Class 11 Student: ప్రాణం తీసిన పుట్టిన రోజు కానుక.. బైకుపై వెళుతూ..
ABN , Publish Date - Nov 08 , 2025 | 09:42 PM
తండ్రి కొనిచ్చిన పుట్టిన రోజు కానుక ఓ యువకుడి ప్రాణాలు పోవడానికి కారణం అయింది. బైకుపై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఆ యువకుడు చనిపోయాడు. అతడి స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
పుట్టిన రోజు కానుక ఓ యువకుడి ప్రాణం తీసింది. తండ్రి కొనిచ్చిన బైకుపై వెళుతూ ఆ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. లక్నోకు చెందిన 17 ఏళ్ల వైభవ్ ఝా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు వారాల క్రితం వైభవ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తండ్రి అతడికి ఖరీదైన బైక్ కొనిచ్చాడు. కొడుకు ముఖంలో సంతోషం చూసి ఎంతో మురిసిపోయాడు.
ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. అతడు కొనిచ్చిన బైకే కొడుకు ప్రాణాలు పోవడానికి కారణం అయింది. శుక్రవారం ఉదయం వైభవ్ తన ఫ్రెండ్‌తో కలిసి బైకుపై కాలేజీకి బయలు దేరాడు. అశియానా ఏరియాలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న బైకు ప్రమాదానికి గురైంది. ఓ ప్రైవేట్ బస్ బైకును ఢీకొట్టింది. బైకు నడుపుతున్న వైభవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనకాల కూర్చున్న అతడి స్నేహితుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఇద్దర్నీ హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
వైభవ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. వైభవ్ స్నేహితుడు ప్రస్తుతం లోక్ బంధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక, యాక్సిడెంట్ చేసిన తర్వాత బస్ డ్రైవర్ బస్ ఆపకుండానే అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఓ ఆటో డ్రైవర్ బస్‌ను వెంబడించాడు. కొంత దూరం పోయిన తర్వాత బస్సును అడ్డగించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాడు. అతడ్ని పోలీసులకు అప్పగించాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్లే వైభవ్ చనిపోయినట్లు తేల్చారు. వైభవ్ మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవి కూడా చదవండి
ప్రమాదం అంచున ఢిల్లీ.. 400 దాటిన AQI
సోదరుడికి గుండెపోటు.. హుటాహుటిన ఆస్పత్రికి సూపర్ స్టార్