేర్లు తొలగించాలని ఫామ్‌ ఇచ్చాను. ముసాయిదా జాబితాలో నా పేరుండటంతో బంకీపూర్‌లో నా పేరు తొలగించాలంటూ దరఖాస్తు ఇచ్చాను’ అని సిన్హా స్పష్టం చేశారు.

Updated Date - Aug 11 , 2025 | 02:55 AM